బాత్రూమ్లో నటుడి చర్యతో కలకలం!
ప్యారిస్: మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఓ నటుడు బాత్రూమ్లో చేసిన పనికి ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ, ఆయుధాలు అంటూ బాత్రూమ్లో మాట్లాడిన అతడిని ఉగ్రవాదిగా భావించి అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడు నటుడని, మూవీ డైలాగ్ ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని పదాలు వాడినట్లు తెలుసుకుని విచారణ అనంతరం వదిలేశారు. అసలే 2015 నవంబర్‌లో జరిగిన మారణహోమాన్ని ఫ్రాన్స్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఈ క్రమంలో ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్న పర్షియాకు చెందిన ఆర్టిస్ట్(35) మార్సెల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే మెట్రో రైలెక్కాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూమ్లోకి వెళ్లిన నటుడు తుపాకులు, ఆయుధాలు అంటూ కొన్ని పదాలను ఇంగ్లీష్‌లో, డచ్ భాషలో పదే పదే ఉచ్చరించాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు మెట్రో రైలులో ఉగ్రవాది ఉన్నాడంటూ టికెట్ ఎగ్జామినర్‌కు సమాచారం అందించారు. ఆయన బాత్రూమ్ వద్దకు వచ్చి విషయాన్ని నిర్ధారించుకున్నాడు. వెంటనే రైల్వే పోలీసులు, ఆర్మీ సిబ్బందిని అలర్ట్ చేశాడు. 2015 నవంబర్‌లో ఐసిస్ ఉగ్రదాడులు జరిగి 130 మందికి పైగా మృత్యువాత పడ్డ తర్వాత అక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
రెండేళ్లలోపే మరోదాడి జరుగుతుందోమోనని భావించిన భద్రతా సిబ్బంది ప్యారిస్ లో హై అలర్ట్ ప్రకటించిన అనంతరం ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. కామిక్ క్యారెక్టర్స్ చేసే ఆ వ్యక్తి తాను హాలీవుడ్ మూవీలో నటిస్తున్నానని, అందులో భాగంగానే డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. కంపార్ట్ మెంట్లో డైలాగ్స్ గట్టిగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ పని చేశానని వివరణ ఇవ్వడంతో అతడిని విడిచిపెట్టారు. అతడు ఉగ్రవాది కాదని, నటుడని.. ఆందోళన అక్కర్లేదని పోలీసులు మీడియాకు వెల్లడించారు.