ఫోర్త్ లయన్ యాప్ కొత్త వెర్షన్ విడుదల
భవానీపురం : ఫోర్త్ లయన్ యాప్‌ను ప్రజలకు మరిన్ని సేవలను అందించేందుకుగాను దానిని ఆధునీకరించి రూపొందించిన కొత్త వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలని కోరారు. కొద్ది రోజులలో ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
యాప్ కొత్త వెర్షన్లో పొందుపరిచిన సౌకర్యాలు
► హోమ్ పేజి డిజైన్ మార్చి మరింత ఆకర్షణీయంగా నగర పోలీస్ వెబ్సైట్ వివరాలు ఇచ్చారు
► పబ్లిక్ ఇన్ఫర్మేషన్లోని పోలీస్ స్టేషన్ ఆప్షన్లో ఆ స్టేషన్‌ను కాంటాక్ట్ చేసేందుకు ఫోన్ నెంబర్, స్టేషన్ ఉండే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించారు.
► నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు పొందుపరిచారు. తద్వారా వారిని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు.
► రహదారులలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల (లైవ్ ట్రాఫిక్‌లో బ్లాక్ స్పాట్స్) వివరాలను ఇచ్చారు. ఈ సమాచారంతో బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్, హాస్పటల్ ఎంత దూరంలో ఉంది అనే వివరాలను పొందుపరిచారు. రాబోయే వెర్షన్లో దీనిని మరింత మెరుగుపరచనున్నారు.
యాప్‌లో ప్రత్యేక సర్వీసులు
► మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ‘ట్రాక్ మై ట్రావెల్’, ఎస్ఓఎస్ను పొందుపరిచారు. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే యాప్‌లో ఈ బటన్‌ను నొక్కడం వలన పోలీసులు అప్రమత్తమై మీరు ఉన్న ప్రాంతానికి అతి తక్కువ సమయంలో చేరుకుని రక్షిస్తారు.
► నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల ప్రాంతాలలో స్థిరపడేందుకు ఉద్యోగరీత్యాగానీ, జోవనోపాధి కోసంగానీ ఎంతోమంది వస్తున్నారు. అటువంటివారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, కొత్తగా పనులలో కుదుర్చుకునేటప్పుడు, డ్రైవర్లను నియమించుకునే సమయంలో వారి వివరాలను ఈ యాప్‌లోని ‘వెరిఫికేషన్’ ఆప్షన్ ద్వారా పంపితే, పోలీసులు వారి గురించి విచారించి వారి వివరాలను దరఖాస్తుదారునికి తెలియచేస్తారు. మంచివారిని పనిలోకి తీసుకోవడం, సరైనవారికి ఇల్లు అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.
► ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు ఇంటి వివరాలను వెకేషన్ ఇన్ఫర్మేషన్లో పొందుపరిస్తే, ఆ ప్రాంతంలో పోలీసు బీటును ఏర్పాటు చేస్తారు.
ప్రజలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకుని పోలీసుల సేవలను అందుకోవాలని కోరారు.