తీర్పు అమ్మకు సానుకూలమా
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు మరో 24 గంటల్లో తేలిపోనుంది. జయ చేసుకున్న అప్పీలుపై ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడ నుండగా, తీర్పు సారాంశం ఎలా ఉంటుందోనని రాష్ట్రమంతా టెన్షన్ నెలకొంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:18 ఏళ్లపాటూ నడిచిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు గత ఏడాది విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాపై జయ కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అమెతోపాటూ ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న శశికళ, ఇళవరసి, మాజీ దత్తపుత్రుడు సుధాకర్‌లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా పడింది. జనవరి 5వ తేదీన అప్పీలుపై విచారణ ప్రారంభం కాగా మార్చి 11 వ తేదీ వరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో వాదోపవాదాలు సాగాయి.
మార్చి 18 వ తేదీలోగా విచారణ ముగించి తీర్పుచెప్పాలని సుప్రీం కోర్టు గతంలోనే కర్నాటక హైకోర్టును ఆదేశించి ఉంది. అయితే అత్యంత కీలకమైన కేసు కాబట్టి తీర్పు వెల్లడిలో మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సుప్రీంకు లేఖ రాశారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీం కోర్టు మే 12వ తేదీలోగా తీర్పు చెప్పేలా గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసిపోతున్న దశలో తీర్పు చెప్పేందుకు కర్నాటక హైకోర్టు సిద్దమైంది. ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటలకు జయ కేసులో తీర్పు చెప్పనున్నట్లు కర్నాటక హైకోర్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది.
11న రాష్ట్రవ్యాప్తంగా పూజలు ః
తీర్పు తేదీ ఖరారైన నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఊహాగానాల్లో పడిపోయాయి. అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన మిన్నంటింది. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రావాలని ప్రార్థిస్తూ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర శనివారం పూజలు నిర్వహించారు. అలాగే తీర్పు వెలువడే 11 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు నిర్ణయించారు. పార్టీ అనుబంధ న్యాయవాదుల సంఘం సభ్యులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. తీర్పు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటించినపుడు ఆందోళనలు, రాస్తారోకోలు, బస్సుల ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. 11 వ తేదీన తీర్పు అమ్మకు సానుకూలమా, ప్రతికూలమా అనే మీమాంసలో ముందు జాగ్రత్త చర్యలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం అవుతోంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ముమ్మురమైన వాహనాల తనిఖీకి చేపట్టనున్నారు. ఈనెల 12 వ తేదీతో జయకు మంజూరైన బెయిల్ గడువు ముగుస్తుంది. కర్నాటక హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే, ప్రతికూలంగా వస్తే వెంటనే బెయిల్ పొడిగింపు దరఖాస్తును సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక న్యాయవాది తెలిపాడు.