బ్రిటన్ వీసా నిబంధనలపై స్పందించిన నాస్కామ్
న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రభుత్వ వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై సాఫ్ట్ వేర్ బాడీ నాస్కామ్ ఇండియా స్పందించింది. ఇది మనదేశ ఐటీ నిపుణుల భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని పడవేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతోపాటుగా యూకే ప్రతిపాదిత మార్పులు రెండు దేశాల ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ఒక ఇమ్మిగ్రేషన్ సమస్య కాకుండా వాణిజ్య ప్రాధాన్యత గల అంశంగా చూడాలని కోరుతూ ఒక ప్రకటన జారి చేసింది.
ఈ మేరకు భారత ప్రభుత్వం కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సూచించింది. ముఖ్యంగా బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా భారత పర్యటన సందర్భంగా నైపుణ్యం గల ఐటి వలసల విధానంపై చర్చించాలని నాస్కామ్ కోరింది. భారత బ్రిటన్ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా దీనిపై చర్చలు జరపాలంది. ఈ విషయంలోరెండు దేశాలు చొరవ తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
బ్రిటన్ ఆర్థికవ్యవస్థలో భారత ఐటీ కంపెనీలు కీలక పాత్రను పోషిస్తున్నాయని నాస్కామ్ వివరించింది. ఉత్పాదకతలో, ఉద్యోగాల సృష్టిలో, సంపద వృద్ధిలో ప్రధాన పాత్ర కలిగి ఉన్నాయని తెలిపింది. తద్వారా ఆ దేశం గణనీయమైన ఆర్ధిక పరిపుష్టిని సాధిస్తోందనీ, ప్రపంచవ్యాప్త పోటీలో తన స్తానాన్ని మెరుగుపరుచుకుంటోందని పేర్కొంది. నిపుణులైన ఐటీ ఉద్యోగులను కట్టడి చేయడమంటే తమ దేశ ఆర్థికవృద్ధిని కట్టడిచేయడమేనని తెలిపింది. ప్రతిభావంతులైన నిపుణుల మార్పిడి కారణంగానే భారతదేశం, బ్రిటన్ మధ్య స్నేహ సంబంధాలు విలసిల్లాయని నాస్కామ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ అంశమే మూలస్తంభంగా రెండు దేశాల మధ్య సహజ వ్యాపార సంబంధాలు కొనసాగాయని గుర్తు చేసింది.