Former Chief Minister Jayalalithaa
-
తీర్పు అమ్మకు సానుకూలమా
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు మరో 24 గంటల్లో తేలిపోనుంది. జయ చేసుకున్న అప్పీలుపై ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడ నుండగా, తీర్పు సారాంశం ఎలా ఉంటుందోనని రాష్ట్రమంతా టెన్షన్ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:18 ఏళ్లపాటూ నడిచిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు గత ఏడాది విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాపై జయ కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అమెతోపాటూ ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న శశికళ, ఇళవరసి, మాజీ దత్తపుత్రుడు సుధాకర్లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా పడింది. జనవరి 5వ తేదీన అప్పీలుపై విచారణ ప్రారంభం కాగా మార్చి 11 వ తేదీ వరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో వాదోపవాదాలు సాగాయి. మార్చి 18 వ తేదీలోగా విచారణ ముగించి తీర్పుచెప్పాలని సుప్రీం కోర్టు గతంలోనే కర్నాటక హైకోర్టును ఆదేశించి ఉంది. అయితే అత్యంత కీలకమైన కేసు కాబట్టి తీర్పు వెల్లడిలో మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సుప్రీంకు లేఖ రాశారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీం కోర్టు మే 12వ తేదీలోగా తీర్పు చెప్పేలా గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసిపోతున్న దశలో తీర్పు చెప్పేందుకు కర్నాటక హైకోర్టు సిద్దమైంది. ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటలకు జయ కేసులో తీర్పు చెప్పనున్నట్లు కర్నాటక హైకోర్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. 11న రాష్ట్రవ్యాప్తంగా పూజలు ః తీర్పు తేదీ ఖరారైన నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఊహాగానాల్లో పడిపోయాయి. అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన మిన్నంటింది. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రావాలని ప్రార్థిస్తూ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర శనివారం పూజలు నిర్వహించారు. అలాగే తీర్పు వెలువడే 11 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు నిర్ణయించారు. పార్టీ అనుబంధ న్యాయవాదుల సంఘం సభ్యులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. తీర్పు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటించినపుడు ఆందోళనలు, రాస్తారోకోలు, బస్సుల ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. 11 వ తేదీన తీర్పు అమ్మకు సానుకూలమా, ప్రతికూలమా అనే మీమాంసలో ముందు జాగ్రత్త చర్యలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం అవుతోంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ముమ్మురమైన వాహనాల తనిఖీకి చేపట్టనున్నారు. ఈనెల 12 వ తేదీతో జయకు మంజూరైన బెయిల్ గడువు ముగుస్తుంది. కర్నాటక హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే, ప్రతికూలంగా వస్తే వెంటనే బెయిల్ పొడిగింపు దరఖాస్తును సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక న్యాయవాది తెలిపాడు. -
అమ్మవల్లే పదవి
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆశీస్సులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీ డీ) బోర్డు సభ్యుడయ్యే అదృష్టం దక్కినట్లు జే శేఖర్ రెడ్డి తెలిపా రు. తమిళనాడు నుంచి టీటీ డీ బోర్డు సభ్యులుగా జే శేఖర్‌రెడ్డి కొత్తగా నియమితులైన సందర్భంగా ‘సాక్షి’ మంగళవారం చెన్నైలో ఆయనను కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీనివాసుని సేవలో తరించే భాగ్యం కలగడం కలియుగ వైకుంఠవాసుడు ఇచ్చిన అపూర్వమైన వరమని అన్నారు. అలాగే ఈ భాగ్యాన్ని కలిగించిన అమ్మకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ధన్యవాదాలని అన్నారు. అమ్మ, సీఎంలను స్వయంగా కలిసి ఆశీర్వాదం పొందుతున్నట్లు చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యునిగా మీ డ్రీమ్ప్రాజెక్టులు ఏమిటని సాక్షి ప్రశ్నించగా, గత 8 ఏళ్లుగా టీటీడీ స్థానిక సలహా మండలి సభ్యులుగా స్వామివారిని సేవిస్తున్నానని, ఈ అనుభవాన్ని జోడించి తమిళనాడు భక్తులకు మరిన్ని సేవలకు కృషి చేస్తానని తెలిపారు. టీనగర్ వెంకటనారాయణ్ రోడ్డులోని శ్రీవారి ఆలయం భక్త జనసందోహానికి సరిపడా లేదని, ఈకారణంతో చెన్నై ఈసీఆర్ రోడ్డులో సువిశాలమైన అత్యంత సుందరమైన శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇందుకు ముందుగా బోర్డు అనుమతిని, ఆ తరువాత తమిళనాడు ప్రభుత్వం ద్వారా తగిన స్థలాన్ని పొందాల్సి ఉందని చెప్పారు. అలాగే స్థానిక సలహామండలి సభ్యులుగా కన్యాకుమారీలో టీటీడీ ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. బోర్డు సభ్యులుగా కన్యాకుమారీ ఆలయ నిర్మాణం కూడా ప్రతిష్టాత్మకంగా పూర్తిచేయడం తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తమిళనాడు నుండి కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులకు మార్గమధ్యంలో వీధిలైట్లు, తదితర వసతి సౌకర్యాలను కల్పించేందుకు కృష్టి చేస్తానని హామీ ఇచ్చారు. బోర్డు సభ్యునిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం టీటీడీలో చర్చించి తన సంపూర్ణమైన సేవలను తమిళనాడు ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు. -
జయతో భేటీకి సిద్ధం
టీనగర్: మాజీ ముఖ్యమంత్రి జయలలితను కలిసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని సీనియర్ నేతగా భావించి కలుసుకున్నానని ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో వామపక్ష నేతలు శంకరయ్య, నల్లకన్నుతోపాటు రాందాస్, వైగో, విజయకాంత్, తిరుమావళవన్లను కలిసి ఆశీస్సులందుకోనున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా కలుసుకునేందుకు సిద్ధం గా వున్నట్లు తెలిపారు. అయితే, ఆమె అనుమతి ఇస్తారా? అనే విషయం తెలియలేదన్నారు. అనుమతి లభించిన వెంటనే ఆమెను కలిసి మాట్లాడుతానని తెలిపారు. మంగళవారం నుంచి తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో పర్యటించనున్నానని, ఆ తర్వాత నాగపట్నం, శివగంగై, పుదుక్కోట్టై, కోయంబత్తూరు, తిరుపూరు, మదురై, రామనాధపురం జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగిన వారి గురించి బెంగలేదని, వారి గురించి ఇకపై వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రంగభాష్యం, హార్బర్ రవిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస మూర్తి, దేవరాజ్, దీనా, ఏలుమలై, గార్డెన్ కృష్ణమూర్తి, కుళత్తూరు సాలమన్, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ఆస్తులు ప్రజలకే..!
