పర్యాటకంతోపాటు వేగంగా విస్తరిస్తున్న ఆహార రంగం
స్థానిక వంటకాలకే సై అంటున్న టూరిస్టులు.. ముందే ఇంటర్నెట్ వెతుకులాట
2033 నాటికి పాకశాస్త్ర నిపుణులకు భారీ వేతనాలు.. అగోడా, ఫుడ్ ట్రావెల్, బుకింగ్ డాట్‌కామ్ అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) సహా యావత్ ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు పాకశాస్త్ర ప్రావీణ్యుల కోసం వెతుకుతోంది. వివిధ దేశాల ఆహార అలవాట్లు, వారికి ఆతిథ్యం ఇచ్చే విధానంపై నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పడుతున్నారు. ప్రపంచ పర్యాటకం శరవేగంగా విస్తరిస్తుండటం, విభిన్నమైన ఫుడ్‌ను రుచి చూసేందుకు వారు ఇష్టపడుతుండటమే దీనికి కారణం. భారత్ సహా ప్రపంచ దేశాల పర్యాటకుల్లో 75 శాతం మంది తమ టూర్లలో ఆహారాన్ని కూడా ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు. ఏ దేశం వెళ్తున్నాం? అక్కడ దొరికే ఫుడ్ ఏమిటి? ఏయే వెరైటీలు దొరుకుతాయి? అనే అంశాలను ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారు.
దీనితో పాకశాస్త్రంలో చేయితిరిగిన వంటగాళ్లకు డిమాండ్ పెరిగింది. వరల్డ్ టూరిజంలో ఫుడ్ టెక్నాలజీ నిపుణుల అవసరం వచ్చే నాలుగేళ్లలో కనీసం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. 2023లో భారత్ పర్యాటక మార్కెట్ విలువ 23 బిలియన్ డాలర్లు ఉంది. ఇది 2033 నాటికి 182.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫ్యూచర్ మార్కెట్ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ పర్యాటక వెబ్‌సైట్ అగోడా, మరికొన్ని ట్రావెల్ సంస్థలు చేసిన పలు అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అధ్యయనంలో భాగంగా.. భారత్, థాయిలాండ్, లావోస్, టర్కీతోపాటు మరికొన్ని దేశాల ప్రయాణికులను ఆహారం విషయమై ప్రశ్నించారు.
నిపుణులకు భలే గిరాకీ..
ఒక అంచనా ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ నిపుణులు 5 లక్షల వరకూ ఉంటారు. వారిలో చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు. నైపుణ్యాన్ని, మార్కెట్‌ను బట్టి వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ వేతనాలు అందుతున్నాయి. 2033 నాటికి ఈ వేతనాలు కనీసం మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని అగోడా అధ్యయనం చెబుతోంది. పర్యాటకులు అనేక అంశాలతో కూడిన ఆహారాన్ని అడుగుతున్నారని.. రకరకాల న్యూట్రిషన్లు, ఆయిల్ లేకపోవడం, కొన్నిరకాల పదార్థాలు లేకుండా ఉండటం వంటి కోరుతున్నారని పేర్కొంటోంది.
అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేస్తూనే.. రుచిలో, ఇతర అంశాల్లో తేడా రాకుండా చూసుకునే నిపుణులైన వంటగాళ్లకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. అదే సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటలను సిద్ధం చేయగలిగినవారికి ప్రాధాన్యం ఉంటోందని వెల్లడించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల సిలబస్ మారుతోందని తెలిపింది. అంతేకాదు.. మన దేశం నుంచి ఫుడ్ టెక్నాలజీ నిపుణులను వివిధ దేశాలకు పంపి అక్కడి ప్రత్యేకతలపై ఇంటర్న్‌షిప్ అందించాలనేది భారత టూరిజం, ఫుడ్ టెక్నాలజీల విభాగం ఆలోచన. తెలంగాణలో ఇప్పటికే 50కిపైగా ఫుడ్ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. అవన్నీ తగిన విధంగా సిలబస్ మార్పులకు సిద్ధమవుతున్నాయి.
తెలంగాణ వారసత్వ వంటలపై ఆసక్తి
వారసత్వ వంటలకు గిరాకీ పెరిగింది. ఏఐ టెక్నాలజీ విస్తృతమయ్యాక ఈ తరహా అవగాహన పెరుగుతోంది. తెలంగాణ వంటల గురించి చాలా మంది వాకబు చేస్తున్నారు. – రాజీవ్ కాలే, హాలిడేస్ సంస్థ ప్రెసిడెంట్
హైదరాబాదీ బిర్యానీకి యమ గిరాకీ..
వరల్డ్ టూరిస్టులు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే బాగా ఇష్టపడుతున్నారు. మారుతున్న అలవాట్లకు అనుగుణంగా దీని తయారీలోనూ మార్పులు కోరుతున్నారు. చాలా మంది బిర్యానీ కోసమే హైదరాబాద్‌ను ప్రయాణ జాబితాలో చేరుస్తున్నారు. – నందకుమార్, కార్పొరేట్ టూర్స్ సంస్థ ప్రెసిడెంట్
ఏ అధ్యయనం ఏం చెబుతోంది?
మారుతున్న ఆహార అలవాట్లు, పర్యాట కుల ప్రాధాన్యతలపై పలు సంస్థలు విభిన్న కోణాల్లో అధ్యయనాలు చేశాయి. ఆయా దేశాల్లో ఆర్థిక బలోపేతానికి ఫుడ్ టూరిజం దోహదపడుతోందని.. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు పెరుగు తోందని గుర్తించాయి. పలు ప్రధాన అధ్యయనాలను పరిశీలిస్తే..
ప్రపంచవ్యాప్తంగా 95శాతం మంది ప్రయాణికులు సెలవుల్లో ప్రయాణించేందుకు, ఈ క్రమంలో తమను ఫుడ్ టూరిస్టులుగా చెప్పుకొనేందుకు ఇష్టపడుతున్నారు. మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుందని తెలుసుకునేందుకు కన్సల్టెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. – యూఎస్ ఆధారిత హాలిడే పోర్టల్ జెర్సీ ఐలాండ్ హాలిడేస్
ప్రయా ణికుల్లో 53% మంది విదేశీ ప్రయా ణాలు, పర్యటనల్లో సరికొత్త ఆహారాన్ని కోరుకుంటున్నారు. కొత్త ప్రదేశాలను చూసి ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో.. తమ దేశంలో లేని కొత్త ఫుడ్‌ను తీసుకుని అదే తరహాలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. – ఫుడ్ ట్రావెల్ అసోసియేషన్ నివేదిక
86శాతం
మంది భారత్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా ప్రయాణికులు స్థానిక వంటకాలను ఇష్టపడుతున్నారు. 78శాతం మంది ప్రజలు ఐకానిక్ వంటకాల వెనుక ఉన్న చరిత్ర, వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – బుకింగ్ డాట్ కామ్ నివేదిక
Comments
Please login to add a commentAdd a comment