Foreign Secretary S Jaishankar
-
పాకిస్థాన్ రాక్షసకాండపై భారత్ ఫైర్
- బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు న్యూఢిల్లీ: దాయాది రాక్షసకాండపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. భారత జవాన్లను ఆటవికంగా హతమార్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ బుధవారం ఢిల్లీలో పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను పిలిపించుకుని ఈ మేరకు సమన్లు జరీచేశారు. పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిసే.. భారత జవాన్ల తలలు నరికారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని భారత్ పేర్కొంది. పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల కలయికగా ఏర్పడిన బార్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్).. మే 1న భారత భూభాగంలోకి చొరబడి గస్తీ కాస్తోన్న ఇద్దరు జవాన్లను అతి కిరాతకంగా చంపేసిన ఘటన సంచలన రేపిన సంగతి తెలిసిందే. హత్యాకాండ అనంతరం బ్యాట్ సభ్యులు తిరిగి పాకిస్థాన్ కు వెళ్లిపోయారు. అయితే వారు నడిచివెళ్లిన దారి వెంబడి కొన్ని రక్తపు నమూనాలు సేకరించామని, హత్యకు గురైన సైనికుల రక్తనమూనాలతో అవి సరితూగాయని, దీన్నిబట్టి హంతకులు ముమ్మాటికీ పాక్ నుంచి వచ్చినవారేనని పాక్ రాయబారికి వివరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సుబేదార్ పరమ్ జీత్ సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ లు మే 1రాత్రి పూంఛ్ సెక్టార్ లో కమ్యూనికేషన్ కేబుల్స్ పరీక్షించే పనిలో ఉండగా వారిని పాకిస్థాన్ బ్యాట్ బృందం చుట్టుముట్టింది. జవాన్లను దారుణంగా హతమార్చడమేకాక తలలు వేరుచేసి కిరాతకాన్ని చాటుకుంది. తర్వాతి రోజు ఉదయానికిగానీ జవాన్ల మృతదేహాలను సహచరులు గుర్తించారు. (50 మంది పాక్ సైనికుల తలలు కావాలి) (పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!) -
భారత్-పాక్ చర్చల్లో కీలక మలుపు
న్యూఢిల్లీ: ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత ఊపందుకున్న భారత్- పాక్ చర్చల సన్నాహాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాని మోదీ స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం అనంతరం 'కశ్మీర్ అంశంపై చర్చలకు రండి' అంటూ పాక్ విదేశాంగ మంత్రి సర్తార్ అజీజ్ పంపిన అహ్వానానికి భారత్ ప్రభుత్వం అధికారిక సమాధానం ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదం(క్రాస్ బోర్డర్ టెర్రరిజం)పై మాత్రమే చర్చలు జరుపుతామని, కశ్మీర్.. భారత్ లో అంతర్భాగం కాబట్టి ఆ అంశంలో మీతో(పాక్ తో) చర్చించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ గౌతం బంబావాలే బుధవారం పాక్ విదేశాంగ కార్యదర్శికి లేఖను అందజేశారు. సీమాంతర ఉగ్రవాదంపై చర్చల కోసం ఇస్లామాబాద్ వచ్చేందుకు భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ సిద్ధంగా ఉన్నారని భారత్ ఆ లేఖలో పేర్కొంది. కాగా, భారత్ ప్రతిపాదనపై పాక్ స్పందించాల్సిఉంది. సోమవారం పాక్ విదేశాంగ శాఖ భారత్ కు రాసిన లేఖలో కశ్మీర్ అంశంపై చర్చలకు రావాల్సింగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని అనుసరించి కశ్మీర్ విషయంలో నిర్ణయానికి వద్దామని పాక్ పేర్కొంది. అయితే కశ్మీర్ తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, బలూచిస్థాన్ లలో పాక్ దమనకాండను ఎత్తిచూపాలన్న ఎత్తుగడతోనే భారత్ అడుగులే వేస్తున్నది. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంగా జరిగిన అఖిలపక్ష భేటీతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ప్రధాని మోదీ.. ఆయా ప్రాంతాల్లో పాక్ దమననీతిని ఎండగట్టిన సంగతి తెలిసిందే. -
చైనాకు దక్కనిది మనకు దక్కింది!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే (క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి- ఎంటీసీఆర్)లో భారత్ సభ్యురాలైంది. విధ్వంసక క్షిపణులు, వాయుమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల విచ్చలవిడి వ్యాప్తిని నిరోధించేందుకు ఏర్పాటయిన ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్.. అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానంతోపాటు నిఘా డ్రోన్లను కొనుగోలుచేసుకునే వీలుంటుంది. అంతేకాదు అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత సభ్యత్వానికి మోకాలడ్డిన చైనాను సమీప భవిష్యత్ లోనే దారికి తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ ఎంటీసీఆర్ సభ్యత్వానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 38 దేశాల ఎంటీసీఆర్ లో కీలకపాత్ర పోషిస్తోన్న ఫ్రాన్స్, నెదర్లాండ్, లక్సెంబర్గ్ రాయబారుల సమక్షంలో భారత్ చేరిక విజయవంతమైందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నో లాభాలు.. భారత్ తో అణు ఒప్పందంలో భాగంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని కూటములలో సభ్యత్వాన్ని సమర్థిస్తానని అమెరికా గతంలో చేసిన వాగ్ధానానికి కార్యరూపమే ఎంటీసీఆర్ లో చేరిక. ప్రస్తుతం ఎంటీసీఆర్ లో 38(భారత్ తో కలిపి) దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలన్నీ 500 కేజీల బరువు, లక్ష్యం పరిధి 300 కిలోమీటర్లకు పైబడిన బాలిస్టిక్ క్షిపణులు తయారుచేయబోవు. ఒకవేళ ఇంతకు ఉంటేగనుక వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. తద్వారా సభ్యదేశాల నుంచి అత్యాధునిక క్షపణి పరిజ్ఞానాన్ని, డ్రోన్లు, ఇతర వాహక నౌకలను దిగుమతి చేసుకోవచ్చు. మున్ముందు భారత్ సొంతగా రూపొందించబోయే టెక్నాలజీని కూడా అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. ఎంటీసీఆర్ లో సభ్యత్వం లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ తాను రూపొందించిన అత్యాధునిక అంతరీక్ష నౌక(షావిత్)లను అమ్ముకోలేక పోవడం గమనార్హం. చైనాకు చెక్ పెట్టొచ్చు! ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్ చైనాకు చెక్ పెట్టే అవకాశాలున్నాయి. 2004 నుంచి ఎంటీసీఆర్ లో చైనా సభ్యత్వం పరిశీలనలో ఉంది. వరుస క్షిపణి ప్రయోగడాలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఉత్తర కొరియాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఎంటీసీఆర్ లోని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా మాత్రం పైకి తాను బాలిస్టిక్ క్షిపణుల తయారీని నిలిపేశానని చెప్పుకుంటోంది. లోలోన మాత్రం విధ్వంసక ఆయుధాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ తో చైనా చేసుకున్న ఆయుధ సరఫరా ఒప్పందం కూడా అలాంటిదే. ప్రయత్నాలు ప్రారంభించిన ఏడాదో లోపే భారత్ కు ఎంటీసీఆర్ సభ్యత్వం దక్కడం గమనార్హం. తద్వారా భారత్ మున్ముందు చైనాపై ఒత్తిడి తీసుకువచ్చే లేదా ఆ దేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారత్ కు ఎన్ఎస్ జీ సభ్యత్వం దక్కకుండా చైనా మోకాలడ్డిందో, భవిష్యత్ లో భారత్ కూడా చైనా ఎంటీసీఆర్ సభ్యత్వానికి అడ్డుపడొచ్చు. ఆ సందర్భమే తలెత్తితే.. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మార్గాలు సుగమం చేసుకోవచ్చు.