- అన్నాడీఎంకే అధినేత్రి జయ వెల్లడి - న్యాయస్థానంలో అమ్మ వ్యాఖ్యానించినట్లుగా తమిళ పత్రికల కథనం చెన్నై, సాక్షి ప్రతినిధి : ‘కుటుంబమే లేని నాకు కోట్లాది రూపాయల అక్రమార్జన అవసరమేమీ, ప్రజలే నా ఆస్తి, నా ఆస్తి అంతా ప్రజలకే’...ఈ మాటలు అన్నది ఎవరో కాదు, అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. బెంగళూరు కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే న్యాయమూర్తి సమక్షంలో జయ ఈ వ్యాఖ్యలు చేసినట్లు బుధవారం ఓ తమిళ పత్రికలో కథనం వెలువడింది. జయ తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాను పొందిన రోజుల్లో (1991-96) భారీగా అక్రమార్జన చేసినట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిటిషన్‌పై ఏసీబీ అధికారులు విచారణ జరిపి రూ.66.44 కోట్లు అక్రమార్జనగా లెక్కతేల్చి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసుపై గత నెల 27వ తేదీన తీర్పు వెలువడింది. సీఎం హోదాను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు రుజువైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జయతో సహా మొత్తం నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువరించే సమయంలో ముద్దాయిలు, సంబంధిత న్యాయవాదులు, న్యాయమూర్తులు మినహా ఇతరులెవ్వరినీ కోర్టులోకి అనుమతించలేదు. కోర్టు ముగిసిన తరువాత వారూ వీరు ఇచ్చిన సమాచారంపైనే అందరూ ఆధారపడ్డారు. కోర్టు తీర్పు వెలువడగానే జయ బృందాన్ని బెంగళూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నాలుగు రోజుల్లో జయను జైల్లో కొందరు ముఖ్యులు కలుసుకున్నారు. వీరి ద్వారా సేకరించిన సమాచారాన్ని ఓ తమిళ దినపత్రిక ప్రచురించింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.... ‘నేను స్వతహాగా ఆస్తిపరురాలిని, సినీ నటిగా ఎంతో సంపాదించాను. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే నాకు మంచి ఆస్తి ఉంది. నాకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం ఏముంది. నాకున్న ఆస్తి అంతా తమిళనాడు ప్రజలే. అందుకే నాకున్న ఆస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తాను. ప్రజాకోర్టులో నన్ను ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని ఈ కోర్టుద్వారా అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకున్నారు’ అంటూ తీర్పువెలువడిన అనంతరం న్యాయమూర్తికి జయ విన్నవించుకున్నట్లు ఆ పత్రిక కథనంలో పేర్కొంది. -
జయలలిత జీవిత కథతో అమ్మ
అక్రమ ఆస్తుల కేసులో దోషిగా జైలు జీవితం అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ వెండితెరకెక్కుతోంది. నటిగా చలన చిత్ర పరిశ్రమలోను, ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోనూ విప్లవ నాయకురాలిగా చరిత్ర సృష్టించిన జయలలిత జీవితం సంచలనాల మయం. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘అమ్మ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. జయలలితగా ప్రముఖ కన్నడ నటి రాగిణీ ద్వివేది నటిస్తున్నారు. ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తొలిసారిగా హిందీ, తెలుగు భాషలకు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ముంబయ్, బెంగళూరుల్లో చిత్రీకరించారు. కాగా, చిత్రంలో జయలలిత అరెస్టు అయ్యి జైలుకెళ్లే సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని దర్శకుడు అంటున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన ఇటీవల ‘మై హూ రజనీకాంత్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ చిత్రం విడుదలపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఇప్పుడు జయలలిత జీవిత చరిత్రతో సినిమా తీస్తున్నారు కాబట్టి... కచ్చితంగా వివాదాలు ఎదురవుతాయన్నది పలువురి ఊహ.