Fourth Death Anniversary
-
వైఎస్ ఉంటే ఈ గతి పట్టేదా?
సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, రావణకాష్టంలా మండుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఆయనే బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదన్నారు. వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువజన విభాగం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణతో పాటు పెద్దసంఖ్యలో వైఎస్ అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. సేవాదళం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ మరణం తర్వాత తెలుగు ప్రజలకు అనేక ఇబ్బందులు వచ్చాయి. తెలుగు ప్రజల అభివృద్ధిని చూసి ఢిల్లీ నాయకులు అసూయపడ్డారు. అందుకే విభజించాలనే కుట్రతో విద్వేషాలు రగిలించారు’’ అని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని ఏకకాలంలో అందించి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ లేకపోవడంవల్లే రాష్ట్రం ముక్కచెక్కలయ్యే పరిస్థితి దాపురించిందని, రాష్ట్రం ఇన్ని సంక్షోభావాలను చవిచూస్తుందని కలలో కూడా ఊహించలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును నిలదీయండి: శోభానాగిరెడ్డి రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఊసరవెల్లికంటే ఎక్కువగా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ ఇవ్వడమే కాక, దానికి కట్టుబడి ఉన్నట్లు ఉద్యోగ జేఏసీ నేతలకు చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించాలంటూ లేఖలు రాసిన చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలో యధేచ్ఛగా తిరుగుతుంటే ప్రజల్లో సమైక్య భావన లేదని ఢిల్లీ నాయకులు భావిస్తారు. అందువల్ల జేఏసీ సంఘాలన్నీ కూడా చంద్రబాబు విభజన లేఖ వెనక్కి తీసుకోవాలని, పదవులకు రాజీనామా చేయాలని ఆయన్ని నిలదీసి, ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే సీమాంధ్ర ఉద్యమ గొంతుకను ఢిల్లీలో వినిపించగలుగుతాం’’ అని చెప్పారు. -
వైఎస్ ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు: గాదె
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే రాష్ట్రాన్ని విభజించాలని భావించినప్పటికీ గట్టిగా ఎదిరించి, సమైక్యంగా ఉంచాలని వాదించిన నాయకుడు వైఎస్ అని చెప్పారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా గాదె ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వైఎస్చేసిన కృషిని ఆయన స్మరించుకున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం రాజశేఖరరెడ్డికి అస్సలు ఇష్టం లేదని, అదే విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్‌ముఖర్జీ తమకు చె ప్పినట్లు తెలిపారు. ‘‘2010లో ఒకసారి, 2011లో మరోసారి 80, 90 మంది ఎమ్మెల్యేలం కలిసి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాం. అప్పుడు.. ‘టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. మేమే బలవంతంగా ఒప్పించి పొత్తు కుదిర్చాం. మీ వాళ్లెవరూ ఆ మాట అప్పట్లో ఎందుకు చెప్పలేదు’ అని ప్రణబ్ మమ్మల్ని అడిగారు. నిజంగా వైఎస్ బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు’’ అని గాదె పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లపై ఆధారపడిన వారు తెలంగాణలోనే చాలా ఎక్కువైనప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని తెలిపారు. ఆ విధంగా దీనివల్ల తెలంగాణ రైతులే ఎక్కువగా లాభపడ్డారని చెప్పారు. ‘ప్రణాళికా సంఘం రాష్ట్రంలో 2.5 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 1.5 కోట్ల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం కింద 86 సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు వైఎస్ కృషి చేశారు’ అని చెప్పారు. అది మెజారిటీ అభిప్రాయం కాదు: 545 మంది లోక్‌సభ ఎంపీలకు గాను యూపీఏకు 226 సీట్ల బలం మాత్రమే ఉందని, అలాంటప్పుడు విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం మెజారిటీ అభిప్రాయం ఎలా అవుతుందని అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు గాదె ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో ఎన్నడూ తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలని 2001లో సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అది ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. 2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు అభ్యంతరం లేనప్పటికీ స్టేక్ హోల్డర్ల (వాటాదారుల) అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంద ని చెప్పారే తప్ప ఎవరితో పనిలేకుండా, ఎవరితో చర్చించకుండా విభజించాలని అనలేదని గుర్తుచేశారు. 2009 డిసెంబర్ 7న జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఆనాడు వైఎస్ చేసిన ప్రకటననే ప్రస్తావిస్తూ తీర్మానం చేశామన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడమంటే తెలుగు జాతిపై వివక్ష చూపడమేనని గాదె పేర్కొన్నారు. ఇప్పటికైనా హైకమాండ్ పెద్దలు పార్టీ నిర్ణయాన్ని పునః పరిశీలించడంతోపాటు రెండో ఎస్సార్సీ వేయడమే శరణ్యమని సూచించారు. అది సాధ్యం కాకపోతే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనూ అత్యుత్తమమైన ఆరో సిఫారసును అమలు చేసి తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. -
వైఎస్‌కు కుటుంబ సభ్యుల ఘననివాళి
ఇడుపులపాయ, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ సతీమణి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలు, షర్మిల భర్త బ్రదర్ అనిల్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎస్టేట్ ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మ, రవీంద్రనాథరెడ్డ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు వైఎస్సార్ ఘాట్‌లోని మహానేత సమాధి వద్ద కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇడుపులపాయలోని చర్చి ఫాదర్ రవికిరణ్ ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద విజయమ్మ, షర్మిల మౌనంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురై కంటితడి పెట్టారు. పెద్దాయనకు ప్రముఖుల నివాళి: వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన వారిలో జిల్లా వైఎస్సార్సీపీ కన్వీనర్ సురేష్‌బాబు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, కాకినాడ, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్నాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, చంద్రశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పురుషోత్తంరెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులున్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్ఆర్కు నివాళులు
-
నేడు మహానేత వైఎస్ఆర్ నాలుగో వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతిని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే. అలాగే వర్ధంతి రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించాలని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేలా పైనుంచి ఆశీర్వదించాలని కోరుతూ ఆయన విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించాలని కూడా కార్యకర్తలకు పిలుపునివ్వడమూ విదితమే. ఈ నేపథ్యంలో రక్తదానాలు, ఉచిత వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను వాడవాడలా నిర్వహించడానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతాయని పార్టీ వర్గాలు ఆదివారం తెలిపాయి.