కౌన్సెలింగ్: కోర్సులు, కాలేజీల వివరాలు | Private colleges offering special Courses for students | Sakshi
Sakshi News home page

కోర్సుల వివరాలపై కౌన్సెలింగ్

Published Wed, Jun 25 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

కౌన్సెలింగ్: కోర్సులు, కాలేజీల వివరాలు

కౌన్సెలింగ్: కోర్సులు, కాలేజీల వివరాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న ప్రైవేటు కళాశాలల వివరాలను తెలియజేయండి?
 - సుప్రియా, అమీర్‌పేట
     ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే ప్రైవేటు కళాశాలలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉన్నాయి. గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష వీశాట్/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్‌ల ఆధారంగా ప్రవేశం ఉంటుంది. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ.. ఎంటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. గుంటూరు జిల్లాలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) నాలుగేళ్ల బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీని స్పెషలైజేషన్‌గా అందిస్తోంది. కేఎల్‌యూ ప్రవేశ పరీక్ష/ఎంసెట్/జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్ ఆధారంగా ప్రవేశాలుంటాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో మూడేళ్ల బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, రెండేళ్ల ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
 
 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో బీటెక్‌లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందించే కళాశాలలు రెండు మాత్రమే ఉన్నాయి. అవి.. 1. కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - బాపట్ల (గుంటూరు జిల్లా), 2.కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ - పులివెందుల (వైఎస్సార్ జిల్లా). ఈ కళాశాలల్లో నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు. మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకు అర్హులు. ఎంసెట్-2014లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 22 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు) మించరాదు. జేఎన్‌టీయూ- అనంతపురం, ఆయిల్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సును అందిస్తోంది. డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రభుత్వ రంగంలో రెండు కళాశాలలు మాత్రమే అందిస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో.. కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (తిరుపతి), కాలేజ్ ఆఫ్ డెయిరీ టెక్నాలజీ (కామారెడ్డి)లలో నాలుగేళ్ల బీటెక్ డెయిరీ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉంది. ఎంసెట్ ర్యాంక్ ద్వారా ప్రవేశం ఉంటుంది.
 
 నేను పుదుచ్చేరిలో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను. లోకల్, నాన్ లోకల్ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి? నాకు సీటు వస్తుందా?
 - రమ్య, కూకట్‌పల్లి
     వైద్య విద్యను అందించడంలో పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(జిప్‌మర్)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తుంది. ఎంబీబీఎస్ కోర్సులో మొత్తం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 సీట్లు పుదుచ్చేరి విద్యార్థులకు (పుదుచ్చేరిలో కనీసం ఐదేళ్లు నివాసం ఉన్నవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఏడాది ఉండాలి) కేటాయించారు. మిగిలిన 110 సీట్లను జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. 50 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్షలో ఓసీ విద్యార్థులు కనీసం 50 పర్సంటైల్, ఓసీ వికలాంగులు 45 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 40 పర్సంటైల్ సాధించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి మీరు ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్‌లో సీటు పొందొచ్చు.
 
 నేను ఓసీ కేటగిరీకి చెందిన విద్యార్థినిని. నాకు పీజీఈసెట్-2014లో ఈసీఈ విభాగంలో 3599 ర్యాంకు వచ్చింది. ఉస్మానియా పరిధిలో ఏ కళాశాలలో నాకు సీటు లభించే అవకాశం ఉంది?
     - సంపూర్ణ, రాజేంద్రనగర్
     గతేడాది పీజీఈసెట్ కౌన్సెలింగ్ డేటాను బట్టి మీకు మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్- రంగారెడ్డి, అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ - హైదరాబాద్, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ - రంగారెడ్డి, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ - రంగారెడ్డి, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్- రంగారెడ్డి మొదలైన కళాశాలల్లో మీకు సీటు లభించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement