శ్మశానాలూ హాంఫట్
జిల్లాలో 150 ఎకరాలకు పైగా కబ్జా
తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి శివారుల్లో ఎక్కువ
అనువైన చోట్ల రెచ్చిపోతున్న రియల్టర్లు
భూముల ధరలు పెరగడమే కారణం
మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల్లో ఉదాసీనత
జిల్లాలో శ్మశానాలు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. వాగులు, వంకలు, చెట్లు, గట్లను అనువుగా చేసుకుని ఆయా గ్రామాల్లో శవ దహనాలతో కూడిన అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. వానొచ్చినా, వరదొచ్చినా శవ దహనాలు కష్టమైనా భరిస్తున్నారు. మరో కోణంలో చూస్తే....చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలను బడా బాబులు, రియల్టర్లు ఆక్రమిస్తున్నారు. రాత్రికి రాత్రే హద్దులు తొలిగించి సొంత భూముల్లో కలిపేసుకుంటున్నారు. అధికార, రాజకీయ బలాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పూనుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 ఎకరాల మేర శ్మశాన భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు శివారుల్లోనే ఈ ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 1,360 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 50 శాతం గ్రామాల్లోనే అధికారికంగా నిర్దేశించిన శ్మశానాలున్నాయి. మిగతా చోట్ల లేవు. కాలువ గట్లు, వాగుల అంచులు, పొలిమేర కాలిబాటల్లోనూ, రహదారుల పక్కన శవ దహనాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా శ్మశాన భూములున్న ప్రాంతాల్లోనూ ఇటీవల ఆక్రమణలు పెరుగుతున్నాయి. జిల్లాలోని 100 కి పైగా గ్రామాల్లోనూ, ప్రధాన మున్సిపల్ శివారుల్లోనూ శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. విద్య, వైద్యం, పారిశ్రామికంగా పలు పట్టణాలను అభివృద్ధి పర్చనున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. దీంతో పట్టణాలకు శివారున రియల్ వ్యాపారులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. వీటికి పక్కనే ఉన్న పంట భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి విక్రయించే క్రమంలో శ్మశానాలనూ ఆక్రమిస్తున్నారు.
తిరుపతి పట్టణంలో మొత్తం 8 చోట్ల శ్మశాన భూములున్నాయి. ఇక్కడ అంకణం ధర వేలల్లో ఉండటంతో రియల్ వ్యాపారులు, రాజకీయ నేతల కన్ను వీటిపై పడింది. నగరానికి మధ్యలో ఉండే ఎస్టీవీ నగర్ శ్మశాన వాటిక పక్కనున్న సుమారు 10 సెంట్లకు పైగా ఆక్రమణలకు గురవుతోంది. పక్కనే ఉన్న మఠం భూముల పేరు చెబుతున్న కొంతమంది బడాబాబులు శ్మశానానికి కేటాయించిన జాగాను కూడా కబ్జా చేస్తున్నారని సమాచారం.
తిరుపతి రూరల్ మండలంలోని చెర్లోపల్లి, సీ మల్లవరం, వేమూరు గ్రామాల్లో శ్మశాన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీ.మల్లవరం శ్మశాన భూములను ఆక్రమించి రోడ్లు నిర్మించిన వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకున్నారు.
చిత్తూరులో కైలాసపురం వద ఉన్న శ్మశాన వాటకిలో 80 సెంట్లు ఇప్పటికే ఆక్రమణలో ఉంది. జానకారపల్లె వద్ద సగానికి పైగా ఆక్రమించుకున్నారు. ఇరువారం, కొంగారెడ్డిపల్లె వద్ద నున్న శ్మశాన వాటికలు సైతం ఆక్రమణలో ఉన్నాయి.
గుడిపాల మండలం నంగమంగళం, మరకాలకుప్పం, 197రామాపురం గ్రామాల్లోని శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయని మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు. ఈ శ్మశాన భూముల్లో కొందరు గానుగ మిషన్లు పెట్టారు. మరికొందరు సారా తయారీ చేసి విక్రయిస్తున్నారు.
శ్రీకాళహస్తి వాసులు స్వర్ణవుుఖినదినే శ్మశానవాటికగా వినియోగిస్తారు. టీడీపీ నేతలు ఇసుకను తరలించే నేపథ్యంలో శ్మశానాలు తవ్వేస్తున్నారు. దీంతో వుృతదేహాలు బయటపడుతున్నాయి. అదేవిధం బీవీపురం, వుుచ్చివోలు, అక్కుర్తి, చుక్కలనిడిగల్లు గ్రావూల్లో శ్మశానాలు అక్రమించారు.
తొట్టంబేడు వుండలంలోని కొనతనేరి,కొన్నలి,కనపర్తి,చిట్టత్తూరు,బోనుపల్లి గ్రావూల్లోనూ శ్మశానాలను కొందరు ఆక్రమించారు. ఏర్పేడు వుండలం గుల్లకండ్రిగ, కందాడు, నచ్చనేరి, నాగంపల్లి గ్రావూల్లో టీడీపీ నేతలు శ్మశాలను అక్రమించారని ఆరోపణలున్నాయి.
సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 15 ఎకరాల వరకు శ్మశాన స్థలాలు ఆక్రమణకు గురై ఉన్నాయి. సత్యవేడు మండల పరిధిలో చెన్నేరి, చిన్న ఈటిపాకం, మోటుపాళెం గ్రామాల పరి«ధిలో 2 ఎకరాల శ్మశాన భూములు ఆక్రమణల పాలయ్యాయి.
వరదయ్యపాళెం మండలంలోని బత్తలావల్లం, కడూరు, ఆంబూరు, కళత్తూరు, కరింజలం గ్రామాల పరిధిలో సుమారు 10 ఎకరాలు స్థలం ఆక్రమణకు గురైంది.
నాగలాపురం మండలంలో వెళ్లూరు దళితవాడ శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురై ఉంది. శవాలు తీసుకు వెళ్లేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. పిచ్చాటూరు, శేషంపేట, కారూరు, అడవి కొడింబేడు, బంగాళా గ్రామాల పరిధిలో సుమారు మూడు ఎకరాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది.
పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో హిందూ శ్మశానవాటిక దురాక్రమణకు గురైంది. దీనిపై ప్రజలు పలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీని కారణంగా అంత్యక్రియలు నిర్వహించే ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.