ఈసీ ఉత్తర్వులు సరికాదు
నిధుల సేకరణపై పార్టీల డిమాండ్
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయం, నిధుల సమీకరణలో పారదర్శకత పాటించాలంటూ ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. అసందిగ్ధంగా ఉన్న వీటిని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. రూ.20,000 దాటిన విరాళాలను నగదుగా స్వీకరించరాదని, చెక్కుల ద్వారానే సేకరించాలని ఈసీ స్పష్టం చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయంది. దీనిపై పార్టీలు అభ్యంతరం తెలిపాయి.
న్యాయపరంగా ఇవి చెల్లుబాటు కావని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని పార్టీలతో చర్చించటంతోపాటు న్యాయశాఖ సలహా తీసుకోవాలని కాంగ్రెస్ నేత వోరా సూచించారు. ఈమేరకు ఆయన ఈసీకి లేఖ రాశారు. సమావేశాలు, వీధుల్లో చందాల సేకరణ ద్వారా విరాళాలు సమకూర్చుకుంటున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. హుండీలో చందాలు వేసే దాతలకు రసీదులు ఇవ్వాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపింది. ఈసీ ఉత్తర్వులో పలు అంశాలు చెల్లవని, వీటికి తప్పుడు భాష్యాలు చెప్పే అవకాశం ఉందని సీపీఎం పేర్కొంది.