Fund Advisor
-
లాభాలు తెచ్చి పెట్టే ఈ 'ఈక్విటీ ఫండ్' గురించి మీకు తెలుసా?
ఈక్విటీల్లో మెరుగైన రాబడులు ఆశించే వారు ఫోకస్డ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు భారీ సంఖ్యలో స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండవు. ఎంపిక చేసిన కొన్ని స్టాక్స్‌పైనే ఫోకస్ (ప్రత్యేక దృష్టి) పెడతాయి. ఈ విభాగంలో ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ నమ్మకమైన పనితీరు ప్రదర్శిస్తోంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకత. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్ అవుతుంది. ఈ పథకానికి 2009 నుంచి ఆర్ శ్రీనివాసన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదొక అనకూలత. గతంలో ఎస్బీఐ ఎమర్జింగ్ ఫండ్‌తో నడిచిన ఈ పథకం పేరు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌గా మారింది. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో సుదీర్ఘకాల ట్రాక్ రికార్డు ఈ పథకం సొంతం. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 50 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. ఇందులోనూ ముత్తూట్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పీఅండ్‌జీ హైజీన్, దివిస్ ల్యాబ్స్‌లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 30 శాతం పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగ కంపెనీల్లో 12 శాతం, సేవల రంగ కంపెనీల్లో 10 శాతానికి పైగా పెట్టుబడులను కలిగి ఉంది. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. లార్జ్‌క్యాప్‌లో 57 శాతం, మిడ్‌క్యాప్‌లో 43 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడుల్లో కొంత మేర విదేశీ స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ క్లాస్ఏ షేర్లలో 5 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోనూ 3 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఈ తరహా స్టాక్స్ ఎంపిక వల్లే ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల చరిత్ర ఉంది. రాబడులు దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉంది. గడిచి ఏడాది కాలంలో ఒక శాతం నష్టాలను ఇచ్చింది. కానీ, మూడేళ్ల కాలంలో వార్షిక రాబడి 12.50 శాతంగా ఉంది. ఐదేళ్లలోనూ 12.85 శాతం, ఏడేళ్లలో 12.65 శాతం, పదేళ్లలో 16 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచి్చంది. కానీ, బీఎస్ఈ 500టీఆర్ఐ రాబడి ఐదేళ్లలో 11.5 శాతం, ఏడేళ్లలో 11.30 శాతం, పదేళ్లలో 13.80 శాతంగానే ఉంది. ఫ్లెక్సీక్యాప్ సగటు రాబడి చూసినా మూడేళ్లలో 11 శాతం, ఐదేళ్లలో 9.76 శాతం, ఏడేళ్లలో 9.86 శాతం, పదేళ్లలో 13.60 శాతం చొప్పున ఉంది. ఇండెక్స్, ఫ్లెక్సీక్యాప్ విభాగం కంటే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉంది. 2004 నుంచి ఈ పథకం పనిచేస్తోంది. నాటి నుంచి చూస్తే వార్షిక రాబడి రేటు 18 శాతానికి పైనే ఉండడం గమనించాలి. -
లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాఫిట్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
2020 ఫిబ్రవరి నుంచి చూస్తే ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లను గమనించొచ్చు. కరోనా వచ్చిన సమయంలో అమ్మకాల ఒత్తిడికి షేర్ల ధరలు కకావికలం అయ్యాయి. ఆ తర్వాతి మూడు–ఆరు నెలలకే మార్కెట్లు ర్యాలీ బాటలో కుదురుకుని ఏడాదిన్నర పాటు నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. ఇప్పుడు గత ఆరు నెలలుగా అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. మార్కెట్ల గరిష్టాల్లో ఇన్వెస్ట్ చేయకపోయినా, కనిష్టాల్లో పెట్టుబడులు కొనసాగించడం పెట్టుబడుల ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ పెరుగుదల, తరుగుదలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్స్ అనే షేరును మార్కెట్ ర్యాలీలో సిప్ ద్వారా రూ.100కు కొనుగోలు చేస్తారు. అదే షేరును దిద్దుబాటులో రూ.80–70కు కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు సగటు అవుతుంది. ఇక మార్కెట్లలో ఎన్నో విభాగాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఫోకస్డ్ ఫండ్స్ గురించి తప్పక చెప్పుకోవాలి. పోర్ట్‌ఫోలియోలో బండెడు స్టాక్స్‌ను పోగేసుకోకుండా.. చాలా పరిమిత స్టాక్స్‌నే ఎంపిక చేసుకుంటాయి. వాటిపైనే ఫండ్ మేనేజ్మెంట్ బృందం దృష్టి ఉంటుంది. కనుక వీటి రాబడుల్లో ఎక్కువ స్థిరత్వం ఉంటుందని ఆశించొచ్చు. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్ 25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాబడులు ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 15 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 18 శాతం, ఐదేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో బెంచ్ మార్క్ పనితీరు కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండడం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది. పెట్టుబడుల వ్యూహాలు/ పోర్ట్‌ఫోలియో సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 23 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 69 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్ అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది.ఈ పథకం నిర్వహణలో 19,777 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90 శాతాన్నే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మేర డెట్ సాధనాల్లో పెట్టింది. పెట్టుబడుల్లోనూ లార్జ్‌క్యాప్‌లోనే 94 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిడ్‌క్యాప్‌నకు 5.65 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 35.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత సర్వీసెస్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. -
ఫండ్స్... ఏవి బెస్ట్..
ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అయేషా ఈ మధ్యనే వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. చిన్నప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ముందుకెళ్ళిన అయేషా ఇప్పుడు ఉద్యోగం చేయడం ప్రారంభించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా అదే విధానాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకొని ఫండ్ అడ్వైజర్‌ని సంప్రదించింది. అడ్వైజర్‌తో సంభాషించిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మూడు అంశాలు ఆకర్షించాయి. ఇందులో మొదటిది అయేషా స్వల్పకాలిక దృష్టితో కాకుండా దీర్ఘకాలానికి సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించింది. అలాగే ఈ రంగంలో బాగా అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఇవ్వడం రెండోది. అలాగే ఇన్వెస్ట్మెంట్ విధానం చాలా సులభంగా ఉండటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదును వెనక్కి తీసుకునే అవకాశం ఉండటం మరింత ఆకర్షించింది. అయేషా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుందే కానీ... ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలన్నది ఇప్పుడు అతిపెద్ద సమస్య. సుమారు 40 ఫండ్ హౌస్‌లు 1,000కిపైగా పథకాలను అందిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఈక్విటీలు చక్కటి అవకాశంగా భావిస్తున్న అయేషా డెట్ పథకాల్లో కాకుండా కేవలం ఈక్విటీ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. కానీ ఈక్విటీల్లో కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ, బ్యాలెన్స్డ్, మిడ్‌క్యాప్, సెక్టర్ ఫండ్స్ అంటూ అనేక రకాలున్నాయి. ఇప్పుడు వీటిల్లో వేటిని ఎంచుకోవాలన్నది కూడా సమస్యే. అయేషా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక ప్రకారం బ్యాలెన్స్డ్, మిడ్ క్యాప్ ఫండ్స్ అనుకూలం కాదు. ఇక మిగిలినది డైవర్సిఫైడ్ ఈక్విటీ, సెక్టర్ ఫండ్స్. ఇప్పుడు ఈ రెండింటిలో ఉన్న లాభనష్టాలను పరిశీలిద్దాం.. తేడా ఏమిటి.. డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్... పేరుకు తగ్గట్టుగానే ఈ ఫండ్ అత్యధికంగా వివిధ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. కొంతమొత్తం చిన్న షేర్లకు కేటాయిస్తుంది. ఈ ఫండ్ ముఖ్యోద్దేశం సాధ్యమైనంత వరకు స్టాక్ మార్కెట్లో ఉండే నష్టభయాన్ని తగ్గించడమే. ఇందుకోసం ఒకదానితో ఒకటి సంబంధం లేని షేర్లను ఎంపిక చేసుకుంటారు. ఇంకా సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే.. మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని బ్యాంకులు, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు కేటాయించారనుకుందాం. ఒక్కసారి వడ్డీరేట్లు పెరగడం మొదలైతే ఈ మూడు రంగాలు బాగా దెబ్బతింటాయి. దీంతో భారీ నష్టాలను మూటకట్టుకోవాల్సి వస్తుంది. వడ్డీరేట్లు తగ్గితే లాభాలు కూడా అదే విధంగా వస్తాయి కానీ అది వేరే విషయం. ఇలా ఒక సంఘటన వల్ల ఎక్కువ నష్టాలు రాకుండా ఉండే విధంగా పోర్ట్‌ఫోలియోలో విభిన్న రంగాలకు చెందిన పెద్ద కంపెనీల షేర్లు ఉండే విధంగా చూస్తారు. ఇక సెక్టర్ ఫండ్స్ విషయానికి వస్తే ఇవి కేవలం ఒక సెక్టర్‌కి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఉదాహరణకు ఫార్మా ఫండ్‌ను తీసుకుంటే ఈ పథకం కేవలం ఫార్మా కంపెనీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తుంది. అదే బ్యాంక్ ఫండ్ బ్యాంకు షేర్లలో, ఎఫ్ఎంసీజీ ఫండ్ ఆ రంగానికి చెందిన ఎఫ్ఎంసీజీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. వీటిలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఆ రంగం పనితీరు బాగున్నప్పుడు మంచి లాభాలు వస్తాయి. కానీ ఇదే సమయంలో ఆ రంగం పనితీరు బాగోకపోతే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. గత మూడేళ్లను పరిశీలిస్తే ఫార్మా ఫండ్స్ సగటున 19.5 శాతం రాబడిని ఇస్తే, బ్యాంకింగ్ ఫండ్స్ 5.2 శాతం, టెక్నాలజీ ఫండ్ 22 శాతం లాభాలను అందించాయి. ఇదే సమయంలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ 11.4 శాతం లాభాలను ఇచ్చాయి. దీన్ని బట్టి మీరు దేన్ని ఎంచుకుంటారు? లక్ష్యం ఏమిటి? స్టాక్ మార్కెట్లో ఉండే సహజమైన నష్ట భయాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ అధిక లాభాలను పొందాలన్న ఉద్ధేశంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ముఖ్యంగా రిటైర్మెంట్, పిల్లల చదువు వంటి లక్ష్యాలకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒక లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేసేవారికి సెక్టర్ ఫండ్స్ అనుకూలంగా ఉండవు. ఒకసారి ఆ రంగంలో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. మూడేళ్ల క్రితం ఐటీ సెక్టర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మంచి లాభాలు వచ్చాయి. కానీ ఇదే సమయంలో బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఏ సెక్టర్ పనితీరు బాగుంటుందో ముందుగా ఊహించడం చాలా కష్టమైన పని. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలకు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ అనువుగా ఉంటాయి. ఒకేసారి విభిన్నమైన రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ భయాన్ని తగ్గించుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రిస్క్ చేస్తానంటే... డైవర్సిఫైడ్ ఫండ్స్ కాకుండా సెక్టర్ ఫండ్స్‌ను ఎంచుకుంటే ఆ మేరకు మీ పోర్ట్‌ఫోలియోలో రిస్క్ భయం పెరుగుతుంది. సెక్టర్ ఫండ్స్‌లో మూడు రకాలైన భయాలుంటాయి. ఉదాహరణకు ఫార్మా సెక్టర్‌ను తీసుకుంటే... యూఎస్ ఎఫ్‌డీఏ నిబంధనల వల్ల గడచిన ఏడాది నుంచి ఫార్మా షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇలా మన అంచనాలకు సంబంధం లేకుండా బయటి సంఘటనల వల్ల కొన్ని సందర్భాల్లో ఆయా రంగాలు ఒత్తిడిని ఎందుర్కొంటాయి. అలాగే సెక్టర్ ఫండ్స్‌లో లార్జ్ క్యాప్ షేర్లు చాలా తక్కువ ఉంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు చిన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీంతో పోర్ట్‌ఫోలియోలో రిస్క్ మరింత పెరుగుతుంది. డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో పోలిస్తే సెక్టర్ ఫండ్స్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అయేషా ఏమి చేయాలి? ♦ చివరగా అయేషా పోర్ట్‌ఫోలియో ఏవిధంగా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ♦ డైవర్సిఫైడ్ ఫండ్స్‌తో అనేక లాభాలున్నాయి కాబట్టి ప్రధానంగా వీటిపైనే దృష్టిపెట్టాలి. ♦ అయేషా చిన్న వయస్సులోనే ఉద్యోగం ప్రారంభించింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లో కొంత రిస్క్ చేయొచ్చు. సెక్టర్ ఫండ్స్ పనితీరును పరిశీలించడం కోసం పోర్ట్‌ఫోలియోలో గరిష్టంగా 20 శాతం మించకుండా సెక్టర్ ఫండ్స్‌కు కేటాయించుకోవచ్చు. ♦ ఒకేసారిగా కాకుండా ప్రతినెలా ఇన్వెస్ట్ చేసే విధంగా సిప్ విధానాన్ని ఎంచుకోవాలి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల నుంచి లబ్ధి పొందొచ్చు. ♦ సెక్టర్ ఫండ్స్ పనితీరును మధ్యమధ్యలో పరిశీలించాలి. ఒకవేళ పనితీరు బాగోలేకపోతే.. వాటినుంచి వైదొలిగి ఆ మొత్తాన్ని తిరిగి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌కు మరల్చాలి. - అనిల్ రెగో సీఈవో, రైట్ హొరెజైన్స్