funeral money
-
తల్లి అంత్యక్రియలకు కూతుళ్ల భిక్షాటన
సాక్షి, జగిత్యాల : తల్లి అంత్యక్రియలకు డబ్బు లేక కూతుళ్లు భిక్షాటన చేసిన దైన్య ఘటన శనివారం జగిత్యాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. భర్త, కొడుకు సైతం భిక్షాటన చేయగా... స్పందించిన ముస్లిం నాయకులు ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. కూతుళ్లు కన్నతల్లి చివరి చూపునకు నోచుకోలేకపోయారు. మహారాష్ట్రలోని బిలోలి ప్రాంతానికి చెందిన మస్తాన్ తన భార్య ముంతాజ్, చిన్నాన్న పెద్ద మస్తాన్, ముగ్గురు పిల్లలతో కలిసి జగిత్యాలకు నెల రోజుల క్రితం వచ్చారు. ఇక్కడే భిక్షాటన చేస్తూ జిల్లాకేంద్రంలోని టౌన్హాల్లో సేద తీరుతున్నారు. ఓ వైపు అర్ధాకలి, మరోవైపు అనారోగ్యంతో మస్తాన్ భార్య ముంతాజ్ శనివారం ప్రాణాలు విడిచింది. భార్య మృతితో మస్తాన్ నిశ్చేష్టుడయ్యాడు. మస్తాన్ కూతుళ్లు ముంతాజ్(10), మున్నీ(7) తాతతో కలిసి తల్లి అంత్యక్రియలకు అవసరమైన డబ్బు కోసం భిక్షాటనకు వెళ్లారు. మస్తాన్ చిన్నకొడుకు అబ్దుల్లాతో కలిసి భార్య శవం వద్ద ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న మెకానిక్‌లు స్పందించి అంత్యక్రియల కోసం తలాకొంత డబ్బు జమచేశారు. భిక్షాటనకు వెళ్లిన వారు సాయంత్రమైనా తల్లి శవం వద్దకు చేరుకోలేదు. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు అంత్యక్రియలు చేసేందుకు ముందుకొచ్చారు. చీకటి పడుతుండటంతో కూతుళ్లు రాకుండానే ముంతాజ్ శవాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. భిక్షాటనకు వెళ్లిన కూతుళ్లు తల్లి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయారు. రాత్రయినా పిల్లలు తండ్రి వద్దకు చేరుకోలేదు. -
అమ్మ అంత్యక్రియల ఖర్చు రూ.కోటి
సాక్షి, చెన్నై : దివంగత సీఎం అమ్మ జయలలితకు జరిగిన అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఖర్చు పెట్టింది. అపోలోలో వైద్య పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించనట్టు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు వెలుగులోకి వచ్చింది. అమ్మ జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది, చివరకు అనంత లోకాలకు వెళ్లారు. ఆమె మరణం అన్నాడీఎంకేకు తీరని లోటు. అన్నాడీఎంకే ముక్కలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అమ్మ మరణం మీద అనుమానాలు సైతం బయలు దేరడంతో అందుకు తగ్గ విచారణ సాగుతూవస్తోంది. ఈ పరిస్థితుల్లో మదురై కేకే నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సయ్యద్ సమీమ్ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా సీఎం ప్రత్యేక సెల్‌ను ఆశ్రయించారు. అమ్మ జయలలిత ఎప్పుడు మరణించారు? ఆమెకు అందించిన వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించింది? ఆమె అంత్యక్రియలకు ఏమేరకు ఖర్చు పెట్టారు?, జయలలిత ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కాబట్టి, మాజీలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఆమె తరఫున ఎవరు తీసుకుంటున్నారు? ఇలా పలు రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానం రాబట్టారు. ఈ వివరాలను ఆయన ఆదివారం బయట పెట్టారు. ఆ మేరకు ఆమ్మ మరణించిన తేదీని 5.12.2016గా పేర్కొన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదని వివరించారు. అంత్యక్రియల నిమిత్తం ప్రజా పనుల శాఖ తరఫున రూ.99 లక్షల 33 వేల 586 ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ కార్యదర్శి పరిధిలో ఉందని, ఈ దృష్ట్యా, ఇందుకు తగ్గ సమాధానం అసెంబ్లీ కార్యదర్శిని అడగాల్సిందేనని దాటవేశారు. -
అవ్వ మనసు బంగారం
నిజామాబాద్, న్యూస్‌లైన్ : 70 ఏళ్ల ఆ అవ్వ మనసు నిజంగా బంగారమే.. వెనుకా ముందూ ఎవరూ లేని ఆ పండుటాకు తాను మరణించిన అనంతరం చేయాల్సిన అంత్యక్రియల కోసం కొంత డబ్బును దాచుకుంది. ఓ పిల్లాడు చావుబతుకులలో ఉన్నాడని తెలిసి, అతడికి చికిత్స చేయించమని దాచుకున్న సొమ్మునంతా విరాళంగా ఇచ్చేసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ డబ్బును అందుకుంటూనే ఆనందబాష్పాలు రాల్చారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌కాలనీకి చెందిన షేక్ చాంద్ పెద్ద కుమారుడు జావీద్ పాషా(8) కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. పైగా ఓ ద్విచక్రవాహనం ఢీకొనడంతో కాలు విరిగిపోయింది. ఆస్పత్రికి తీసుకు వెళితే బాలుడికి వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. రెక్కాడితే కాని, డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఈ పరిణామాలతో తల్లడిల్లిపోయింది. దాతల వైపు చూపు సారించింది. బాలుడి దీనస్థితిని వివరిస్తూ ‘సాక్షి’ జిల్లా అనుబంధంలో ఈనెల 12న ‘కాలేయ వ్యాధితో బాలుడి అవస్త’ శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురితమైంది. ఈ విషయం అదే కాలనీలో నివాసముండే రాజవ్వ (70)కు తెలిసింది. ఈమెకు సంతానం లేదు. భర్త చనిపోయి చాలా ఏళ్లయింది. దీంతో తన అంత్యక్రియల కోసం తానే ఓ పదివేల రూపాయలను బ్యాంకులో దాచుకుంది. ఈ డబ్బు ఆ బాలుడికి ఉపయోగపడుతుందేమోనని ఆలోచించి, వారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆ డబ్బును అందజేసింది. కాగా, ఇదే అవ్వ నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టకు చెందిన దొంతుల పోసాని అనే పేద మహిళ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేయలేక బాధపడుతుంటే... తాను నివసిస్తున్న ఇంటిని అమ్మి రూ. రెండు లక్షలు వారికి అప్పుగా సమకూర్చి కిరాయి ఇంట్లోకి వెళ్లింది. ఆ తర్వాత వారు కూలీకి వెళ్లే దుస్థితిని చూసి.. తనకూ ఎవరూ లేరని భావించి ఆ అప్పును మాఫీ చేసి తన పెద్ద మనసును చాటుకుంది. ‘ఉన్నంతలో సహాయం చేస్తే దేవుడు చల్లగా కాపాడతాడని’ వినమ్రంగా చెబుతోంది. ఆ అవ్వ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనమూ కోరుకుందాం.