అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా
సిడ్నీ : ప్రపంచంలో ఏ పిల్లాడైనా సరే తన తండ్రి గొప్పదనం తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా మురిసిపోతారో చెప్పనవసరం లేదు. అందులోనూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి విలువను అందరూ గుర్తించినప్పుడు ఆ పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కార్చిచ్చు ధాటికి అమరుడైన తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతని సాహసానికి గుర్తుగా తన 19 నెలల కూతురుకు వోడయ్యర్ వాడిన హెల్మట్‌తో పాటు మెడల్‌ను బహూకరించారు. వీటిని ఆ పాప ధరించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులు భావోద్వేగానికి గురవడం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చూసిన ప్రతీ వీక్షకుడి గుండె బరువెక్కుతుంది.
వివరాల్లోకి వెళితే.. ప్రసుత్తం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న ఫైర్ ఫైటర్స్ కార్చిచ్చు నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఇంజన్లో వెళ్లారు. అయితే ఒక్కసారి కార్చిచ్చు మంటలు మరింతగా వ్యాపించి వారు వెళుతున్న వాహనంపై పడడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. అందులో 36 ఏళ్ల వోడయ్యర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ నుంచి ఫైర్‌ఫైటర్‌గా తన సేవలందిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీలో వోడయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా 12 మంది ఫైర్ ఫైటర్స్ వరుసగా నిలబడి వోడయ్యర్ మృతదేహానికి హార్డ్ ఆఫ్ గానర్తో గౌరవించారు. అనంతరం వోడయ్యర్ 19 నెలల కూతురైన చార్లెట్‌ను హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని అందించారు. ' చార్లెట్.. ఈరోజు నీ తండ్రి ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి, దేశకోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిజమైన హీరో అయ్యారు. అతని సేవను మేము ఎప్పటికి గుర్తుంచుకుంటాం' అంటూ అధికారి ఫిట్జ్‌సిమ్మన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. 19 నెలల చార్లెట్ తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని ధరించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ దంపతులు వోడయ్యర్ కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకొని వారిని ఓదార్చారు. రెండు నెలలుగా ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుకు ఇప్పటివరకు 26 మంది ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలు కోల్పోగా, వేలాది జంతువులు బలయ్యాయి.