funds waste
-
పుప్పాలగూడ సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్
రాజేంద్రనగర్: విధుల దుర్వినియోగంతో పాటు ప్రజలు పన్నుల రూపంలో గ్రామపంచాయతీకి చెల్లించిన డబ్బుతో పాటు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధులను దుర్వినియోగం చేసిన పుప్పాలగూడ గ్రామ సర్పంచ్ ఎం.సునీతారాజ్‌కుమార్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు షోకాజ్ నోటీసు జారీ చేశారు. రూ.4.43కోట్ల నిధులు దుర్వినియోగం చేయడంతో పాటు రూ.1.22 కోట్లను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చుచేసినట్టు తేలింది. హైదరాబాద్ నగర శివారు, గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామపంచాయతీకి కోట్లల్లో ఆదాయం ఉంటుంది. వాటిని సక్రమంగా ఖర్చుచేసి ప్రజావసరాలను తీర్చాల్సిన సర్పంచ్ పంచాయతీరాజ్ నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టాతిరాజ్యంగా ఖర్చుచేయటం, కోట్ల నిధులను ఖర్చుచేయకున్నా తప్పుడు బిల్లులు పెట్టి స్వాహా చేసినట్టు గ్రామానికి చెందిన కొండా బాల్‌రాజ్ అనే వ్యక్తి లోకాయుక్తలో 2016 డిసెంబరులో ఫిర్యాదు చేశారు. దీంతో అదే నెలలో జిల్లా పంచాయతీ అధికారి సదరు సర్పంచ్‌కు నోటీసు జారీ చేసి కొత్తూరు ఈవోపీఆర్డీని విచారణాధికారిగా నియమించారు. విచారణ చేపట్టిన అధికారి 2017 నవంబర్‌లో నివేదిక అందజేశారు. అప్పటి నుంచి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిన అధికారులు ఎట్టకేలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఎన్ని రోజుల్లో సర్పంచ్ తమ సంజాయిషీ ఇవ్వాలో పేర్కొనకుండా నోటీసు జారీ వెనక రాజకీయ ఒత్తిళ్లు పనిచేసినట్టు ఆరోపణలు వినవస్తున్నాయి. -
కాసులున్నా.. రోడ్లు సున్నా
మచిలీపట్నం సబర్బన్ : గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ విడుదల చేసిన కోట్లాది రూపాయలు స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగమవుతున్నాయి. నిధులు విడుదలై ఏడాది కావస్తున్నా పనులను పూర్తి చేయటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలున్నాయి. తారు రోడ్ల అభివృద్ధికి నిధులిస్తే... మండల పరిధిలోని పెదయాదర, పోలాటితిప్ప, వాడపాలెం గ్రామాల్లో అంతర్గత రహదారులను బీటీ (తారు) రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎన్సీఆర్ఎంపీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. పెదయాదలో రోడ్ల అభివృద్ధి నిమిత్తం ఎన్సీఆర్ఎంపీ నిధులు రూ 75 లక్షలు, పోలాటితిప్పలో ఎన్సీఆర్ఎంపీ నిధులు 75 లక్షలు, పోలాటితిప్ప గ్రామ పంచాయతీ శివారు కొత్తకాలనీలో రోడ్ల అభివృద్ధికి ఎన్సీఆర్ఎంపీ నిధుల రూ 1.16 కోట్లు, వాడపాలెంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ 45 లక్షలు మంజూరు చేసింది. మొత్తం రూ.3.10 కోట్లు వచ్చాయి. ఈ పనులను 2015 డిసెంబర్ నెలలో మంత్రి కొల్లు రవీంద్ర అట్టహాసంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుపై కేవలం డస్ట్, కంకరతో కూడిన ఒక లేయర్ పోసి పత్తా లేకుండా పోయాడు. దాదాపు ఆరు నెలలుగా పనులు ఊసేఎత్తడం లేదు. పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం రహదారుల అభివృద్ధి విషయంపై అమ్మ పెట్టనూ పెట్టదు.. అడుక్కుతిననివ్వదూ అనే మోటు సామెతలాగ ప్రభుత్వ వైఖరి ఉందని గ్రామస్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, కేంద్రం విడుదల చేసిన నిధులనూ సద్వినియోగం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సగం వేసిన రోడ్డుపై మెనతేలిన కంకర రాళ్లు గుచ్చుకుని కాళ్లకు పుళ్లు పడుతున్నాయని, వాహనాలకు పంచర్లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా మట్టి రోడ్లపైనే నడకసాగిస్తూ నరకయాతన అనుభవించిన తాము నిధులు విడుదలవగానే సంతోషించామని, పాలకుల కుటిల రాజకీయాలవల్లే రోడ్ల అభివృద్ధి నిలిచిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సీతానగరం ఘాట్ వద్ద బారికేడ్లు తొలగింపు
