జయలలిత పార్థివ దేహం (ఫైల్)
సాక్షి, చెన్నై : దివంగత సీఎం అమ్మ జయలలితకు జరిగిన అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఖర్చు పెట్టింది. అపోలోలో వైద్య పరీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించనట్టు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల మేరకు వెలుగులోకి వచ్చింది. అమ్మ జయలలిత 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది, చివరకు అనంత లోకాలకు వెళ్లారు. ఆమె మరణం అన్నాడీఎంకేకు తీరని లోటు. అన్నాడీఎంకే ముక్కలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. అమ్మ మరణం మీద అనుమానాలు సైతం బయలు దేరడంతో అందుకు తగ్గ విచారణ సాగుతూవస్తోంది. ఈ పరిస్థితుల్లో మదురై కేకే నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సయ్యద్ సమీమ్ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా సీఎం ప్రత్యేక సెల్‌ను ఆశ్రయించారు.
అమ్మ జయలలిత ఎప్పుడు మరణించారు? ఆమెకు అందించిన వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించింది? ఆమె అంత్యక్రియలకు ఏమేరకు ఖర్చు పెట్టారు?, జయలలిత ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కాబట్టి, మాజీలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ఆమె తరఫున ఎవరు తీసుకుంటున్నారు? ఇలా పలు రకాల ప్రశ్నల్ని సంధించి, సమాధానం రాబట్టారు. ఈ వివరాలను ఆయన ఆదివారం బయట పెట్టారు. ఆ మేరకు ఆమ్మ మరణించిన తేదీని 5.12.2016గా పేర్కొన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని చెల్లించలేదని వివరించారు. అంత్యక్రియల నిమిత్తం ప్రజా పనుల శాఖ తరఫున రూ.99 లక్షల 33 వేల 586 ఖర్చు పెట్టినట్టు పేర్కొన్నారు. పెన్షన్ వ్యవహారం అసెంబ్లీ కార్యదర్శి పరిధిలో ఉందని, ఈ దృష్ట్యా, ఇందుకు తగ్గ సమాధానం అసెంబ్లీ కార్యదర్శిని అడగాల్సిందేనని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment