బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా
పాన్ నంబర్‌తో అనుసంధానం కాని బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. నవంబర్ 9 తర్వాత రూ. 2 లక్షలకు పైగా డిపాజిట్ చేసిన ఖాతాలను పాన్‌తో అనుసంధానం చేయాలని, లేదా ఫారం-60ని నింపి బ్యాంకులో సమర్పించాలని సూచించింది. అంతవరకు ఖాతాను ఆపరేట్ చేయకూడదని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.
అలాగే, సమయంతో సంబంధం లేకుండా.. ఐదు లక్షల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు (నవంబర్ 9కి ముందు చేసిన డిపాజిట్లు) కూడా తమ ఖాతాలతో పాన్‌ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని.. అలా లేని పక్షంలో ఫారం 60ని నింపి బ్యాంకులో సమర్పించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. లేదంటే వీరి ఖాతాను ఆపరేట్ చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
పాన్ నెంబర్ అనుసంధానం చేయకుండా ఒకే వ్యక్తికి ఎక్కువ ఖాతాలు ఉంటే.. పరిమితులకు లోబడి ఒక్కో దాంట్లో పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి ఖాతాకు పాన్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లలో డబ్బులు వేసుకున్నా.. అవన్నీ కూడా కలిపి ఒకేసారి లెక్కలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో ఒక వ్యాపారవేత్త 85 బ్యాంకు ఖాతాలను నిర్వహించిన విషయం వెలుగులోకి రావడంతో రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.