హ్యూస్ జ్ఞాపకాలు వెంటాడుతాయి!
నాలుగో టెస్టుపై వాట్సన్
సిడ్నీ: ఫిల్ హ్యూస్ మైదానంలో బౌన్సర్ దెబ్బకు కుప్పకూలినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. హ్యూస్ అంత్యక్రియల తర్వాత మొదటిసారి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి స్థితిలో టెస్టు మ్యాచ్ ఆడనున్న షేన్ వాట్సన్ తన దివంగత మిత్రుడిని గుర్తు చేసుకున్నాడు. ‘ఫిల్ అంత్యక్రియల తర్వాత ఇప్పుడే సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చాను.
నాటి ఘటనను మరిచేందుకు గత కొద్ది రోజులుగా నేను ప్రయత్నిస్తున్నాను. అయితే ఒక్కసారి క్రీజ్‌లోకి వెళితే ఆ దృశ్యమే కళ్ల ముందు కదలాడుతుంది. ముఖ్యంగా మా నలుగురం ఎలా ఉండగలమో చెప్పలేను. అయితే జట్టుగా మేమంతా స్థైర్యంగా ఉండి దానిని అధిగమిస్తాం’ అని వాట్సన్ అన్నాడు.
ఫామ్‌లోకి వస్తా...
ఈ సిరీస్‌లో మూడు టెస్టులు ముగిసినా వాట్సన్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీన్నుంచి బయటపడి నాలుగో టెస్టులో రాణిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘నేను తీవ్రంగా కష్టపడుతున్నా సిరీస్‌లో మాత్రం అనుకున్న రీతిలో ఆడలేకపోయాను. పరుగులు చేయకపోవడంతో నాపై ఒత్తిడి ఉంది.
రెండు విభాగాల్లోనూ జట్టు విజయంలో నా పాత్ర కూడా ఉండేందుకు సిడ్నీ టెస్టులో ప్రయత్నిస్తా’ అని అతను చెప్పాడు. షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో ఇప్పుడు హాడిన్‌ను ఆదర్శంగా తీసుకుంటానని, అతనిలాగే పట్టుదలగా ఆడి నిలబడతానని వాట్సన్ అన్నాడు.