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా సీతానగరం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు. భారీ అంచనాలతో కృష్ణా పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేసింది. అందులో భాగంగా దుర్గా, కృష్ణవేణి, పున్నమి, సీతానగరం, పద్మావతి, తాళ్లాయపాలెం, అమరావతి, పవిత్రసంగమం ఘాట్లు ముఖ్యమైనవి. ఒక్కో ఘాట్‌కు సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేసింది. ఘాట్ వద్ద రూ.15 లక్షలతో ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లలలో సీతానగరం ఘాట్‌కు ఎక్కువ మంది భక్తులు పాల్గొంటారని భావించిన అధికారయంత్రాంగం ఉండవల్లి సెంటర్ నుంచి మూడులైన్ల బారికేడ్లను ఏర్పాటు చేసింది. కాని ఆ మేరకు యాత్రికులు రాకపోవడంతో ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు. -
మూడునాళ్ల ముచ్చటే..!
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అమ్మవారి సొమ్ము వృథా అవుతోంది. అధికారుల ఆదేశాలు మూడు నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో నిత్యం జరిగే అన్నదానానికి ఉపయోగించే ప్లేట్స్ స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. అయితే కొత్త ప్లేట్స్ కొనుగోలు చేసి నెల రోజులు కాకుండా అవి మూలకు చేరాయి. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ప్లేట్స్ నిరుపయోగంగా మారినా ఆలయ అధికారులకు పట్టడం లేదు. అమ్మవారి ఆలయానికి ఇచ్చిన విరాళాలను ఇలా దుర్వినియోగం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి అన్నప్రసాదాన్ని గుండ్రంగా ఉండే ప్లేట్స్‌లో భక్తులకు వడ్డించే వారు. ఇందు కోసం దేవస్థానం వెయ్యి వరకు ప్లేట్స్ ఉపయోగించే వారు. గత నెల వరకు ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు నిర్వహించిన ఆజాద్ ప్లేట్స్‌ను మార్చాలని నిర్ణయించారు. రోజుకు ఒక ప్లేట్‌ను ఒకసారి మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటూ 5 వేల ప్లేట్లను కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్లేట్లో కూరలు కలిసిపోకుండా ఉండే వాటిని కొనుగోలు చేయాలని అన్నదాన విభాగ అధికారులను ఆదేశించారు. దీంతో సుమారు రూ. 9 లక్షల వ్యయంతో రెండు వేల ప్లేట్లు, ట్రాలీలను కొనుగోలు చేశారు. గత నెల 26న కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్‌లో అన్నదానాన్ని ప్రారంభించారు. అయితే ఆలయ ఈవో మారినప్పుడల్లా వారు చేసిన నిర్ణయాలు మారుతాయనేది దుర్గగుడిపై ప్రచారంలో ఉంది. అదే తరహాలో ఈవోగా సూర్యకుమారి వచ్చిన వెంటనే కొత్తగా కొనుగోలు చేసిన ప్లేట్స్ స్థానంలో గతంలో ఉపయోగించిన రౌండ్ ప్లేట్స్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో రూ. 9 లక్షలతో కొనుగోలు ప్లేట్స్ నిరుపయోగంగా మారాయి. నీటి కొరత కూడా మరో కారణం కొండపై ఉన్న అమ్మవారి అన్నదానాన్ని అర్జున వీధిలోని శృంగేరీ పీఠానికి ఇటీవల మార్చారు. అయితే అక్కడ నీటి కొరత కూడా ప్లేట్స్ మార్చేందుకు మరో కారణంగా ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్లేట్స్ శుభ్రం చేసేందుకు ఎక్కువగా నీటి వినియోగించాల్సి వస్తుందంటున్నారు.