ఫుల్ కిక్
భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
జనవరి 1 నుంచి 16 వరకూ రూ.65 కోట్లకు పైగా వ్యాపారం
చాటుమాటుగా సారా విక్రయాలు
నోట్ల రద్దు ప్రభావంతో స్వల్పంగా తగ్గిన వైనం
మందుబాబులకు పండుగే... పండుగ
సంక్రాంతి అంటే కొందరికి సంప్రదాయ పండగ. ఇంకొందరికి క్రీడా సంబరం. కానీ సర్కారుకు మాత్రం కాసుల సందడి. మందుబాబులు చిందులు తొక్కే ప్రాంతాలను ఎంపిక చేసుకొని మద్యం కేసులు డంప్ చేసి ‘తాగర బాబూ...తాగి ఊగర బాబు’ అంటూ తన ఎక్సైజ్ సిబ్బందిని, మద్యం తాగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులను దింపుతుంది. ఓ వైపు చట్టబద్ధంగా మద్యం అక్రమాలు ... ఇంకో వైపు చట్టప్రకారం అరెస్టులు. ఇదే మద్యం మాయాజాలం.
రాయవరం :
కొత్త సంవత్సరంతో మొదలైన మద్యం హడావిడి సంక్రాంతి వరకూ కొనసాగి పదిహేను రోజుల్లోనే సర్కారుకు జిల్లాలోని మందుబాబులు రూ.65 కోట్ల ఆదాయం సమకూర్చారు. జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. పల్లెలు, పట్టణాలు అనే భేదం లేకుండా జిల్లా అంతటా మద్యం గోదావరితో సమానంగా పరవళ్లు తొక్కింది. సంక్రాంతి పర్వదినాల్లో పందేలతోపాటు మద్యం కూడా ముఖ్య భూమిక పోషించడం బాధాకరమే అయినా వ్యాపారులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది.
ఆ రోజుల్లోనే... : ఏడాదిలో మద్యం అమ్మకాలు జనవరి మొదటి పక్షంలోనే ఎక్కువగా జరుగుతాయి. గతేడాది డిసెంబరు 31వ తేదీ నుంచి సంక్రాంతి పర్వదినం వరకు మద్యం అమ్మకాలదే పెద్ద పీట. కొత్త సంవత్సరం, భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఊపందుకోవడం సహజమే. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ పరిధిలో అధికారికంగా 500 మద్యం షాపులు, 34 బారులున్నాయి. అనధికారికంగా ప్రతి షాపు పరిధిలో బెల్టుషాపులున్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.3కోట్ల పైబడి మద్యం విక్రయాలు సాగుతుంటాయి.
రూ.65.77 కోట్ల అమ్మకాలు.. : ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో ఒక లక్ష 71 వేల ఇండియ¯ŒS మేడ్ లిక్కర్ (ఐఎంఎల్), 73,673 కేసుల బీరు విక్రయాలు సాగాయి. దీని ద్వారా రూ.65.77 కోట్ల విక్రయాలు జరిగాయి గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గాయనే చెప్పాలి. గతేడాది జనవరి నెల మొత్తం మూడు లక్షల 30 వేల 981 మద్యం కేసులు, ఒక లక్షల 61 వేల 326 బీరు కేసుల అమ్మకాలు జరగ్గా...వీటి ద్వారా 132 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీన్ని బట్టి చూస్తే గతేడాది కంటే జనవరి మొదటి పక్షంలో దాదాపుగా రూ.5 కోట్ల వరకు అమ్మకాలు తగ్గాయని చెప్పవచ్చు. గతంతో పోల్చితే ఆదాయం కొంతమేర తగ్గినా ఈ 15 రోజుల్లో అమ్మకాలు రూ.50 కోట్లు అధిగమించి సాగాయి. ఎక్సైజ్ అమ్మకాలు కొంతమేర తగ్గడానికి పెద్ద నోట్ల రద్దు ప్రభావమేనని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
చాటుమాటుగా సారా అమ్మకాలు..
ఎక్సైజ్ అధికారులు సారా బట్టీలపై దాడులు కొనసాగిస్తున్నా..సారా తయారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి. సారా తయారీదారులు రహస్య మార్గాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి సరఫరా చేశారు. లిక్కర్, కోడిపందాల కారణంగా జేబుల్లో డబ్బులు ఖర్సై పోయిన మందుబాబులు సారాకు ఎగబడ్డారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ కోసం రూ.80లు వెచ్చించాలి. కేవలం రూ.20కే గ్లాసు సారా లభించడంతో కొంతమంది వాటి వైపు పరుగులు తీశారు.