‘చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌! | AGovernment Ppproved to Intelligent Sez Development Proposal | Sakshi
Sakshi News home page

‘చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌!

Published Thu, Oct 17 2019 4:08 AM | Last Updated on Thu, Oct 17 2019 4:08 AM

AGovernment Ppproved to Intelligent Sez Development Proposal - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌), విశాఖపట్నంలోని బ్రాండిక్స్‌ సెజ్‌ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్‌ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

ఎకరం రూ.6.5 లక్షలు
వచ్చే పదేళ్లలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్‌ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్‌ హోదా వచి్చన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కింద ప్రతి ఉద్యోగికి 12 నెలల పాటు ప్రతినెలా ఇచ్చే రూ.1,500 అలవెన్స్‌తో పాటు ఐదేళ్లపాటు చౌక ధరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

మాంబట్టు అపాచీలో భాగస్వామి
హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్‌ ఇన్వెస్టిమెంట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇండియాలో ఇంటెలిజెంట్‌ సెజ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను అందిస్తోంది. ఇదే సంస్థ నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్‌వేర్‌ సెజ్‌లో భాగస్వామి. రాష్ట్రంలో 2006లో మొదలైన ఈ సంస్థ నెలకు 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement