Food technology courses
-
ప్రపంచం చూపు.. పాకశాస్త్రం వైపు..
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సహా యావత్ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు పాకశాస్త్ర ప్రావీణ్యుల కోసం వెతుకుతోంది. వివిధ దేశాల ఆహార అలవాట్లు, వారికి ఆతిథ్యం ఇచ్చే విధానంపై నెటిజన్లు ఇంటర్నెట్ను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ పర్యాటకం శరవేగంగా విస్తరిస్తుండటం, విభిన్నమైన ఫుడ్‌ను రుచి చూసేందుకు వారు ఇష్టపడుతుండటమే దీనికి కారణం. భారత్ సహా ప్రపంచ దేశాల పర్యాటకుల్లో 75 శాతం మంది తమ టూర్లలో ఆహారాన్ని కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఏ దేశం వెళ్తున్నాం? అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఏయే వెరైటీలు దొరుకుతాయి? అనే అంశాలను ఇంటర్నెట్లో వెతుకుతున్నారు.దీనితో పాకశాస్త్రంలో చేయితిరిగిన వంటగాళ్లకు డిమాండ్ పెరిగింది. వరల్డ్ టూరిజంలో ఫుడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం వచ్చే నాలుగేళ్లలో కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. 2023లో భారత్ పర్యాటక మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2033 నాటికి 182.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫ్యూచర్ మార్కెట్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ పర్యాటక వెబ్సైట్ అగోడా, మరికొన్ని ట్రావెల్ సంస్థలు చేసిన పలు అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. భారత్, థాయిలాండ్, లావోస్, టర్కీతోపాటు మరికొన్ని దేశాల ప్రయాణికులను ఆహారం విషయమై ప్రశ్నించారు.నిపుణులకు భలే గిరాకీ..ఒక అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ నిపుణులు 5 లక్షల వరకూ ఉంటారు. వారిలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. నైపుణ్యాన్ని, మార్కెట్‌ను బట్టి వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి. 2033 నాటికి ఈ వేతనాలు కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అగోడా అధ్యయనం చెబుతోంది. పర్యాటకులు అనేక అంశాలతో కూడిన ఆహారాన్ని అడుగుతున్నారని.. రకరకాల న్యూట్రిషన్లు, ఆయిల్ లేకపోవడం, కొన్నిరకాల పదార్థాలు లేకుండా ఉండటం వంటి కోరుతున్నారని పేర్కొంటోంది.అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేస్తూనే.. రుచిలో, ఇతర అంశాల్లో తేడా రాకుండా చూసుకునే నిపుణులైన వంటగాళ్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటలను సిద్ధం చేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటోందని వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల సిలబస్ మారుతోందని తెలిపింది. అంతేకాదు.. మన దేశం నుంచి ఫుడ్ టెక్నాలజీ నిపుణులను వివిధ దేశాలకు పంపి అక్కడి ప్రత్యేకతలపై ఇంటర్న్‌షిప్ అందించాలనేది భారత టూరిజం, ఫుడ్ టెక్నాలజీల విభాగం ఆలోచన. తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ తగిన విధంగా సిలబస్ మార్పులకు సిద్ధమవుతున్నాయి.తెలంగాణ వారసత్వ వంటలపై ఆసక్తివారసత్వ వంటలకు గిరాకీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ విస్తృతమయ్యాక ఈ తరహా అవగాహన పెరుగుతోంది. తెలంగాణ వంటల గురించి చాలా మంది వాకబు చేస్తున్నారు. – రాజీవ్ కాలే, హాలిడేస్ సంస్థ ప్రెసిడెంట్హైదరాబాదీ బిర్యానీకి యమ గిరాకీ..వరల్డ్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా దీని తయారీలోనూ మార్పులు కోరుతున్నారు. చాలా మంది బిర్యానీ కోసమే హైదరాబాద్‌ను ప్రయాణ జాబితాలో చేరుస్తున్నారు. – నందకుమార్, కార్పొరేట్ టూర్స్ సంస్థ ప్రెసిడెంట్ఏ అధ్యయనం ఏం చెబుతోంది?మారుతున్న ఆహార అలవాట్లు, పర్యాట కుల ప్రాధాన్యతలపై పలు సంస్థలు విభిన్న కోణాల్లో అధ్యయనాలు చేశాయి. ఆయా దేశాల్లో ఆర్థిక బలోపేతానికి ఫుడ్ టూరిజం దోహదపడుతోందని.. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు పెరుగు తోందని గుర్తించాయి. పలు ప్రధాన అధ్యయనాలను పరిశీలిస్తే..ప్రపంచవ్యాప్తంగా 95శాతం మంది ప్రయాణికులు సెలవుల్లో ప్రయాణించేందుకు, ఈ క్రమంలో తమను ఫుడ్ టూరిస్టులుగా చెప్పుకొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకునేందుకు కన్సల్టెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. – యూఎస్ ఆధారిత హాలిడే పోర్టల్ జెర్సీ ఐలాండ్ హాలిడేస్ప్రయా ణికుల్లో 53% మంది విదేశీ ప్రయా ణాలు, పర్యటనల్లో సరికొత్త ఆహారాన్ని కోరుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను చూసి ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో.. తమ దేశంలో లేని కొత్త ఫుడ్‌ను తీసుకుని అదే తరహాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. – ఫుడ్ ట్రావెల్ అసోసియేషన్ నివేదిక86శాతం మంది భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా ప్రయాణికులు స్థానిక వంటకాలను ఇష్టపడుతున్నారు. 78శాతం మంది ప్రజలు ఐకానిక్ వంటకాల వెనుక ఉన్న చరిత్ర, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – బుకింగ్ డాట్ కామ్ నివేదిక -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు గ్రీన్‌సిగ్నల్
