అవ్వ మనసు బంగారం
నిజామాబాద్, న్యూస్‌లైన్ : 70 ఏళ్ల ఆ అవ్వ మనసు నిజంగా బంగారమే.. వెనుకా ముందూ ఎవరూ లేని ఆ పండుటాకు తాను మరణించిన అనంతరం చేయాల్సిన అంత్యక్రియల కోసం కొంత డబ్బును దాచుకుంది. ఓ పిల్లాడు చావుబతుకులలో ఉన్నాడని తెలిసి, అతడికి చికిత్స చేయించమని దాచుకున్న సొమ్మునంతా విరాళంగా ఇచ్చేసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ డబ్బును అందుకుంటూనే ఆనందబాష్పాలు రాల్చారు. వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌కాలనీకి చెందిన షేక్ చాంద్ పెద్ద కుమారుడు జావీద్ పాషా(8) కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. పైగా ఓ ద్విచక్రవాహనం ఢీకొనడంతో కాలు విరిగిపోయింది. ఆస్పత్రికి తీసుకు వెళితే బాలుడికి వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. ఇందుకు రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. రెక్కాడితే కాని, డొక్కాడని ఆ నిరుపేద కుటుంబం ఈ పరిణామాలతో తల్లడిల్లిపోయింది.
దాతల వైపు చూపు సారించింది. బాలుడి దీనస్థితిని వివరిస్తూ ‘సాక్షి’ జిల్లా అనుబంధంలో ఈనెల 12న ‘కాలేయ వ్యాధితో బాలుడి అవస్త’ శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురితమైంది. ఈ విషయం అదే కాలనీలో నివాసముండే రాజవ్వ (70)కు తెలిసింది. ఈమెకు సంతానం లేదు. భర్త చనిపోయి చాలా ఏళ్లయింది.
దీంతో తన అంత్యక్రియల కోసం తానే ఓ పదివేల రూపాయలను బ్యాంకులో దాచుకుంది. ఈ డబ్బు ఆ బాలుడికి ఉపయోగపడుతుందేమోనని ఆలోచించి, వారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆ డబ్బును అందజేసింది. కాగా, ఇదే అవ్వ నాలుగేళ్ల క్రితం నిజామాబాద్ ఎల్లమ్మ గుట్టకు చెందిన దొంతుల పోసాని అనే పేద మహిళ ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేయలేక బాధపడుతుంటే... తాను నివసిస్తున్న ఇంటిని అమ్మి రూ. రెండు లక్షలు వారికి అప్పుగా సమకూర్చి కిరాయి ఇంట్లోకి వెళ్లింది. ఆ తర్వాత వారు కూలీకి వెళ్లే దుస్థితిని చూసి.. తనకూ ఎవరూ లేరని భావించి ఆ అప్పును మాఫీ చేసి తన పెద్ద మనసును చాటుకుంది. ‘ఉన్నంతలో సహాయం చేస్తే దేవుడు చల్లగా కాపాడతాడని’ వినమ్రంగా చెబుతోంది. ఆ అవ్వ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనమూ కోరుకుందాం.