3 నగరాలు 4 దేశాలు
సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే ఒకటీ రెండు రోజులు బాధపడతాం. కాస్త విలువైన ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొరికితే దొరుకుతుంది లేదా కొద్దిరోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సెల్ఫోన్ల చోరీ వెనుక పెద్ద వ్యవస్థీకృత దందా దాగి ఉందంటే మాత్రం విస్తుపోక తప్పదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో దొంగల ముఠాల ద్వారా చోరీ అవుతున్న సెల్ఫోన్లు సీ ఫుడ్ ముసుగులో ఏకంగా దేశం దాటేస్తు న్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు తరలిపోతున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్ చేసుకుని, క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు ఆయా దేశాల సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ మొత్తం దందా మూడు దశల్లో కొనసాగుతోంది. తొలుత దొంగల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు చేరుతున్న సెల్ఫోన్లు, అక్కడి నుంచి మెట్రో నగరాలకు చేరుకుని ఆ తర్వాత దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఫస్ట్ స్టేజ్..⇒ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. బస్సుల్లో, బస్టాపులు, వైన్ షాపులు, బహి రంగ సభలు జరిగే చోట్ల, ఇతర రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు.ఈ ఫోన్లు అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు టెక్నీషియన్లు పని చేస్తుంటారు. వీళ్లు చోరీ ఫోన్లు అన్‌లాక్ చేయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపరింగ్ చేస్తారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడ ఫోన్లు కొంటున్న వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిల్లో పోస్టు చేస్తున్నారు.థర్డ్ స్టేజ్..⇒ చోరీ సెల్ఫోన్లు సూడాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తు న్నాయి. విదేశీ వ్యాపారులు ఎంపిక చేసు కున్న సెల్ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేస్తున్నారు. ఐదేసి ఫోన్లు చొప్పున తొలుత ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో పార్శిల్ చేస్తున్నారు. తర్వాత ఇలాంటి 20 నుంచి 25 బాక్సులను థర్మా కోల్ పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. సీ ఫుడ్‌గా చెబుతూ ఓడ రేవుల ద్వారా సూడాన్, శ్రీలంక దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు మాత్రం థర్మాకోల్ పెట్టె ల్లోనే పార్శిల్ చేసి సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు.రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్ ఏజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీ ఫుడ్ పేరుతో వెళ్తున్న థర్మాకోల్ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తు న్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్ అయ్యారా? తేలాల్సి ఉందని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తాము పట్టుకున్న ముఠాల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆయా ఏజెన్సీలకు పంపిస్తామని పేర్కొంటున్నారు.సెకండ్ స్టేజ్..⇒ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర నగరాలకు చెందిన వ్యాపారులు తమకు నచ్చిన, అవసరమైన సెల్ఫోన్లను ఆ ఫొటోల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చోరీ సెల్ఫోన్లు చేరుతున్నాయి. సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న వ్యాపారులు, ఈ నగరాల్లోని వ్యాపారులకు ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫొటోల ఆధారంగా విదేశీ వ్యాపారులు ఫోన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.వరుస అరెస్టులతో అదుపులోకి చోరీలు⇒ నగరంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఫోన్ల కోసం దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు హత్యలూ జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక అదేశాలు జారీ చేశారు. నగరంలో వ్యవస్థీకృతంగా సాగుతున్న సెల్‌ఫోన్ చోరీలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ముఠాలను పట్టుకున్నారు.మే ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా«ధీనం చేసుకున్నారు. గత నెల మొదటి వారంలో ముగ్గురిని పట్టుకుని 43 సెల్ఫోన్లు సీజ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల 31 మందిని అరెస్టు చేసి 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ వరుస అరెస్టులతో నగరంలో సెల్‌ఫోన్ చోరీలు అదుపులోకి వచ్చాయి. దీంతోనీ వ్యవస్థీకృత ముఠాల వెనుక ఉన్న వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు.