కాసులున్నా.. రోడ్లు సున్నా
కాసులున్నా.. రోడ్లు సున్నా
Published Sun, Aug 28 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
మచిలీపట్నం సబర్బన్ :
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ విడుదల చేసిన కోట్లాది రూపాయలు స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగమవుతున్నాయి. నిధులు విడుదలై ఏడాది కావస్తున్నా పనులను పూర్తి చేయటంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలున్నాయి.
తారు రోడ్ల అభివృద్ధికి నిధులిస్తే...
మండల పరిధిలోని పెదయాదర, పోలాటితిప్ప, వాడపాలెం గ్రామాల్లో అంతర్గత రహదారులను బీటీ (తారు) రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఆర్‌ఎంపీ, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులు విడుదల చేసింది. పెదయాదలో రోడ్ల అభివృద్ధి నిమిత్తం ఎన్‌సీఆర్‌ఎంపీ నిధులు రూ 75 లక్షలు, పోలాటితిప్పలో ఎన్‌సీఆర్‌ఎంపీ నిధులు 75 లక్షలు, పోలాటితిప్ప గ్రామ పంచాయతీ శివారు కొత్తకాలనీలో రోడ్ల అభివృద్ధికి ఎన్‌సీఆర్‌ఎంపీ నిధుల రూ 1.16 కోట్లు, వాడపాలెంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ 45 లక్షలు మంజూరు చేసింది. మొత్తం రూ.3.10 కోట్లు వచ్చాయి. ఈ పనులను 2015 డిసెంబర్ నెలలో మంత్రి కొల్లు రవీంద్ర అట్టహాసంగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుపై కేవలం డస్ట్, కంకరతో కూడిన ఒక లేయర్ పోసి పత్తా లేకుండా పోయాడు. దాదాపు ఆరు నెలలుగా పనులు ఊసేఎత్తడం లేదు.
పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
రహదారుల అభివృద్ధి విషయంపై అమ్మ పెట్టనూ పెట్టదు.. అడుక్కుతిననివ్వదూ అనే మోటు సామెతలాగ ప్రభుత్వ వైఖరి ఉందని గ్రామస్తులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వడం లేదని, కేంద్రం విడుదల చేసిన నిధులనూ సద్వినియోగం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. సగం వేసిన రోడ్డుపై మెనతేలిన కంకర రాళ్లు గుచ్చుకుని కాళ్లకు పుళ్లు పడుతున్నాయని, వాహనాలకు పంచర్‌లు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏన్నో ఏళ్లుగా మట్టి రోడ్లపైనే నడకసాగిస్తూ నరకయాతన అనుభవించిన తాము నిధులు విడుదలవగానే సంతోషించామని, పాలకుల కుటిల రాజకీయాలవల్లే రోడ్ల అభివృద్ధి నిలిచిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
Advertisement