అరటికి భలే డిమాండ్
వేముల :
మార్కెట్లో అరటికి డిమాండ్ పెరిగింది. రెండు, మూడు నెలలుగా మార్కెట్లో అరటి ధరలు నిలకడగా ఉండటంతో కొనుగోలుకు తోటల వద్దకు వ్యాపారులు పరుగులు తీస్తున్నారు. తోటలలో కాయల పక్వానికి రాకముందే కోత కోస్తున్నారు. అయితే మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో తోటలలో అరటి దిగుబడులు రానున్నాయి. ఆ సమయంలో ధరలు ఎలా ఉంటాయోనని రైతులలో ఆందోళన నెలకొంది. కాగా జిల్లాలో 12,800హెక్టార్లలో అరటి తోటలు సాగులో ఉన్నాయి. పులివెందుల, రైల్వేకోడూరు, రాజంపేట, మైదుకూరు నియోజకవర్గాల్లో అరటి సాగులో ఉంది. జిల్లాలోనే అత్యధికంగా పులివెందుల నియోజకవర్గంలో 6వేల హెక్టార్లల్లో అరటి సాగైంది. అరటి పంటను జూన్, జులై మాసాల్లో సాగు చేస్తారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో అరటి కాయలు కోతకు వస్తాయి. అరటి కోతకు వచ్చే సమయంలోనే ముంగారు వర్షాలతో పెనుగాలులకు అరటి తోటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరటి ధరలు గణనీయంగా పడిపోయాయి. టన్ను రూ.2వేల నుంచి రూ.4వేల లోపు ఉన్నాయి. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడులలో 30శాతం కూడా రైతులకు రాలేదు.
తోటలలో కాయల్లేక అరటికి డిమాండ్ :
తోటల్లో కాయలు లేకపోవడంతో అరటికి డిమాండ్ పెరిగింది. తోటలలో దిగుబడులు అమ్మిన తర్వాత అరటికి ధరలు వచ్చాయి. మే, జూన్ మాసం నుంచే ధరలు పెరిగాయి. మార్కెట్లో టన్ను అరటి కాయలు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు ఉన్నాయి. జిల్లాలో అక్కడక్కడా ఆలస్యంగా సాగు చేసిన కొంతమంది రైతులకు పెరిగిన ధరలతో ఊపిరి వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అరటి కాయలు కోతకు రానున్నాయి. అప్పటి వరకు ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఊరట వస్తుంది.
తోటల వద్దకు పరుగులు తీస్తున్న వ్యాపారులు :
గత రెండు, మూడు నెలలుగా మార్కెట్లో అరటి ధరలు నిలకడగా ఉండటంతో వ్యాపారులు కాయల కోసం తోటల వద్దకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఎక్కడ తోటలలో అరటి కాయలు ఉన్నాయో గాలిస్తున్నారు. ఎక్కడ అరటి కాయలు ఉంటే అక్కడికి వ్యాపారులు వాలిపోతున్నారు. తోటలలో అరటి గెలలు మరో నెలకు పక్వానికి వస్తాయనగా ముందుగానే కోత కోసేందుకు వ్యాపారులు వెనుకాడలేదు. ఈ ధరలతో వ్యాపారులకే కాకుండా రైతులు కూడా ఆదాయం కళ్లజూస్తున్నారు.
మరో రెండు నెలల్లో పూర్తిస్థాయి దిగుబడులు :
జిల్లా వ్యాప్తంగా అరటి తోటల్లో మరో రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో దిగుబడులు రానున్నాయి. అక్టోబరు, నవంబరు మాసాల్లో అరటి తోటలలో గెలలు కోతకు వస్తాయి. ఆ సమయంలో మార్కెట్ ధరలు ఎలా ఉంటాయోనని రైతులలో ఆందోళన నెలకొంది. రెండో కాపు నిలిపిన తోటలలో కాయలు కోతకు వచ్చే సమయం ఆసన్నమైంది.
ధరలు తగ్గితే నష్టపోతాం.. :
అరటి గెలలు కోతకు వచ్చే సమయంలో ధరలు తగ్గితే నష్టపోతాం. తోటలలో కాయలు లేని సమయంలో ధరలు ఉంటున్నాయి. కాయలు ఉన్నప్పుడు ధరలు తగ్గిపోతున్నాయి. ధరలు నిలకడగా లేకపోవడంతో అరటిలో నష్టాలను చవిచూస్తున్నాం.
– శ్రీరామిరెడ్డి(అరటి రైతు), భూమయ్యగారిపల్లె