గుండె నిండా పేదల జెండా
♦ పతాకావిష్కరణలు.. సేవా కార్యక్రమాలు
♦ అధికార పార్టీ కుట్రలు.. కుతంత్రాలను ఎదుర్కొందాం
♦ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం
♦ పేదల పక్షాన పోరాటమే దానికి మార్గం
♦ వేడుకల్లో నాయకుల పిలుపు.. కార్యకర్తల ప్రతిన
సాక్షి, విశాఖపట్నం: ఉద్యమాలే ఊపిరిగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. తమ గుండెల్లో కొలువైన దివంగత వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ ఐదో పుట్టిన రోజు వేడుకలను శనివారం జిల్లా అంతటా పార్టీ శ్రేణులే కాదు.. వివిధవర్గాల ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మారుమూల పల్లెల్లో సైతం పార్టీ జెండాలను ఆవిష్కరించి కేకులు కట్ చేసి.. నిరుపేదలు. వృద్ధులు. అనాధలు, రోగులకు పండ్లు, పాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ సంక్షేమ ఫలాలు మళ్లీ అందాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. కుట్రలు.. కుతంత్రాలు ఛేదిస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి తరపున అలుపెరగని పోరాటం సాగిస్తున్న పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడతామని ప్రతినబూనారు.
కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడదాం: బూడి మహానేత వైఎస్సార్ హఠన్మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసారో... చేస్తున్నారో మనమంతా చూశాం. చూస్తున్నాం.. దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీని బలహీనపర్చేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ైవైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసే వరకు పార్టీ శ్రేణులు అలుపెరగని పోరు సాగించాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బూడి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.
యలమంచలిలో..
కోఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు యలమంచలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మునగపాకలో పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొడ్డెడ ప్రసాద్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
పాయకరావుపేటలో..
పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఎస్.రాయవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నయన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు నక్కపల్లిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ నక్కపల్లిలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
నర్సీపట్నంలో..
పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకరగణేష్ నర్సీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఐదు రోడ్లు జంక్షన్లో గల పార్టీ కార్యాలయ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అబీద్సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. రావికమతంలో డిసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహలక్ష్మినాయుడు పార్టీ నేతలతో కలిసి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
పాడేరులో..
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక ఎంపీపీ, జెడ్పీ టీసీలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లిలో పార్టీ పట్టణాధ్యక్షు డు జానీ పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
విశాఖ దక్షిణంలో..
గత రెండేళ్లుగా పెదబాబు-చినబాబులు కలిసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని.. అవనీతికి తలుపులు బార్లా తెరవడంతో ఆ పార్టీ నేతలు కూడా దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులతో కలిసి జగదాంబ సెంటర్లో పార్టీ పతాకాన్ని అమర్నాధ్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఈస్ట్‌లో..
రెండేళ్ల అవినీతి పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని విశాఖ తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీపతాకాలను ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లకు ఖాకీ దుస్తులు పంపిణి చేశారు.
ఉత్తర నియోజకవర్గంలో..
పోరాటాలతో పుట్టిన వైఎస్సార్సీపీదే భవిష్యత్ అని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తైనాల పాల్గొని పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. పలు కూడళ్లలో జెండాలు ఆవిష్కరించారు.
గాజువాకలో..
సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు పండ్లు, పాలు. వస్త్రాలు పంపిణీ చేశారు.
పెందుర్తిలో..
సమన్వయకర్త అదీప్‌రాజు నియోజకవర్గంలోని వివిధ వార్డులు, గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. 69వ వార్డులో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
భీమిలిలో..
సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం భీమిలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తగరపువలస, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అంతా వైఎస్సార్‌సీపీదేనని.. జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు.