IND Vs SA: క్లాసెన్ కొట్టేశాడు
కటక్: వరుసగా రెండోది పాయే! సిరీస్‌కు ముందు వరుసగా 12 టి20 మ్యాచ్‌ల్ని గెలిచిన టీమిండియా ఇప్పుడు సఫారీ సవాల్‌కు నిలువలేకపోతోంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ పవర్‌కు తొలి టి20 మ్యాచ్‌ను సమర్పించుకున్న టీమిండియా... రెండో టి20లో సఫారీ బౌలింగ్ దెబ్బకు తలవంచింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ నాలుగు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లగా.. సిరీస్‌ను నెగ్గాలంటే భారత్ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులకే పరిమితమైంది. శ్రేయస్ అయ్యర్ (35 బంతుల్లో 40; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మిగతా వారిలో తొలుత ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. నోర్జే 2 వికెట్లు తీశాడు. తర్వాత దక్షిణాఫ్రికా ఆరంభంలో భువనేశ్వర్ (4–0–13–4) స్పెల్‌కు ఘోరంగా దెబ్బతిన్నా... తర్వాత ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెన్రిచ్ క్లాసెన్ (46 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులతో సులువుగానే గెలిచింది. సిరీస్‌లోని మూడో టి20 మ్యాచ్ రేపు విశాఖపట్నంలో జరుగుతుంది.
పేలవ ఆరంభంతో...
రుతురాజ్ (1)ను తొలి ఓవర్లోనే రబడ అవుట్ చేయడంతో మొదలైన భారత్ కష్టాలు ఆఖరి దాకా సాగాయి. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తనశైలి మెరుపులతో అలరించాడు. కానీ ఇది కాసేపే! 28 పరుగుల వద్ద పార్నెల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన కిషన్ దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. మరుసటి ఓవర్లోనే నోర్జే బౌలింగ్‌లో డీప్‌స్క్వేర్ లెగ్‌లో డసెన్‌కు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు. తర్వాత చప్పగా సాగిపోతున్న ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ఓవర్లో 4, 6 కొట్టి ఊపు తెచ్చాడు. కానీ పదో ఓవర్ తొలి బంతికే కెప్టెన్ రిషభ్ పంత్ (5)ను కేశవ్ మహరాజ్ బోల్తా కొట్టించాడు.
10 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు కీలక వికెట్లను కోల్పోయి 71 పరుగులే చేసింది. కాస్త గ్యాప్ తర్వాత 13వ ఓవర్లో పార్నెల్ వేసిన ఇన్‌స్వింగర్ హార్దిక్ పాండ్యా (9) లెగ్వికెట్ను పడగొట్టేసింది. ప్రధాన వికెట్లన్నీ పడిపోయిన ఈ దశలో మరింత బాధ్యతగా ఆడాల్సిన శ్రేయస్ అయ్యర్ చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల వికెట్ కీపర్ చేతుల్లోకి వెళుతున్న బంతిని టచ్ చేసి అవుటయ్యాడు. వంద పరుగుల్లోపే ఐదో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ ఆఖర్లో కొట్టిన షాట్లతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది. రబడ, ప్రిటోరియస్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్ తలా ఒక వికెట్ తీశారు.
ఆశలు రేపిన భువీ
భారత్ చేసింది తక్కువే. సఫారీ ఛేదించాల్సిన లక్ష్యం సులువైందే! కానీ సీనియర్ సీమర్ భువనేశ్వర్ వైవిధ్యమైన బంతులతో తన ప్రతీ ఓవర్లో వికెట్ తీయడం భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహాన్ని నింపింది. ఓపెనర్ హెండ్రిక్స్ (4), టాపార్డర్ బ్యాట్స్ర్లు ప్రిటోరియస్ (4), డసెన్ (1)లను భువీ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా 29 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ బవుమా (30 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్)కు జతయిన క్లాసెన్ నాలుగో వికెట్‌కు 64 పరుగులు, తర్వాత మిల్లర్ (15 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. ముఖ్యంగా భారత బౌలర్లపై క్లాసెన్ చెలరేగిపోయాడు. హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో క్లాసెన్ రెండు ఫోర్లు, అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు... చహల్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో క్లాసెన్ రెండు సిక్స్‌లు బాదాడు. గెలుపు వాకిట క్లాసెన్, పార్నెల్ అవుటైనప్పటికీ డేవిడ్ మిల్లర్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) కేశవ్ (బి) రబడ 1; ఇషాన్ కిషన్ (సి) డసెన్ (బి) నోర్జే 34; శ్రేయస్ (సి) క్లాసెన్ (బి) ప్రిటోరియస్ 40; పంత్ (సి) డసెన్ (బి) కేశవ్ 5; హార్దిక్ పాండ్యా (బి) పార్నెల్ 9; అక్షర్ (బి) నోర్జే 10; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 30; హర్షల్ పటేల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1–3, 2–48, 3–68, 4–90, 5–98, 6–112.
బౌలింగ్: రబడ 4–0–15–1, పార్నెల్ 4–0–23–1, నోర్జే 4–0–36–2, ప్రిటోరియస్ 4–0–40–1, షమ్సీ 2–0–21–0, కేశవ్ మహరాజ్ 2–0–12–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (బి) చహల్ 35; హెండ్రిక్స్ (బి) భువనేశ్వర్ 4; ప్రిటోరియస్ (సి) అవేశ్ (బి) భువనేశ్వర్ 4; డసెన్ (బి) భువనేశ్వర్ 1; క్లాసెన్ (సి) సబ్–బిష్ణోయ్ (బి) హర్షల్ 81; మిల్లర్ (నాటౌట్) 20; పార్నెల్ (బి) భువనేశ్వర్ 1; రబడ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.2 ఓవర్లలో 6 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1–5, 2–13, 3–29, 4–93, 5–144, 6–147.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–13–4, అవేశ్ ఖాన్ 3–0–17–0, హార్దిక్ పాండ్యా 3–0–31–0, చహల్ 4–0–49–1, హర్షల్ 3–0–17–1, అక్షర్ 1–0–19–0, శ్రేయస్ 0.2–0–2–0.