2020 ఫిబ్రవరి నుంచి చూస్తే ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లను గమనించొచ్చు. కరోనా వచ్చిన సమయంలో అమ్మకాల ఒత్తిడికి షేర్ల ధరలు కకావికలం అయ్యాయి. ఆ తర్వాతి మూడు–ఆరు నెలలకే మార్కెట్లు ర్యాలీ బాటలో కుదురుకుని ఏడాదిన్నర పాటు నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. ఇప్పుడు గత ఆరు నెలలుగా అమ్మకాల ఒత్తిడిని చూస్తున్నాయి. మార్కెట్ల గరిష్టాల్లో ఇన్వెస్ట్ చేయకపోయినా, కనిష్టాల్లో పెట్టుబడులు కొనసాగించడం పెట్టుబడుల ప్రాథమిక సూత్రాల్లో ఒకటి.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ పెరుగుదల, తరుగుదలతో సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్స్ అనే షేరును మార్కెట్ ర్యాలీలో సిప్ ద్వారా రూ.100కు కొనుగోలు చేస్తారు. అదే షేరును దిద్దుబాటులో రూ.80–70కు కూడా కొనుగోలు చేస్తారు. కొనుగోలు సగటు అవుతుంది. ఇక మార్కెట్లలో ఎన్నో విభాగాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అందులో ఫోకస్డ్ ఫండ్స్ గురించి తప్పక చెప్పుకోవాలి. పోర్ట్‌ఫోలియోలో బండెడు స్టాక్స్‌ను పోగేసుకోకుండా.. చాలా పరిమిత స్టాక్స్‌నే ఎంపిక చేసుకుంటాయి. వాటిపైనే ఫండ్ మేనేజ్‌మెంట్ బృందం దృష్టి ఉంటుంది. కనుక వీటి రాబడుల్లో ఎక్కువ స్థిరత్వం ఉంటుందని ఆశించొచ్చు. ఈ విభాగంలో యాక్సిస్ ఫోకస్డ్ 25 మ్యూచువల్ ఫండ్ పథకం మంచి పనితీరుతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
రాబడులు
ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 15 శాతం రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో 18 శాతం, ఐదేళ్ల కాలంలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకం సొంతం. మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో బెంచ్ మార్క్ పనితీరు కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ పథకం 2012లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు వార్షిక రాబడులు సగటున 16 శాతం పైనే ఉండడం మెరుగైన పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోనూ అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న పథకాల్లోనూ యాక్సిస్ ఫోకస్డ్ 25 అగ్ర పథాన ఉంది.
పెట్టుబడుల వ్యూహాలు/ పోర్ట్‌ఫోలియో
సెబీ నిబంధనల ప్రకారం ఫోకస్డ్ ఫండ్స్ గరిష్టంగా 30 స్టాక్స్ వరకు పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉండొచ్చు. ఈ పథకం మాత్రం 25 స్టాక్స్‌నే పరిమితిగా పెట్టుకుంది. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 23 స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే మొత్తం పెట్టుబడుల్లో 69 శాతం వరకు ఇన్వెస్ట్ చేసి ఉంది. బోటమ్ అప్ విధానాన్ని స్టాక్స్ ఎంపికకు పాటిస్తుంది. స్థిరమైన, అధిక నాణ్యతతో కూడిన వ్యాపారాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడుల్లో సగం మేర తక్కువ అస్థిరతలు కలిగిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ తగ్గించుకునే వ్యూహాన్ని అనుసరిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, స్టాక్స్ వ్యాల్యూషన్లను గమనిస్తూ, రిస్క్ ఎక్కువగా ఉన్న విభాగం నుంచి తక్కువగా ఉండే విభాగానికి పెట్టుబడులను మళ్లించే వ్యూహాలను పాటిస్తుంది.ఈ పథకం నిర్వహణలో 19,777 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90 శాతాన్నే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన మేర డెట్ సాధనాల్లో పెట్టింది. పెట్టుబడుల్లోనూ లార్జ్‌క్యాప్‌లోనే 94 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిడ్‌క్యాప్‌నకు 5.65 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, పెట్టుబడుల్లో 35.5 శాతం మేర వీటిల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత సర్వీసెస్, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment