నాణ్యమైన ఆహారాన్నిచ్చే.. ఫుడ్ టెక్నాలజీ
అప్‌కమింగ్ కెరీర్: ప్రపంచంలో మనిషి మనుగడకు ఆధారం... ఆహారం. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం దాకా ఆహారంలో మార్పులు చోటుచేసు కుంటున్నాయి. దేశాలను, ప్రాంతాలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఆహార అలవాట్లు వేర్వేరుగా ఉంటాయి. బతకడానికి ఏదో ఒకటి తింటే చాలు అనే భావన కనుమరుగైంది. నాణ్యమైన ఆహార పదార్థాలపై ప్రజల్లో అవగాహన పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలున్న భోజనంపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాణ్యత కలిగిన ఆహారాన్ని ప్రజలకు అందించే నిపుణులే.. ఫుడ్ టెక్నాలజిస్ట్‌లు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా యువతకు భరోసా కల్పిస్తున్న కెరీర్.. ఫుడ్ టెక్నాలజీ.
2015 నాటికి 2 లక్షల కొత్త కొలువులు
భారత్‌లో ఫుడ్ ఇండస్ట్రీ క్రమంగా వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఫుడ్ టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, హోటల్, అగ్రి-ప్రొడక్ట్స్ వంటి పరిశ్రమల్లో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల కు భారీ డిమాండ్ ఉంది. క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్, హైజీన్, లేబొరేటరీ వంటి విభాగాల్లో కొలువులు ఉన్నాయి. ఆహారం, అనుబంధ రంగాల్లో వచ్చే ఏడాది నాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు ఓ అంచనా. ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల ప్రధాన విధి.. ఆహారం ఎక్కువకాలంపాటు నిల్వ ఉండేలా చూడడం. ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ ప్రాసెసింగ్ యూనిట్లలో ఫుడ్ టెక్నాలజిస్ట్‌ల పాత్ర కీలకం. జామ్‌లు, జెల్లీలు, ఫ్రూట్ డ్రింక్స్, జ్యూస్‌లు తదితర తయారీ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి.
ఫుడ్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టాలంటే.. ఫిజికల్ సెన్సైస్, బయాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులపై పట్టు ఉండాలి. కార్యాలయాలతోపాటు ప్రయోగశాలల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయగల సామర్థ్యం అవసరం. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. మార్కెట్ అవసరాలను, వినియోగదారుల అభిరుచులను తెలుసుకోవాలి. ప్రయోగాల ద్వారా కొత్త పదార్థాల తయారీకి ప్రయత్నించాలి.
అర్హతలు: మనదేశంలో పలు కళాశాలలు/ విశ్వవిద్యాలయాలు ఫుడ్‌టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైన తర్వాత బీఎస్సీలో చేరొచ్చు. పీజీ, పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే మంచి అవకాశాలు ఉంటాయి.
వేతనాలు: ఫుడ్ టెక్నాలజీలో బీఎస్సీ పూర్తిచేసినవారికి ప్రారంభంలో ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారికి ఇంకా అధిక వేతనం ఉంటుంది. ఈ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏడాదికి రూ.5 లక్షలు అందుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల వేతనం లభిస్తుంది. ఇక జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుంటే ఏడాదికి రూ.15 లక్షలకు పైగా పొందొచ్చు.
ఫుడ్ టెక్నాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
వెబ్‌సైట్: www.angrau.ac.in
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్
ఇన్‌స్టిట్యూట్. వెబ్‌సైట్: www.cftri.com
భాస్కరాచార్య కాలేజీ ఆఫ్ అప్లయిడ్ సెన్సైస్-ఢిల్లీ
యూనివర్సిటీ. వెబ్‌సైట్: www.bcas.du.ac.in
యూనివర్సిటీ ఆఫ్ బాంబే.
వెబ్‌సైట్: www.mu.ac.in
ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది
‘‘ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. అందరూ పోషకాహారంపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఈ రంగంలో ప్రావీణ్యం సంపాదించినవారికి కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలున్నాయి. మనదేశంలో ఫుడ్ టెక్నాలజీ రంగం పుంజుకుంటోంది. సాధారణ బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులకంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులతో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. టీచింగ్, రీసెర్‌చ, జాబ్ దేనికి ప్రాధాన్యతనివ్వాలనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత కోర్సుల్లో చేరడం మంచిది. లేబొరేటరీలు, విద్యాసంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. నైపుణ్యాలను పెంచుకుంటే కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. సైంటిస్ట్‌గా ఎదిగితే నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకోవచ్చు.
- డాక్టర్ ఆవుల లక్ష్మయ్య, డిప్యూటీ డెరైక్టర్,
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్), హైదరాబాద్