సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే రాష్ట్రాన్ని విభజించాలని భావించినప్పటికీ గట్టిగా ఎదిరించి, సమైక్యంగా ఉంచాలని వాదించిన నాయకుడు వైఎస్ అని చెప్పారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా గాదె ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు వైఎస్‌చేసిన కృషిని ఆయన స్మరించుకున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం రాజశేఖరరెడ్డికి అస్సలు ఇష్టం లేదని, అదే విషయాన్ని అప్పట్లో కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్‌ముఖర్జీ తమకు చె ప్పినట్లు తెలిపారు. ‘‘2010లో ఒకసారి, 2011లో మరోసారి 80, 90 మంది ఎమ్మెల్యేలం కలిసి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లాం. అప్పుడు.. ‘టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. మేమే బలవంతంగా ఒప్పించి పొత్తు కుదిర్చాం.
మీ వాళ్లెవరూ ఆ మాట అప్పట్లో ఎందుకు చెప్పలేదు’ అని ప్రణబ్ మమ్మల్ని అడిగారు. నిజంగా వైఎస్ బతికి ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు’’ అని గాదె పేర్కొన్నారు. వ్యవసాయ కనెక్షన్లపై ఆధారపడిన వారు తెలంగాణలోనే చాలా ఎక్కువైనప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసి అమలు చేశారని తెలిపారు. ఆ విధంగా దీనివల్ల తెలంగాణ రైతులే ఎక్కువగా లాభపడ్డారని చెప్పారు. ‘ప్రణాళికా సంఘం రాష్ట్రంలో 2.5 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని పేర్కొంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా 1.5 కోట్ల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో జలయజ్ఞం కింద 86 సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు వైఎస్ కృషి చేశారు’ అని చెప్పారు.
అది మెజారిటీ అభిప్రాయం కాదు: 545 మంది లోక్‌సభ ఎంపీలకు గాను యూపీఏకు 226 సీట్ల బలం మాత్రమే ఉందని, అలాంటప్పుడు విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం మెజారిటీ అభిప్రాయం ఎలా అవుతుందని అంతకుముందు మీడియాతో మాట్లాడినప్పుడు గాదె ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో ఎన్నడూ తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో రెండో ఎస్సార్సీ వేయాలని 2001లో సీడబ్ల్యూసీ తీర్మానించిందని, అది ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా తెలంగాణ ఇస్తామని హామీ ఇవ్వలేదన్నారు. 2009 ఫిబ్రవరి 12న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు అభ్యంతరం లేనప్పటికీ స్టేక్ హోల్డర్ల (వాటాదారుల) అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంద ని చెప్పారే తప్ప ఎవరితో పనిలేకుండా, ఎవరితో చర్చించకుండా విభజించాలని అనలేదని గుర్తుచేశారు. 2009 డిసెంబర్ 7న జరిగిన సీఎల్పీ సమావేశంలోనూ ఆనాడు వైఎస్ చేసిన ప్రకటననే ప్రస్తావిస్తూ తీర్మానం చేశామన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవడమంటే తెలుగు జాతిపై వివక్ష చూపడమేనని గాదె పేర్కొన్నారు. ఇప్పటికైనా హైకమాండ్ పెద్దలు పార్టీ నిర్ణయాన్ని పునః పరిశీలించడంతోపాటు రెండో ఎస్సార్సీ వేయడమే శరణ్యమని సూచించారు. అది సాధ్యం కాకపోతే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనూ అత్యుత్తమమైన ఆరో సిఫారసును అమలు చేసి తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలని కోరారు.
వైఎస్ ఉంటే తెలంగాణ ఉద్యమమే వచ్చేది కాదు: గాదె
Published Tue, Sep 3 2013 4:11 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement