వర్సిటీకి తాళం
- ఆందోళన ఉధృతం
- కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ధర్నా సమస్యలపై కమిటీ?
- 10 నుంచి ఎంబీఏ పరీక్షలు జరిగేనా?
శాతవాహన యూనివర్సిటీ : శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల సమస్య చినికిచినికి గాలివానలా మారింది. వారి వరుస ఆందోళనలు ఏకంగా వర్సిటీకి తాళం వేసేవరకూ తీసుకె ళ్లాయి. వసతిగృహాల్లో సమస్యలు పరిష్కరించాలని, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత నెల 23 నుంచి ఆందోళన చేస్తున్నారు.
కారణమిదీ..
వారం క్రితం విద్యార్థులు వసతిగృహానికి రావాలని అధికారులు సూచించారు. వారి పిలుపుతో కొంతమంది అక్కడకు చేరుకున్నారు. అయితే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ఈ సారి మెస్ డిపాజిట్ కొంత పెంచామని, దానిని చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. వసతులు లేని గృహంలో ఉండడమే మిన్న.. దానికి రుసుం చెల్లించాలా..? అంటూ విద్యార్థులు మొండికేశారు. అధికారులు కూడా పట్టించుకోలేదు. అదే సమయంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బాలుర వసతి గృహానికి వచ్చి తరగతుల కు హాజరుకావాలని విద్యార్థులను ఆదేశించా రు.
అయితే సమస్య పరిష్కరించేవరకూ రాబోమని విద్యార్థులు స్పష్టం చేశారు. అలా మొదలై న ఆందోళన తారస్థాయికి చేరింది. అధికారులు బుధవారం సుమారు 12 గంటలపాటు వర్సిటీలోని 10 మంది రెగ్యులర్, 60 మంది అకాడమిక్ కన్సల్టెంట్స్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో చర్చిం చి విద్యార్థులకు నచ్చజెప్పినా వారు మొండికేశారు. దీంతో వర్సిటీని నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు.
కలెక్టరేట్ ముట్టడి..
గురువారం ఉదయం టిఫిన్ ముగించుకున్న విద్యార్థులు బ్యాగులు పట్టుకుని ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మూడు గంటలపాటు ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విద్యార్థుల ద్వారా సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఎంబీఏ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్సిటీ నిరవధిక బంద్ సడలించేలా విద్యార్థులే సహకరించాలని సూచించారు.
కొందరి ఆందోళన.. అందరికీ శిక్ష
సమస్యల పరిష్కారం కోసం ఆర్ట్స్ విద్యార్థులే ఆందోళన చేస్తుండగా.. ఆ శిక్ష వర్సిటీలోని అన్ని విభాగాల విద్యార్థులూ అనుభవిస్తున్నారు. డ్యాం సమీపంలోని ఫార్మసీ, సైన్స్ కళాశాల తరగతులు కూడా ఉండవనే అధికారుల నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమస్య పరిష్కారానికి కమిటీ?
విద్యార్థులకు మెస్, ఇతరత్రా సమస్యలు పరిష్కరించేందుకు వీసీ ఆధ్వర్యంలో కమిటీ వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వర్సిటీలో రెగ్యులర్, అకామిక్ కన్సల్టెంట్స్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో వీసీ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెల్సింది.
పరీక్షల నిర్వహణ జరిగేనా...?
శాతవాహన యూరివర్సిటీ పరిధిలోని ఎంబీఏ విద్యార్థులకు ఈ నెల 10 నుంచి ఫస్టియర్ సెకం డ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైంటేబుల్ కూడా ఎస్‌యూ పరీక్షల నియంత్రణ బోర్డు ప్రకటించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో దాదాపు వారం పది రోజుల పాటు వర్సిటీ నివరధిక బంద్ పాటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతాయా? లేక వాయిదా పడతాయా? అని విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.