న్యూఢిల్లీ: ల్యాప్‌టాప్, కంప్యూటర్ దిగుమతుల విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక అడుగు ముందుకేసింది. దిగుమతిదారులకు లైసెన్సులను సజావుగా అందించడానికి కావాల్సిన ప్రమాణాల రూపకల్పనలో డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నిమగ్నమైంది.
ల్యాప్‌టాప్, కంప్యూటర్లపై ప్రభుత్వం దిగుమతి ఆంక్షలు విధించడంతో దిగుమతిదారులు నవంబర్ 1 నుండి డీజీఎఫ్‌టీ నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. తయారీ కంపెనీ గత పనితీరును ప్రామాణికంగా తీసుకుని గతంలో లైసెన్సు జారీ చేసేవారు. దిగుమతుల ఆంక్షల కారణంగా భారత్‌కు ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై నిశితంగా నిఘా ఉంచేందుకు దోహదపడతాయి. భవిష్యత్ వృద్ధి ఆశయాల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీని కీలక ప్రాధాన్యతగా భారత్ గుర్తించింది.
చైనా వెలుపల తమ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్న ప్రపంచ దిగ్గజ కంపెనీల నుండి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తున్న తరుణంలో ఈ నిర్ణ యం దేశీ య తయారీని ప్రోత్సహిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, పీసీలు, సర్వర్స్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద ఫాక్స్‌కాన్ గ్రూప్, హెచ్‌పీ, డెల్, లెనోవోతో సహా 38 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి.
భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల విలువ 2022–23లో 8.8 బిలియన్ డాలర్లు. ఇందులో పీసీలు/ల్యాప్‌టాప్‌ల వాటా 5.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పీసీలు/ల్యాప్‌టాప్‌ల ఎగుమతులు 163 బిలియన్ డాలర్లు. ఇందులో చైనా ఏకంగా 81 శాతం వా టా దక్కించుకుంది. లెనోవో, యాపిల్, డెల్, హెచ్ పీ అత్యధికంగా చైనాలో తయారు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment