ఎంసెట్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
విజయవాడ : రాష్ట్రంలో ఈ నెల 29న జరుగనున్న ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందించేలా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలను ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు మంగళవారం ఒక ప్రకటనలో వివరించారు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోను ఆర్టీసీ రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక (స్పెషల్) సర్వీసులను నడుపుతామని ఆయన పేర్కొన్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ పరీక్షా కేంద్రానికి వెళుతున్నదీ వివరాలతో బస్సులకు ప్రత్యేక డిస్ప్లే బోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి వారు వెళ్లాల్సిన పరీక్షా కేంద్రం వైపు వెళ్లే బస్సు ఎక్కి ఎంసెట్ హాల్ టికెట్ చూపిస్తే చాలు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని వివరించారు.
ఈ నెల 29న ఉదయం 10గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగే ఇంజినీరింగ్ కోర్సు విద్యార్థుల కోసం ఉదయం ఆరు గంటల నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. అదే మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఉదయం 11గంటల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతామని తెలిపారు. ఆర్టీసీ అందిస్తున్న ప్రయాణ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.