four-lane road
-
తాడేపల్లి ఖాళీ!
తాడేపల్లి (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ ఖాళీ కానుంది. జాతీయ రహదారి నుంచి రాజధానికి వెళ్లడానికి ప్రధాన ముఖద్వారం తాడేపల్లి మున్సిపాలిటీ కావడంతో పలు రోడ్ల నిర్మాణానికి పచ్చటి పంట పొలాలు తీసుకోవడంతోపాటు అడ్డంగా ఉన్న ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ముందుగా నోటీసులు జారీచేస్తే కోర్టుకు వెళతారేమోనని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. విజయవాడకు అతి సమీపంలో ఉండటంతో 40, 50 సంవత్సరాల కిందటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పలువురు వలసవచ్చి, రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మహిళలు తాడేపల్లి మండలంతోపాటు మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో వ్యవసాయ పనులకు వెళుతుంటారు. ప్రస్తుతం 70 శాతం మంది మహిళలకు పనుల్లేక వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. పురుషులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముఠా కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సొంత ఇల్లు ఉండటంతో తినీతినక కాలం గడుపుతున్నారు. రోడ్ల పేరుతో తమ ఇళ్లు తొలగిస్తే ఎలా బతకాలని వారు ఆవేదన చెందుతున్నారు. సీఆర్డీఏ అధికారులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో.. ప్రత్యామ్నాయం ఏమిటని ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పడంలేదు. నిర్మించనున్న రహదార్లు ఇవే.. మొదట కనకదుర్గ వారధి నుంచి విజయవాడ క్లబ్ కరకట్ట వైపునకు 500 మీటర్ల రోడ్డును మలిచి, అక్కడ నుంచి ఫ్లై ఓవర్ నిర్మించి మహానాడు, సుందరయ్యనగర్ ప్రాంతాల్లో ఇళ్లు, పొలాల మీదుగా ఉండవల్లి స్క్రూ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. గుంటూరు చానల్, కొండవీటి వాగు మలుపు నుంచి ఉండవల్లి సెంటర్ వరకు, అమరావతి వెళ్లే రహదారిలో కుడివైపున శ్మశానం వరకు పీడబ్ల్యూడీ వర్కుషాపు వద్ద ఉన్న ఇళ్లను తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కనకదుర్గ వారధి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో కొలనుకొండ వద్ద ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ భూములను కలుపుకొంటూ.. రైల్వే ట్రాక్‌లు, మాతాశ్రీ ఆశ్రమం మీదుగా కొండను తొలిచి, పెనుమాక లంబాడీ కాలనీమీదుగా మరో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో పాటు స్పీడ్ యాక్సెస్ రోడ్డు, కొలనుకొండ నుంచి పెనుమాక వెళ్లే రహదారిని కలుపుతూ గుంటూరు చానల్ పక్కనే మరో రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రహదార్ల నిర్మాణాల వల్ల మున్సిపాలిటీలోను, ఉండవల్లి పరిధిలోనూ దాదాపు 1,500 ఇళ్లు తొలగించేందుకు ప్రణాళిక రూపొం దిస్తున్నారు. ఒక్క స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపడితేనే 700 ఇళ్లు తక్షణమే ఖాళీ చేయించాలి. ఒక్కో ఇంట్లో సగటున రెండు కుటుంబాలు ఉంటున్నా.. 1,400 కుటుంబాలు వీధినపడతాయి. ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితేంటి? తండ్రులు, తాతల కాలం నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. సంపాదించిందంతా ఇంటికే ఖర్చు పెట్టాం. పిల్లలు చదువుకుంటున్నారు. ప్రభుత్వం రోడ్ల పేరుతో ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటి? దీనిపై తప్పనిసరిగా అన్ని పార్టీల వారు పోరాటం చేయాలి. ... తోట సాంబశివరావు, ఉండవల్లి సెంటర్ ఆత్మహత్యే శరణ్యం 40 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిందంతా ఇంటికే పెట్టాం. రోడ్డు నిర్మాణమంటూ ఇల్లు తొలగిస్తే.. మేమెలా బతకాలి? ప్రత్యామ్నాయం చూపిం చకుండా సర్వేల పేరుతో నిద్ర లేకుండా చేస్తున్నారు. రెండున్నర సెంట్లలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టుకున్నాం. స్థలం పోయి, ఇల్లు కూడా పోతే ఆత్మహత్య తప్ప మరోమార్గం కనిపించడంలేదు.... కొప్పనాతి నాగేశ్వరమ్మ, తాడేపల్లి -
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్‌రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్‌రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్‌ఆనంద్‌తదితరులు పాల్గొన్నారు. -
‘పశ్చిమానికి’ విస్త్తారమైన రోడ్లు
తాండూరు: పశ్చిమ రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రధాన రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా డబుల్ రోడ్లను నాలుగులైన్ల రోడ్లుగా, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్లను వెడల్పు చేయడంతోపాటు పటిష్టం చేసేందుకు రాష్ట్ర సర్కారు దృష్టిసారించింది. ప్రధాన రోడ్లతోపాటు మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. వికారాబాద్ నుంచి తాండూరు వరకు ప్రధాన ప్రధాన రహదారిని నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని సర్కారు భావిస్తున్నది. ప్రస్తుతం వికారాబాద్ నుంచి తాండూరు వరకు 5.5 మీటర్ల వెడల్పుతో 39 కిలో మీటర్ల రోడ్డు ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువైంది. ఈక్రమంలో ఒకేసారి నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఈ రోడ్డును 10 మీటర్ల వెడల్పు చేసి నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఈ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. తాండూరు నుంచి తొర్మామిడి(బంట్వారం మండలం)వరకు 23 కిలో మీటర్లు, లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాల మండల కేంద్రం వరకు ఉన్న 7కి.మీ.ల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాలని కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ రెండు రోడ్ల విస్తరణకు రూ. 35 కోట్లు అవసరమవుతాయని ఆర్అండ్బీ అధికా రులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే మొయినాబాద్ నుంచి మన్నెగుడ వరకు కూడా ఉన్న సుమారు 34 కి.మీ.డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు అధికారులు ప్రభుత్వానికి రూ.వంద కోట్ల నిధులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సంబంధించి తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సీఎం ఆమోద ముద్రపడగానే నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు విస్తరణకు నోచుకుంటే ఈ రహదారిపై ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. -
మండలం టు జిల్లా.. నాలుగు లేన్లు!
* మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు విశాలమైన రహదారులు * ప్రత్యేక పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్న తెలంగాణ ప్రభుత్వం * రూ. 2 వేల కోట్లతో 152 మండల కేంద్రాల నుంచి నిర్మాణం * నాలుగేళ్లలో పనుల పూర్తి.. ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారుల వ్యవస్థకు త్వరలో మహర్దశ పట్టనుంది. ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేలా తెలంగాణలోని ప్రతి మండల కేంద్రం నుంచి ఆ జిల్లా కేంద్రానికి విధిగా నాలుగు లేన్ల రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. అడపాదడపా పనులు చేసి చేతులు దులుపుకోకుండా దీన్ని ఓ పథకంగా మార్చి నిర్ధారిత కాలపరిమితితో పనులు పూర్తి చేయాలనుకుంటోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రోడ్లు భవనాల శాఖ అధికారులతో చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనకు అందజేయాలని కూడా ఆయన ఆదేశించారు. నాలుగేళ్లలో.. దశలవారీగా.. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రహదారుల విషయంలో తెలంగాణ బాగా వెనుకబడి ఉంది. తమిళనాడు, కర్ణాటకల్లో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లేన్ల రోడ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్టణాల మధ్య పరస్పర అనుసంధాన రహదారులు మెరుగ్గా ఉన్నాయి. అదే తెలంగాణలో ఒక్క ఖమ్మం జిల్లా మినహా మరే జిల్లాలోనూ నాలుగు లేన్ల రోడ్ల వ్యవస్థ సరిగా లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా రహదారులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతంలో జాతీయ రహదారుల విస్తరణ, రాష్ట్ర రహదారులను మెరుగుపరిచే సందర్భాల్లో.. కొన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి నాలుగు లేన్ల రహదారులు ఏర్పడ్డాయి. కానీ జాతీయ, రాష్ట్ర రహదారులపై కాకుండా విడిగా ఉన్న మండల కేంద్రాల రోడ్లు మాత్రం అధ్వానంగానే ఉండిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ కనీసం డబుల్ లేన్ రోడ్లు కూడా లేవు. సింగిల్ లేన్ రోడ్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కూడా. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను సంబంధిత జిల్లా కేంద్రంతో నాలుగు లేన్ల రహదారుల ద్వారా అనుసంధానించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో 152 మండల కేంద్రాలకు వాటి జిల్లా కేంద్రానికి మధ్య నాలుగు లేన్ల రోడ్లు లేవని గుర్తించారు. వీటన్నింటినీ దశలవారీగా విస్తరించి నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన అధికారులు విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చారు. నాలుగేళ్ల కాలంలో ఈ పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దీనిపై మరోసారి ముఖ్యమంత్రితో భేటీ అయి ప్రణాళికను ఖరారు చేయనున్నారు.