సిద్ధం
- అభివృద్ధికి యాక్షన్ ప్లాన్
- సహకారానికి వివిధ పార్టీల సంసిద్ధత
- పనుల కోసం ప్రత్యేక కమిటీలు
- సీఎం సమీక్ష సమావేశంలో నిర్ణయం
సాక్షి,సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’ వేదికగా నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయాల కు అతీతంగా అన్ని పార్టీలనూ కలుపుకొని ముందుకు సాగేందుకు నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం సీఎం సమక్షంలో జరిగిన సమీక్షలో వివిధ పార్టీలు నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారమందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దీంతో ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమైంది. నగరంలో నాలాలను ఆధునీకరించాలన్నా, రహదారులను వెడ ల్పు చేయాలన్నా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అన్ని పార్టీలను కలుపుకొని పోవడం.. స్థానిక ఎమ్మెల్యేకే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్ఎంసీ-జలమండలి, హెచ్ఎండీఏ, విద్యుత్‌కు సంబంధించిన పనులపై ప్రత్యేక కమిటీలు వేస్తున్నారు. వీటి బాధ్యతలను సైతం నాలుగు పార్టీల నాయకులు కె.కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, మల్లారెడ్డి, కిషన్‌రెడ్డిలకు అప్పగించారు. వారు కమిటీలపై వెంటనే నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. త్వరలోనే జీవో వెలువడనుంది. ఈ కమిటీలు వచ్చేనెల 8న మరోమారు సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనున్నాయి. తొలుత నాలాలు.. నీళ్లు.. చెత్త.... గృహ నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాలాల ఆధునికీకరణ
నగరంలో నాలాల ఆధునికీకరణకు ఏళ్ల తరబడి సాగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. అన్ని పార్టీలకు భాగస్వామ్యం కల్పించనిదే ఈ సమస్య పరిష్కారం కాదని సీఎం భావించారు. అందుకనుగుణంగా అన్ని పార్టీలను ఒప్పించడంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడం... తాగునీటిలో మురుగునీరు కలుస్తున్న దుస్థితిని వివరించారు. కాలువలపై ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే విధి విధానాలు రూపొందించనున్నారు. రాబోయే రెండు మూడేళ్లలో కనీసం రూ. 6వేల కోట్ల పనులైనా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
ఆటోట్రాలీలు
ఇళ్ల నుంచి చెత్త తరలింపునకు ప్రస్తుతమున్న రిక్షాల స్థానే ఆటోట్రాలీలు అందుబాటులోకి తేనున్నారు. బస్తీల్లోని నిరుద్యోగులకే వీటిని అందజేసి, ఇంటి చెత్త రోడ్డుపై ఎక్కడా పడకుండా డంపింగ్ యార్డుకు తరలించే ఏర్పాట్లు చేయనున్నారు. తొలిదశలో 2వేల ఆటోట్రాలీలను కొనుగోలు చేయనున్నారు. దీనికి దాదాపు రూ. 90 కోట్లు ఖర్చు చేయనున్నారు.
24 తక్షణ మరమ్మతు బృందాలు
రహదారులపై గుంతలు, ఫుట్‌పాత్‌ల మరమ్మతుల వంటి చిన్నచిన్న పనులకు తక్షణ మరమ్మతు బృందాలను శాశ్వతంగా ఏర్పాటుచేయనున్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో వీటి వల్ల మంచి ఫలితం కనిపించిన సంగతి తెలిసిందే.
45 లక్షల డబ్బాలు
ఇళ్లనుంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు రెండు రంగుల డబ్బాలను ప్రభుత్వమే ఉచితంగా అందజేయనుంది. దాదాపు 45 లక్షల డబ్బాలను వీలైనంత త్వరితంగా ప్రజలకు అందజేసే పనిలో పడ్డారు.
తాగునీరు, డ్రైనేజీపై ప్రత్యేక శ్రద్ధ
తాగునీటి సరఫరాకు అవసరమైన రూ.3100 కోట్లు, తాగునీరు.. మురుగునీరు కలిసిపోతుండటాన్ని నిరోధించేందుకు అవసరమైన రూ.3400 కోట్లు సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. దీంతో పాటు ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చే పనిని కూడా చేపట్టనున్నారు.
సిబ్బంది కొరతపై దృష్టి
జీహెచ్ఎంసీ సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం సీఎం దృష్టికి వచ్చింది. అవసరమైన వారిని వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీటితో పాటు సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయాలని భావిస్తున్నారు.