ఫండ్ ఆల్ఫా అంటే ఏమిటి?
కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది లోపు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే, 1 శాతం కోత ఉంటుందని నా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ స్టేట్మెంట్ వెల్లడిస్తోంది. ఇలా ఎందుకు?
-అవినాష్, కాకినాడ
మ్యూచువల్ ఫండ్స్ స్వల్పకాలిక పెట్టుబడులను ప్రోత్సహించవు. స్వల్పకాలంలో పెట్టుబడులను ఉపసంహరిస్తే, ఇతర ఇన్వెస్టర్ల లాభాలపై ప్రభావం పడుతుంది. అందుకనే దీనిని నిరోధించేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్‌ను లేదా కంటింజెంట్ డిఫర్డ్ సేల్స్ చార్జ్(సీడీఎస్‌సీ)ను విధిస్తాయి. ఉదాహరణకు, మార్కెట్లు పతనంలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించాలని కోరతారు. వారి కోరిక మేరకు ఈ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఈ సెక్యూరిటీలను నష్టాలకు విక్రయించాల్సి ఉంటుంది. దీంతో ఆ ఫండ్ ఎన్ఏవీ పడిపోతుంది. ఇతర ఇన్వెస్టర్ల లాభాలపై ఈ ప్రభావం ఉంటుంది. అందుకే స్వల్పకాలిక పెట్టుబడులను ఎగ్జిట్ లోడ్ కొంత మేరకు నిరోధిస్తుందని చెప్పవచ్చు. ఇక ఏడాది లోపు మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, కొంత శాతం(సుమారుగా 1 శాతం) ఈ ఎగ్జిట్ లోడ్ విధిస్తారు. ఉదాహరణకు ఎవరైనా ఇన్వెస్టర్ రూ.10,000 యూనిట్లను విక్రయిస్తే, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ 1 శాతం ఎగ్జిట్ లోడ్ (రూ.100) చార్జ్ చేస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ ప్లాన్స్‌లో లాభాలతో పాటే ఎన్ఏవీ కూడా పెరుగుతుంది. డివిడెండ్ ప్లాన్స్‌లో డివిడెండ్ లభిస్తుంది. మరి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎందుకు?
-జాన్సన్, మధిర
ఈ మూడు ప్లాన్స్- గ్రోత్ ప్లాన్, డివిడెండ్ ప్లాన్, డివిడెండ్ రీ ఇన్వెస్ట్ ప్లాన్లలో లాభాల విషయంలో ఎలాంటి తేడా ఉండదు. గ్రోత్ ఆప్షన్ విషయంలో రిటర్న్‌లు ఫండ్ నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ)లో ప్రతిఫలిస్తాయి. అంటే ఆ మేరకు ఎన్ఏవీ పెరుగుతుంది. ఇక డివిడెండ్ ఆప్షన్ ప్లాన్‌లో ఇన్వెస్టర్లకు నిర్ణీత కాల వ్యవధుల్లో డివిడెండ్ చెల్లించడం జరుగుతుంది. ఇక డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ విషయానికొస్తే వచ్చిన డివిడెండ్‌ను మరలా అదే ఫండ్‌లో రీ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో మ్యూచువల్ ఫండ్ యూనిట్ల సంఖ్య పెరుగుతాయి. ఈ ఆప్షన్లో కొత్త ఎన్ఏవీ వద్ద యూనిట్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. త్వరలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ) అమల్లోకి రానున్నది. డీటీసీ ప్రకారం..., ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లపై 5 శాతం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి పన్ను బాధ్యత లేదు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే గ్రోత్ ప్లాన్స్ బెటర్. ఇక మీ పెట్టుబడులపై క్రమం తప్పకుండా ఆదాయం అవసరం లేదనుకుంటే గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
సిప్ విధానంలో ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఫండ్ ఆల్ఫా ప్రస్తుతం రుణాత్మకంగా ఉంది. ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా?
- ప్రవల్లిక, నెల్లూరు
ఆల్ఫా అంటే ఒక ఫండ్ ఆశించిన రాబడి రేటు కంటే అధికంగా ఆర్జించిన రాబడి. ఫండ్ ఆశించిన రాబడి రేట్ ఆ ఫండ్ రిస్క్ బేటాపై ఆధారపడి ఉంటుంది. ఆల్ఫా ధనాత్మకంగా ఉంటే, ఆఫండ్ పనితీరు ఆశించిన దానికంటే బావుందని అర్థం. ఆల్ఫా రుణాత్మకంగా ఉంటే ఆశించిన దానికంటే ఆ ఫండ్ పనితీరు బాగాలేదని అర్థం. వాల్యూ రీసెర్ఛ్ సంస్థలో నిఫ్టీని బెంచ్‌మార్క్‌గా తీసుకుని ఈక్విటీ ఫండ్స్ ఆల్ఫాను లెక్కిస్తాం. దీంతో వివిధ ఈక్విటీ ఫండ్స్ పనితీరును పోల్చడానికి వీలవుతుంది.
అందుకే ఒక ఫండ్ ఆల్ఫా ఆ ఫండ్ కేటగిరిలో సాపేక్ష రిఫరెన్స్‌గా ఉపయోగపడుతుంది. మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరిలో అన్ని ఫండ్స్ ఆల్ఫాను పరిశీలించినట్లయితే, ఒక్క ఆరు ఫండ్స్ మినహా అన్ని ఫండ్స్ ఆల్ఫా రుణాత్మకంగానే ఉంది. ఇక మీరు ఇన్వెస్ట్ చేసిన ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ ఫండ్ విషయానికొస్తే, ప్రస్తుతం ఈ ఫండ్ ఆల్ఫా రుణాత్మకంగా ఉన్నా, ఈ కేటగిరిలో 12వ అధిక ఆల్ఫా సాధించిన ఫండ్ ఇదేనని గుర్తించాలి. ఈ కేటగిరి ఫండ్‌లో ఆశించిన రాబడులకు, వాస్తవ రాబడులకు మధ్య భేదం తక్కువగా ఉన్న ఫండ్స్‌ల్లో ఇది కూడా ఒకటి.