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం కానిస్టిట్యూట్ కళాశాల అయిన జేఎన్టీయూ కలికిరిలో నూతనంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెడుతున్నారు. 2018–19 విద్యాసంవత్సరం నుండి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది. మొత్తం 60 సీట్లు భర్తీ చేసేందుకు ఏఐసీటీఈ బుధవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇంటర్ మీడియట్లో ఎంపీసీ పూర్తీ చేసి , ఎంసెట్‌లో ర్యాంకు వచ్చిన వారికి మెరిట్ ప్రాతిపదికగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో అడ్మిషన్ కల్పిస్తారు. కర్రికులమ్ ఖరారు బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సు ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. కర్రికలమ్ ( విద్యా ప్రణాళిక) , సిలబస్ రూపకల్పన పూర్తయింది. ఇందుకోసం బోర్డ్ఆఫ్ స్టడీస్ సభ్యులను, ఛైర్మన్లను ఇప్పటికే నియమించారు. కోర్సుకు సంబంధించిన అడ్వైయిజరీ కమిటీని నియమించారు. బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సుకు దీటుగా ఈ సిలబస్‌ను రూపొందించారు. 28న లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఈ నెల 28న అడ్హాక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూలు జేఎన్టీయూ అనంతపురం పాలక భవనంలో జరగనున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీని త్వరలో పూర్తిచేయనున్నారు. 50 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్‌లో అనుభవం గల ప్రొఫెసర్ రామకృష్ణను విజిటింగ్ ప్రొఫెసర్‌గా నియమించారు. సాంకేతిక మానవ వనరులు అవసరం కలికిరి చుట్టు పక్కల తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే 200 పుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో నిష్ణాతులైన సాంకేతిక మానవ వనరులు అవసరం. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇండస్ట్రీ కోర్సులు నిర్వహిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇందుకోసమే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చాం. – ప్రొఫెసర్ ఎస్ .శ్రీనివాస్ కుమార్,వీసీ, జేఎన్టీయూ అనంతపురం. -
నాణ్యమైన ఆహారాన్నిచ్చే.. ఫుడ్ టెక్నాలజీ
అప్‌కమింగ్ కెరీర్: ప్రపంచంలో మనిషి మనుగడకు ఆధారం... ఆహారం. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం దాకా ఆహారంలో మార్పులు చోటుచేసు కుంటున్నాయి. దేశాలను, ప్రాంతాలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఆహార అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. బతకడానికి ఏదో ఒకటి తింటే చాలు అనే భావన కనుమరుగైంది. నాణ్యమైన ఆహార పదార్థాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలున్న భోజనంపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యత కలిగిన ఆహారాన్ని ప్రజలకు అందించే నిపుణులే.. ఫుడ్ టెక్నాలజిస్ట్‌లు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా యువతకు భరోసా కల్పిస్తున్న కెరీర్.. ఫుడ్ టెక్నాలజీ. 2015 నాటికి 2 లక్షల కొత్త కొలువులు భారత్‌లో ఫుడ్ ఇండస్ట్రీ క్రమంగా వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, హోటల్, అగ్రి-ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమల్లో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల కు భారీ డిమాండ్ ఉంది. క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, హైజీన్, లేబొరేటరీ వంటి విభాగాల్లో కొలువులు ఉన్నాయి. ఆహారం, అనుబంధ రంగాల్లో వచ్చే ఏడాది నాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు ఓ అంచనా. ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల ప్రధాన విధి.. ఆహారం ఎక్కువకాలంపాటు నిల్వ ఉండేలా చూడడం. ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్లలో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల పాత్ర కీలకం. జామ్‌లు, జెల్లీలు, ఫ్రూట్ డ్రింక్స్, జ్యూస్‌లు తదితర తయారీ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. ఫుడ్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టాలంటే.. ఫిజికల్ సెన్సైస్, బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పట్టు ఉండాలి. కార్యాలయాలతోపాటు ప్రయోగశాలల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయగల సామర్థ్యం అవసరం. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ అవసరాలను, వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవాలి. ప్రయోగాల ద్వారా కొత్త పదార్థాల తయారీకి ప్రయత్నించాలి. అర్హతలు: మనదేశంలో పలు కళాశాలలు/ విశ్వవిద్యాలయాలు ఫుడ్‌టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత బీఎస్సీలో చేరొచ్చు. పీజీ, పీహెచ్డీ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి. వేతనాలు: ఫుడ్ టెక్నాలజీలో బీఎస్సీ పూర్తిచేసినవారికి ప్రారంభంలో ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారికి ఇంకా అధిక వేతనం ఉంటుంది. ఈ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి రూ.5 లక్షలు అందుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వేతనం లభిస్తుంది. ఇక జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.15 లక్షలకు పైగా పొందొచ్చు. ఫుడ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.osmania.ac.in ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.angrau.ac.in సీఎస్ఐఆర్- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వెబ్సైట్: www.cftri.com భాస్కరాచార్య కాలేజీ ఆఫ్ అప్లయిడ్ సెన్సైస్-ఢిల్లీ యూనివర్సిటీ. వెబ్సైట్: www.bcas.du.ac.in యూనివర్సిటీ ఆఫ్ బాంబే. వెబ్సైట్: www.mu.ac.in ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది ‘‘ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందరూ పోషకాహారంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించినవారికి కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలున్నాయి. మనదేశంలో ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది. సాధారణ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులకంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. టీచింగ్, రీసెర్చ, జాబ్ దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత కోర్సుల్లో చేరడం మంచిది. లేబొరేటరీలు, విద్యాసంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. నైపుణ్యాలను పెంచుకుంటే కెరీర్లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. సైంటిస్ట్‌గా ఎదిగితే నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకోవచ్చు. - డాక్టర్ ఆవుల లక్ష్మయ్య, డిప్యూటీ డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హైదరాబాద్ -
కౌన్సెలింగ్: కోర్సులు, కాలేజీల వివరాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రైవేటు కళాశాలల వివరాలను తెలియజేయండి? - సుప్రియా, అమీర్‌పేట ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే ప్రైవేటు కళాశాలలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష వీశాట్/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్‌ల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ.. ఎంటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) నాలుగేళ్ల బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని స్పెషలైజేషన్‌గా అందిస్తోంది. కేఎల్‌యూ ప్రవేశ పరీక్ష/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్డ్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో మూడేళ్ల బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, రెండేళ్ల ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో బీటెక్‌లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే కళాశాలలు రెండు మాత్రమే ఉన్నాయి. అవి.. 1. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బాపట్ల (గుంటూరు జిల్లా), 2.కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - పులివెందుల (వైఎస్సార్ జిల్లా). ఈ కళాశాలల్లో నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు. ఎంసెట్-2014లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు) మించరాదు. జేఎన్టీయూ- అనంతపురం, ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రభుత్వ రంగంలో రెండు కళాశాలలు మాత్రమే అందిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో.. కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (తిరుపతి), కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (కామారెడ్డి)లలో నాలుగేళ్ల బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. ఎంసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం ఉంటుంది. నేను పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను. లోకల్, నాన్ లోకల్ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? నాకు సీటు వస్తుందా? - రమ్య, కూకట్పల్లి వైద్య విద్యను అందించడంలో పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్మర్)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 సీట్లు పుదుచ్చేరి విద్యార్థులకు (పుదుచ్చేరిలో కనీసం ఐదేళ్లు నివాసం ఉన్నవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఏడాది ఉండాలి) కేటాయించారు. మిగిలిన 110 సీట్లను జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 50 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షలో ఓసీ విద్యార్థులు కనీసం 50 పర్సంటైల్, ఓసీ వికలాంగులు 45 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 40 పర్సంటైల్ సాధించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మీరు ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్‌లో సీటు పొందొచ్చు. నేను ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థినిని. నాకు పీజీఈసెట్-2014లో ఈసీఈ విభాగంలో 3599 ర్యాంకు వచ్చింది. ఉస్మానియా పరిధిలో ఏ కళాశాలలో నాకు సీటు లభించే అవకాశం ఉంది? - సంపూర్ణ, రాజేంద్రనగర్ గతేడాది పీజీఈసెట్ కౌన్సెలింగ్ డేటాను బట్టి మీకు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్- రంగారెడ్డి, అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ - హైదరాబాద్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - రంగారెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ - రంగారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్- రంగారెడ్డి మొదలైన కళాశాలల్లో మీకు సీటు లభించే అవకాశం ఉంది.