former Naxalite
-
భూమి కోల్పోయాననే ఆవేదనతో..
ఇల్లెందురూరల్: ప్రభుత్వ శాఖల సమన్వయలోపం వల్లే తనకు భూ సమస్య ఏర్పడిందని ఓ మాజీ నక్సలైట్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఇల్లెందుకు చెందిన కొడెం సమ్మయ్య పీపుల్స్‌వార్‌లో సుదీర్ఘ కాలం పనిచేసి, 2008లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ సమయంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు పునరావాసం కింద 1.20 ఎకరాల భూమినికి అతడికి కేటాయించారు. ఆ భూమిని వైటీసీ నిర్మాణానికి మళ్లీ అధికారులు స్వా ధీనం చేసుకుని, సుభాష్‌నగర్ గురుకులం వెనుక ఇచ్చారు. అయితే ఆ భూమిని ఓ పార్టీకి చెందిన నేత ఆక్రమించుకోవడంతో న్యాయంకోసం సమ్మయ్య కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరాడు. స్థానిక రెవెన్యూ అధికారుల సూచనతో అతడికి కేటాయించిన భూమిలో గుడిసె వేసుకుంటే, సదరు నేత ఫిర్యాదుతో పోలీసులు సమ్మయ్యను అడ్డుకుంటున్నారు. అధికారికపత్రం లేకుండా సమ్మయ్యను భూమి జోలికి వెళ్లొద్దని పోలీసులు చెబుతుండగా..మరోవైపు భూమిహక్కుకు సంబంధించి రెవెన్యూ అధికారులు స్పష్టమైన పత్రాలు ఇవ్వకపోవడంతో వారిపై న్యాయపోరాటం చేసేందుకు అతడికి అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అక్కడే ఉన్న కార్యాలయ సిబ్బంది, ప్రజలు అతడిపై నీళ్లు చల్లి అడ్డుకున్నారు. కాగా, ఈ ఘటనపై తహసీల్దార్ కృష్ణవేణి స్పందిస్తూ రెండు రోజుల్లో సమ్మయ్యకు భూమి అప్పగింతపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఇంకా ఉద్యమాలు చేయాలె.. సంధ్యకు సీఎం కేసీఆర్ భరోసా
సాక్షి, వరంగల్: ‘‘ధైర్యంగా ఉండమ్మా.. ఇంకా మనం ఉద్యమాలు చేయాలె.. టీఆర్ఎస్లో ఇంకా బాగా పనిచేయాలె.. త్వరలో హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతా..’’అని మాజీ నక్సలైట్, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పురి స్వరూప అలియాస్ సంధ్యకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఏటూరునాగారంలో సమీక్ష పూర్తిచేసుకుని హనుమకొండకు బయలుదేరుతున్న సమయంలో.. స్వరూప సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అది చూసిన సీఎం ఆమెను బస్సులోకి పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం స్వరూప మీడియాతో మాట్లాడారు. ‘‘మాది తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చిన్నవయసులోనే మావోయిస్టు పార్టీలో పనిచేసి లొంగిపోయాను. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. నాకు అమ్మనాన్న ఎవరూ లేరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నాను. సార్ నా ఫోన్ నంబర్ తీసుకున్నారు. హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడుతానని హామీ ఇచ్చారు..’’అని వివరించారు. చదవండి: (CM KCR: వరదలు విదేశీ కుట్రే.. సీఎం కేసీఆర్ సంచల వ్యాఖ్యలు) -
18 ఏళ్లు అజ్ఞాతవాసం.. దళం వీడి పొలంలోకి..
దళ కమాండర్‌గా ఉన్నపుడు తుపాకీ చేతబట్టాడు. దండకారణ్యంలో సంచరిస్తూ 18 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపాడు. అనారోగ్యంతో అడవి నుంచి బయటకు వచ్చి ఆసుపత్రిలో చేరినపుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి, చివరికి జనజీవన స్రవంతిలో చేరాడు. దళాన్ని వీడి పొలం బాట పట్టిన మాజీ మావోయిస్టు వాసన్నపై ప్రత్యేక కథనం. బుట్టాయగూడెం: వాసన్నది వ్యవసాయ కుటుంబం. తాత, ముత్తాతలు కాలం నాటి నుంచి వ్యవసాయమే వృత్తి కావడంతో వాసన్నను బడికి పంపించకుండా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమయ్యేలా చేశారు అతని తండ్రి. అయితే అతనికి చదువుకోవాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెప్పినప్పుడు ‘అన్న’లు చదువు నేరి్పస్తారని, సమసమాజ స్థాపనకు శ్రమిస్తారని చెప్పారట. దాంతో విప్లవ పారీ్టలో చేరాడు. అక్కడ అక్షర జ్ఞానం నేర్చుకోవడంతో పాటు తుపాకీ పట్టి అజ్ఞాత జీవితం గడుపుతూ వచ్చాడు. అనారోగ్యానికి గురై వైద్యం కోసం బాహ్య ప్రపంచంలోకి వచ్చి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తరువాత తన జీవిత పంథాను మార్చుకున్నాడు. రైతుగా మారి నాగలి పట్టి పొలం దున్నుతున్నాడు. ‘సాక్షి’ ప్రతినిధి వాసన్నను పలకరించినపుడు ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.. నా అసలు పేరు దారయ్య మాది తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి ప్రాజెక్టు సమీపంలోని రంగాపురం గ్రామం. మా తల్లిదండ్రులు కారం సంకురు, కన్నమ్మలు. నేను మొదటి కుమారుడిని. నా అసలు పేరు కారం దారయ్య. పార్టీలో పిలిచే పేరు వాసన్న. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నాతో పాటు చెల్లి, తమ్ముడు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులే తప్ప ఎవ్వరం చదువుకోలేదు. నాకు చదువుకోవాలనే ఆశ ఉన్నా మా నాన్న వ్యవసాయ పనులకు తప్ప చదువుకు పంపేవారు కాదు. మా ఊరిలో ఒక విప్లవ సంస్థకు సంబంధించిన నాయకులు పోడు వ్యవసాయం, రైతు కూలీల సమస్యలు, ఇతర రాజకీయ వివరాల గురించి మీటింగ్‌లు పెట్టేవారు. వారిలాగే మాట్లాడాలని నాకు కోరిక ఉండేది. నాకు చదువులేక పోవడం వల్ల మాట్లాడలేక పోతున్నాననే బాధ ఉండేది. ఒక రోజు మా గ్రామానికి చెందిన నా స్నేహితుడు అన్నల పార్టీలో చేరితే వారే చదువు చెప్తారని దానితో పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాలను నేర్పిస్తారంటూ చెప్పడంతో 1992వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరాను. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. అక్కడే అజ్ఞాతంలో ఉంటూ చదువుతో పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పట్టుసాధించాను. చురుగ్గా ఉన్న నన్ను పార్టీ దళ కమాండర్‌గా చేసింది. అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే మమత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. 18 సంవత్సరాల పాటు అడవిలోనే అజ్ఞాతంలో ఉన్నా. 2010లో నాకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆస్పత్రికి వెళితే పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మమత స్వగ్రామమైన బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెంలో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయ పనులను ప్రారంభించి ఇక్కడ నివాసిగానే కొనసాగుతున్నాను. రెండెడ్లు కొని వ్యవసాయం ప్రారంభించాడు జైలు నుంచి బయటకు వచ్చిన నేను తదుపరి వ్యవసాయం చెయ్యాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో 5 ఎకరాల్లో కౌలు భూమి తీసుకున్నా. ఆ భూమిని దున్నేందుకు అప్పు చేసి రెండు కాడెద్దులను కొని వ్యవసాయాన్ని ప్రారంభించా. వ్యవసాయం ప్రారంభించిన రెండో సంవత్సరం 15 ఎకరాల్లో వ్యవసాయం చేశా. గత రెండేళ్లుగా 35 ఎకరాల్లో పంటల సాగు చేస్తున్నాను. వ్యవసాయ పనులు చేసుకుంటూ కొంతమంది కూలీలకు కూడా నా పొలంలో పని కల్పిస్తున్నాను. వ్యవసాయం చేయడంలో ఆనందం ఉంది. పది మందికి పని చూపిస్తున్నాననే సంతృప్తి కూడా ఇందులో కలుగుతోంది అంటున్నాడు వాసన్న. -
తహసీల్దార్‌కు మాజీ నక్సలైట్ బెదిరింపు
సాక్షి, కామారెడ్డి : ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించారు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటు చేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగారు. ఇతరులకు చెందిన 6 ఎకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతరుల భూమిని పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసు కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పించమని అడిగితే, తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ మండల మాజీ మహిళ అధ్యక్షురాలు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒడ్డెపల్లి సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
తుపాకీ పేల్చిన మాజీ నక్సలైట్
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోసానిపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ శిలాసాగర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని దుర్వినియోగం చేసినందుకు కేసు నమోదైంది. ఎస్పీ శ్వేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాజీ నక్సలైట్ అయిన శిలాసాగర్ లైసెన్స్డ్ తుపాకీ కలిగి ఉన్నాడు. ఆయనకు కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయి. ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో కుటుంబ సభ్యులను బెదిరించడం కోసం తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీని బయటకు తీసి ఒక రౌండ్ కాల్చాడు. ఈ విషయమై శిలాసాగర్ కూతురు శ్రీలేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బెదిరించడమే గాకుండా ఆయుధ లైసెన్సును దురి్వనియోగం చేయడం కూడా నేరమన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (విశాఖలో మావోయిస్టు కీలక నేతల అరెస్ట్) -
అ‘పరిష్కృతి’..!
సాక్షి, కొత్తగూడెం: సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం అనుకున్న మేర లక్ష్యం సాధించడం లేదు. ఇక్కడికొచ్చే సమస్యల్లో కొన్ని పరిష్కారం అవుతున్నా.. భూసంబంధ సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి. ప్రతి గ్రీవెన్స్‌కు ఆయా విభాగాల ప్రధాన అధికారులను కలెక్టర్ పిలిపించి తక్షణమే సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నం అంతగా ఫలితాలనివ్వడం లేదు. సోమవారం ‘సాక్షి’ రెండు భూ ఆక్రమణల కేసులను పరిశీలించింది. ఇ.పుష్పకుమారి అనే ఓ మాజీ నక్సలైట్‌కు పునరావాసం కింద ఇచ్చిన మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారు. ఈ విషయమై ఆమె ప్రతి అధికారి చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. చివరకు సోమవారం.. ఈ వ్యవహారాన్ని పరిష్కరించాలని కలెక్టరేట్ ఏఓకు జాయింట్ కలెక్టర్ సూచించారు. కాగా సదరు ఏఓ బాధిత మహిళతో ‘నీకు ఈ స్థలం ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, తహసీల్దారుకు చెప్పి మరోచోట ఇప్పిస్తా’ అనడంతో పాటు భూముల ధరలు పెరుగుతండడంతో ఇలా ఆక్రమణలు జరగడం సహజమేనని సెలవిచ్చారు. చివరకు సమస్యను సశేషంగానే ఉంచారు. దీంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలనే ఆలోచన వస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక కొత్తగూడెం జిల్లాకేంద్రం నడిబొడ్డులో కొదురుపాక మీనాకు మారి అనే ఓ మహిళా న్యాయవాదికి వంశపారంపర్యంగా వచ్చిన ఇంటిని మున్సిపల్ అధికారులు ఆమెకు తెలియకుండానే మరొకరి పేరుపై మార్చారు. స్థానిక నాయకులు కొందరు ఆక్రమణదారులకు మద్దతు తెలుపుతుండడంతో వారు తనపై అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని న్యాయవాది వాపోయారు. పునరావాసం కింద ఇచ్చిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు జనశక్తి దళంలో పనిచేస్తూ 2000 సంవత్సరంలో పోలీసుల ఎదుట లొంగిపోయాను. 2004లో తిరిగి జనశక్తి దళంలో చేరాను. 2006లో మళ్లీ లొంగిపోయాను. ప్రభుత్వం ఇచ్చే పునరావాసం కింద నాకు 2010లో సమితి సింగారం పంచాయతీ రాజీవ్‌గాంధీ నగర్లో మూడు సెంట్ల స్థలాన్ని అధికారులు కేటాయించారు. అయితే ఆర్థిక స్తోమత లేక ఇప్పటికీ ఇల్లు నిర్మించుకోలేదు. స్థానికులైన కమ్మంపాటి శ్రీను, రేగళ్ల శంకర్, కె.సాయిపద్మ, ఎం.పద్మ, ఎస్.ఎ.కోటి, యెదరి రామకృష్ణ ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టికి కూడా తీసుకెళ్లా. అదే సమయంలో అప్పటి కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావుకు కూడా వివరించా. అయినా ఇప్పటికీ న్యాయం జరగలేదు. చివరికి హైదరాబాద్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ వద్దకు కూడా వెళ్లి మొరపెట్టుకోగా ప్రస్తుత కలెక్టర్‌కు లేఖ పంపారు. దీనిని కూడా కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో ఇచ్చిన వినతిపత్రంలో జతచేశా. భర్త మరణించి అనాథగా ఉన్న గిరిజనురాలినైన నాకు ఈ స్థలాన్ని న్యాయబద్ధంగా ఇప్పించాలని కోరుతున్నా. – పుష్పకుమారి, సమితి సింగారం, మణుగూరు మండలం. నాకు తెలియకుండా మ్యుటేషన్ చేశారు కొత్తగూడెం మున్సిపాలిటీలోని గాజులరాజం బస్తీలో 4–2–144 నంబర్లో నాకు ఇల్లు ఉంది. మా అమ్మ సముద్రాల భారతి ద్వారా వంశపారంపర్యంగా ఆ ఇల్లు లభించింది. నేను 2015 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నా. ఈ ఇల్లు నివాసయోగ్యంగా లేక ఎవరికీ అద్దెకు కూడా ఇవ్వలేదు. ఇటీవల జీఓ రావడంతో పట్టా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కొత్తగూడెం వచ్చాను. అయితే నా పేరుపై ఉన్న ఇంటిని 2013లో నాకు తెలియకుండా రెడ్డి కృష్ణకుమారి పేరుతో ముటేషన్ చేశారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఈ విషయమై మున్సిపల్ అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆక్రమించుకున్న వారిని అడిగితే..నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఎక్కువగా మాట్లాతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. 2009 నుంచి 2015 మొదటి అర్థసంవత్సరం వరకు ఇంటి పన్ను కూడా చెల్లించా. నా ఇంటిపై సర్వహక్కులు కల్పించి న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నాను. – కొదురుపాక మీనాకుమారి, కొత్తగూడెం మున్సిపాలిటీ -
ఇంటి స్థలం కోసం మాజీ నక్సలైట్ దీక్ష
మణుగూరురూరల్ : తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అప్పగించాలని కోరుతూ మాజీ నక్సలైట్ ఈట్ల పుష్పకుమారి స్థానిక అంబెడ్కర్ సెంటర్లో దీక్ష ప్రారంభించారు. మంగళవారం రెండో రోజు ఆమె దీక్షకు పలు రాజకీయపార్టీల నేతలు మద్దుతు తెలిపారు. మూడు సంవత్సరాలు నక్సల్స్ గ్రూప్‌లో దళ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త నవీన్ సైతం అదే దళంలో పనిచేసి మృతి చెందాడు. ఆరోగ్య సరిగాలేని పుష్పకుమారి ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆమె లొంగిపోయిన సమయంలో మణుగూరు మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీనగర్ ప్రాంతంలోని 138 సర్వే నంబర్లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. ఆమె అక్కడ ఇల్లు నిర్మిచుకోకపోవడంతో స్థానికులు కొందరు అక్కడ సమ్మక్క ఆలయం ఏర్పాటు చేశారు. బాధితురాలు అనేక మార్లు కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తానని బాధితురాలు తెలిపారు. పుష్పకుమారి చేపట్టిన దీక్షకు మణుగూరు మండలంలోని సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు సంఘీభావం తెలిపారు. పుష్ఫకుమారికి న్యాయం జరిగేవరకు తాము అండగా నిలుస్తామన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో సీపీఎం నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, బండి రాజేష్, నైనారు నాగేశ్వరరావు, వంకాల రాజు, నర్సింహారావు, ఎన్డీ నాయకుడు ఆర్ మధుసూదన్‌రెడ్డిలు ఉన్నారు. -
మాజీ నక్సలైట్ మోతీబాయ్ కి బెయిలు
ఆదిలాబాద్ జిల్లా చుక్కదరి గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ మోతీబాయ్ అలియాస్ రాధక్క శనివారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బెయిలుపై విడుదలయ్యారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆమెపై 20 కేసులు నమోదయ్యాయి. అయితే 19 కేసులు కొట్టేశారు. ఒక కేసు మాత్రం ప్రస్తుతం ఉంది. ఆమె 37 నెలల పాటు ఆదిలాబాద్ జిల్లా జైలులో శిక్ష అనుభవించారు. పౌరహక్కుల నేతలు, విరసం నేతలు ఆమె బెయిల్ కు ఎంతగానో ప్రయత్నించారు. కాగా.. శనివారం ఉదయం రాధక్క బెయిల్ పై విడుదలయ్యారు.