వచ్చే ఐదేళ్లలో ఐదువేల స్టోర్లు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
అభివృద్ధి చెందుతున్న ఎమర్జింగ్ ఎకానమీగా ఇండియా ఎదుగుతోంది. దాంతో అంతర్జాతీయంగా చాలాదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షిస్తోంది. అందులో భాగంగానే గ్లోబల్ రిటైల్ కంపెనీలు ఇండియా బాట పడుతున్నాయి. దేశీయ వినియోదారులను ఆకర్షించడానికి పెద్ద మొత్తంలో స్టోర్లు ఓపెన్ చేస్తున్నాయి. యువత గ్లోబల్ బ్రాండ్లకు ఆకర్షితులు అవుతుండడంతో ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవాలని కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
ఈ ఏడాది ఇండియాలో విదేశీ కంపెనీలు స్టోర్లు ఓపెన్ చేయడానికి సుమారు 160 బ్రాండ్లు లోకల్ సంస్థలతో లేదా సొంతంగా స్టోర్లు పెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఫారిన్ కంపెనీలకు లోకల్ పార్టనర్లను వెతకడంలో సాయపడే ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఒక ఏడాదిలో ఇంత భారీగా ఫారిన్ బ్రాండ్లు ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. విదేశీ కంపెనీలు వచ్చే ఐదేళ్లలో సుమారు 5 వేల స్టోర్లను ఓపెన్ చేస్తాయని అంచనా. ఫలితంగా దాదాపు రూ.2078 కోట్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇండియాలో తమ కార్యకలాపాలు సాగించాలనుకుంటున్న కంపెనీల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ సెక్టార్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయని ఫ్రాంచైజ్ ఇండియా హోల్డింగ్స్ ఛైర్మన్ గౌరవ్ మౌర్య పేర్కొన్నారు. ముఖ్యంగా కేఫ్, కాఫీ చెయిన్స్ ఏర్పాటు చేయడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సాధారణంగా బర్గర్లు, పిజ్జా స్టోర్లను ఫారిన్ కంపెనీలు ఎక్కువగా ఓపెన్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాయి.
ఇదీ చదవండి: చంద్రయాన్-3.. స్లీప్‌మోడ్‌లోనూ సిగ్నల్.. ఇస్రో కీలక అప్డేట్
ఫ్రాంచైజ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ అమెజాన్, యూఎస్ కంపెనీ పీట్స్ కాఫీ వంటి కంపెనీలు ఈ ఏడాది ఇండియాలో తమ స్టోర్లు ఓపెన్ చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. గ్లోబల్ కంపెనీలు పెద్ద మొత్తంలో కాఫీ స్టోర్లను ఓపెన్ చేయనుండడంతో స్టార్‌బక్స్ కూడా తన విస్తరణను వేగవంతం చేసింది.