తాడేపల్లి (మంగళగిరి): గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ ఖాళీ కానుంది. జాతీయ రహదారి నుంచి రాజధానికి వెళ్లడానికి ప్రధాన ముఖద్వారం తాడేపల్లి మున్సిపాలిటీ కావడంతో పలు రోడ్ల నిర్మాణానికి పచ్చటి పంట పొలాలు తీసుకోవడంతోపాటు అడ్డంగా ఉన్న ఇళ్లను తొలగించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. ముందుగా నోటీసులు జారీచేస్తే కోర్టుకు వెళతారేమోనని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా వ్యవహరిస్తున్నారు. విజయవాడకు అతి సమీపంలో ఉండటంతో 40, 50 సంవత్సరాల కిందటే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పలువురు వలసవచ్చి, రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
మహిళలు తాడేపల్లి మండలంతోపాటు మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో వ్యవసాయ పనులకు వెళుతుంటారు. ప్రస్తుతం 70 శాతం మంది మహిళలకు పనుల్లేక వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. పురుషులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ముఠా కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. సొంత ఇల్లు ఉండటంతో తినీతినక కాలం గడుపుతున్నారు. రోడ్ల పేరుతో తమ ఇళ్లు తొలగిస్తే ఎలా బతకాలని వారు ఆవేదన చెందుతున్నారు. సీఆర్‌డీఏ అధికారులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాల్లో.. ప్రత్యామ్నాయం ఏమిటని ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పడంలేదు.
నిర్మించనున్న రహదార్లు ఇవే..
మొదట కనకదుర్గ వారధి నుంచి విజయవాడ క్లబ్ కరకట్ట వైపునకు 500 మీటర్ల రోడ్డును మలిచి, అక్కడ నుంచి ఫ్లై ఓవర్ నిర్మించి మహానాడు, సుందరయ్యనగర్ ప్రాంతాల్లో ఇళ్లు, పొలాల మీదుగా ఉండవల్లి స్క్రూ బ్రిడ్జి వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. గుంటూరు చానల్, కొండవీటి వాగు మలుపు నుంచి ఉండవల్లి సెంటర్ వరకు, అమరావతి వెళ్లే రహదారిలో కుడివైపున శ్మశానం వరకు పీడబ్ల్యూడీ వర్కుషాపు వద్ద ఉన్న ఇళ్లను తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కనకదుర్గ వారధి నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో కొలనుకొండ వద్ద ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీ భూములను కలుపుకొంటూ.. రైల్వే ట్రాక్‌లు, మాతాశ్రీ ఆశ్రమం మీదుగా కొండను తొలిచి, పెనుమాక లంబాడీ కాలనీమీదుగా మరో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.
దీంతో పాటు స్పీడ్ యాక్సెస్ రోడ్డు, కొలనుకొండ నుంచి పెనుమాక వెళ్లే రహదారిని కలుపుతూ గుంటూరు చానల్ పక్కనే మరో రహదారి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రహదార్ల నిర్మాణాల వల్ల మున్సిపాలిటీలోను, ఉండవల్లి పరిధిలోనూ దాదాపు 1,500 ఇళ్లు తొలగించేందుకు ప్రణాళిక రూపొం దిస్తున్నారు. ఒక్క స్పీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపడితేనే 700 ఇళ్లు తక్షణమే ఖాళీ చేయించాలి. ఒక్కో ఇంట్లో సగటున రెండు కుటుంబాలు ఉంటున్నా.. 1,400 కుటుంబాలు వీధినపడతాయి.
ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితేంటి?
తండ్రులు, తాతల కాలం నుంచి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. సంపాదించిందంతా ఇంటికే ఖర్చు పెట్టాం. పిల్లలు చదువుకుంటున్నారు. ప్రభుత్వం రోడ్ల పేరుతో ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటి? దీనిపై తప్పనిసరిగా అన్ని పార్టీల వారు పోరాటం చేయాలి. ... తోట సాంబశివరావు, ఉండవల్లి సెంటర్
ఆత్మహత్యే శరణ్యం
40 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిందంతా ఇంటికే పెట్టాం. రోడ్డు నిర్మాణమంటూ ఇల్లు తొలగిస్తే.. మేమెలా బతకాలి? ప్రత్యామ్నాయం చూపిం చకుండా సర్వేల పేరుతో నిద్ర లేకుండా చేస్తున్నారు. రెండున్నర సెంట్లలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టుకున్నాం. స్థలం పోయి, ఇల్లు కూడా పోతే ఆత్మహత్య తప్ప మరోమార్గం కనిపించడంలేదు.... కొప్పనాతి నాగేశ్వరమ్మ, తాడేపల్లి