Footwear Manufacturing Company
-
‘చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్ సెజ్!
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్), విశాఖపట్నంలోని బ్రాండిక్స్ సెజ్ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎకరం రూ.6.5 లక్షలు వచ్చే పదేళ్లలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్ హోదా వచి్చన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి ఉద్యోగికి 12 నెలల పాటు ప్రతినెలా ఇచ్చే రూ.1,500 అలవెన్స్‌తో పాటు ఐదేళ్లపాటు చౌక ధరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు. మాంబట్టు అపాచీలో భాగస్వామి హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ సంస్థ ఇండియాలో ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. ఇదే సంస్థ నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్వేర్ సెజ్‌లో భాగస్వామి. రాష్ట్రంలో 2006లో మొదలైన ఈ సంస్థ నెలకు 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. -
చెప్పులో జీఎస్టీ రాయి!
సాక్షి, అమరావతి : విజయవాడలో కొత్తగా ఉద్యోగంలో చేరిన శ్రీకృష్ణ చెప్పులు కొనుక్కుందామని వెళ్లాడు. ఎన్ని షాపులు తిరిగినా అతనికి ఉంటే రూ.500లోపు ధరలో లభిస్తున్నాయి లేకపోతే వెయ్యి దాటితే కానీ దొరకడంలేదు. దీనితో విసుగొచ్చిన అతను.. ఏమిటయ్యా ఉంటే తక్కువ ధరలో ఉంటున్నాయి లేకపోతే అధిక ధరలో ఉంటున్నాయి.. మాలాంటి మధ్య తరగతి వాళ్ల బడ్జెట్లో మోడల్స్ లేవేంటి అని ప్రశ్నిస్తే షాపు వారి నుంచి ఇదంతా జీఎస్టీ మహిమ అన్న సమాధానం వచ్చింది. చెప్పుల మోడళ్లకు జీఎస్టీకి సంబంధం ఏమిటో శ్రీకృష్ణకు అర్థంకాలేదు.. ఇదీ ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత దేశంలో పాదరక్షల పరిశ్రమ ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి. ఎక్కడా లేని విధంగా జీఎస్టీలో రెండు రకాల పన్నులను విధించడంతో రూ.500లోపు, లేదా రూ.1,000పైన మోడళ్లే ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. జీఎస్టీలో విధిస్తున్న 5%, 18% పన్నులే ఇందుకు కారణం. రూ.500లోపు ధర ఉంటే కేవలం 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే రూ.500 దాటితే ఏకంగా 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఉదాహరణకు.. రూ.500 పెట్టి చెప్పుల జత కొంటే జీఎస్టీ రూ.25 చెల్లించాలి. అదే రూ.501 అయితే.. పన్ను ఏకంగా రూ.90 జీఎస్టీ చెల్లించాలి. ఒక్క రూపాయి పెరిగితే ఏకంగా రూ.65పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు పరిశ్రమకు పెద్ద గుదిబండగా మారింది. తగ్గిన మోడళ్లు చెప్పుల ధర రూ.500 దాటిన తర్వాత ఒక్కసారిగా పన్ను మూడు రెట్లు పెరగడంతో పాదరక్షల తయారీ పరిశ్రమ రూ.500–1,000 రేంజ్లో చెప్పుల తయారీని దాదాపుగా నిలిపివేశాయి. ఇప్పటివరకు రూ.600, 700 శ్రేణిలో ఉన్న పాదరక్షలను పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి రిటైలర్లకు కమీషన్లు తగ్గించి రూ.500కు తీసుకొచ్చాయని, అదే విధంగా మిగిలిన మోడళ్లను రూ.1,000 శ్రేణికి పెంచేశాయని రిటైల్ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న పాదరక్షల అమ్మకాల్లో 61శాతం రూ.500 ధరలోపే ఉండగా, రూ.501–1000 శ్రేణి అమ్మకాలు 20శాతంగా ఉన్నాయి. అదే, జీఎస్టీ రాకముందు రూ.500లోపు అమ్మకాలు 40–50 శాతం ఉండగా, రూ.500 నుంచి రూ.1,000లోపు అమ్మకాలు 30–40 శాతం ఉండేవి. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత ఈ శ్రేణి 20 శాతానికి పడిపోయిందని, రానున్న కాలంలో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని రిటైల్ సంస్థలు భావిస్తున్నాయి. కానీ, విలువ పరంగా చూస్తే మాత్రం అమ్మకాల్లో రూ.1,000 దాటిన వాటి వాటా 50 శాతంగా ఉంటే రూ.500లోపు పాదరక్షల అమ్మకాల ద్వారా 27 శాతం ఆదాయం మాత్రమే వస్తోంది. పన్నుల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటంవల్ల మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారిందని, రెండు పన్నులను తీసేసి మొత్తం తక్కువ స్థాయిలో ఒకే పన్ను విధానం అమలుచేస్తే బాగుంటుందని సామాన్యులు సూచిస్తున్నారు. 12 శాతం శ్లాబుల్లోకి తీసుకురావాలి గతంలో లెదర్, నాన్ లెదర్ అని రెండు రకాల పన్నులు ఉండేవి. జీఎస్టీ వచ్చిన తర్వాత దీన్ని తొలిగించి ధర రూ.500లోపు అయితే 5 శాతం, రూ.500 దాటితే 18 శాతం పన్నును విధించారు. దీనివల్ల పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలా పన్నును ఒకేసారి భారీగా పెంచడంవల్ల అవకతవకలకు ఆస్కారం ఇచ్చినట్లు అవుతుంది. దీన్ని తొలగించాలంటే ఏకపన్ను విధానంలో 12 శాతం పన్ను విధిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. – బీఎస్ కోటేశ్వరరావు, ఎండీ, ప్రాఫిట్ షూ కంపెనీ లిమిటడ్ -
ఆన్లైన్ విక్రయాల కోసం బాటా ప్రత్యేక పోర్ట్‌ఫోలియో
కోల్‌కతా : ప్రముఖ ఫుట్‌వేర్ తయారీ కంపెనీ బాటా కేవలం ఆన్లైన్ విక్రయాల కోసం ఒక ప్రత్యేక పోర్ట్‌ఫోలియోను ఏర్పాటుచేసింది. ఈ పోర్ట్‌ఫోలియోలో వినియోగదారుల కోసం 500 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచామని కంపెనీ గ్రూప్ ఎండీ (దక్షిణాసియా) ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. కంపెనీ మొత్తం ఆదాయంలో ఆన్లైన్ విక్రయాల వాటా భవిష్యత్తులో 5 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న కస్టమర్ల సంఖ్యను 2 కోట్లకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.