ప్రత్యేక హోదా ఏపీ హక్కు : ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్ డీసీ:
ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ హక్కు అంటూ ప్రవాసాంధ్రులు నినదించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో యువత చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీకి ప్రవాసాంధ్రులు మద్దుతుగా నిలిచారు. వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ పార్కు దగ్గర కొవ్వొత్తులతో ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని ప్రవాస ఆంధ్రులు నిరసన తెలిపారు.
వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో ఉన్న తెలుగు వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అన్నది ఏదో ఓ పార్టీకి చెందిన అంశం కాదని, ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి సంబంధించిన విషయం అని ఎన్ఆర్ఐలు తెలిపారు. తిరుమల దేవ దేవుని సమక్షంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాటను నిలుపుకొని, మాట తప్పని వాడిగా చరిత్ర పుటల్లో మిగిలి పోవాలని వారు పేర్కొన్నారు.
జల్లికట్టు ఆటని సుప్రీం కోర్టు రద్దు చేస్తేనే కేంద్ర ప్రభుత్వాన్ని తమిళ సోదరులు కదిలించగాలేనిది... మనకు పార్లమెంట్ సాక్షిగా చెప్పిన ప్రత్యేక హోదాని తెలుగువారందరం కలిసి సాధించుకోలేమా? అని ఎన్ఆర్ఐలు ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఏపీకి అన్యాయం చేయాలనుకుంటున్న ప్రభుత్వాలను నిలదీద్దాం. నిలదీసేవారికి మద్దతుగా నిలబడదాం. రండి కదిలిరండి ప్రత్యేక హోదా సాధన కోసం అని గళం విప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్య నిర్వాహకులు సురేంద్ర బత్తినపట్ల, వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ మిడ్ అట్లాంటిక్ సలహాదారు, రీజినల్ ఇంచార్జీ రమేష్ రెడ్డి వల్లూరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.