‘రక్షణ రంగ’ హబ్‌గా హైదరాబాద్
స్వావలంబనతోనే అభివృద్ధి సాధ్యం
ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ సదస్సులో గవర్నర్
హైదరాబాద్: దేశ రక్షణ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి అపార అవకాశాలు ఉన్నాయని, ఉత్పత్తులను మనమే తయారు చేసుకోవడం ద్వారా దేశభద్రత, ఆర్థిక ప్రయోజనాలు పొందడంతో పాటు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదం పడుతుందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ‘దేశ రక్షణ ఉత్పత్తుల్లో స్వావలంబన ’ అంశంపై ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అత్యంత కీలకమైన రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. దిగుమతుల ద్వారా ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం ఖర్చు అవుతోందని, అంతే కాకుండా వివిధ దేశాలు వారి అవసరాల కోసం చేసుకున్న ఉత్పత్తులను మనం కొనాల్సి వస్తుందని అన్నారు. మన ఉత్పత్తులను మనమే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు మరింత సమర్థంగా రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఫోరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ అధ్యక్షుడు షేకట్కర్ తదితరులు పాల్గొన్నారు.