G-20 Summit: మళ్లీ దారిమళ్లిన జీ–20
వర్తమానం యుద్ధశకంగా మారకూడదని, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు అంతమొందించటానికి అన్ని పక్షాలూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిస్తూ రెండురోజులపాటు ఇండొనేసియా లోని బాలిలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సు బుధవారం ముగిసింది. దేశాలమధ్య ఆర్థిక సహకారం పెంపొందించటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరచాలన్న సంకల్పంతో 23 ఏళ్లక్రితం ఈ సంస్థ ఏర్పడింది. కానీ ఆరంభం నుంచీ ఇతరేతర సంక్షోభాలు దాన్ని ముసురుకుంటున్నాయి. పర్యవసానంగా శిఖరాగ్ర సదస్సు ఎజెండాపై కాక ఎప్పటికప్పుడు ముంచుకొచ్చే క్లిష్ట సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించక తప్పడం లేదు. జీ–20 సామాన్యమైనది కాదు. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఈ సంస్థ సభ్య దేశాల వాటా 80 శాతం. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం ఈ దేశాలదే. ఇక జనాభారీత్యా చూస్తే దాదాపు మూడింట రెండువంతుల మంది ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. బాలి శిఖరాగ్ర సదస్సు ఎదుట పెద్ద ఎజెండాయే ఉంది.
దాదాపు ఏణ్ణర్థంపాటు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో భవిష్యత్తు సంక్షోభాలను ఎదుర్కొనడానికి అంతర్జాతీయంగా పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ రూపకల్పనపై సమాలోచనలు ఈ సదస్సు లక్ష్యం. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత సమర్థవంతంగా అమలయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని కూడా ముసాయిదా తెలిపింది. స్వచ్ఛ ఇంధన వనరుల వినియోగం పెరిగేలా, ప్రపంచ దేశాలు ఆ దిశగా మళ్లేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాలని కూడా సంకల్పించారు. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. అందు కోసం సంపన్న దేశాలు ఏం చేయాలో కూడా ఈ సదస్సులో చర్చించాల్సి ఉంది. కానీ రెండురోజుల సదస్సునూ గమనిస్తే నిరాశే మిగులుతుంది.
నిరుడు అక్టోబర్‌లో ఇటలీలోని రోమ్‌లో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ ఏడాది కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీ–20 సభ్య దేశాల్లో కోవిడ్ పర్యవసానంగా ఉత్పాదకత గణనీయంగా పడిపోయింది. మన దేశం వరకూ చూస్తే ఉత్పాదకతలో 14 శాతం క్షీణత కనబడుతోంది. అందరికన్నా అధికంగా నష్టపోయింది మనమే. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగకపోయివుంటే ఆర్థిక వ్యవస్థలు ఇంత చేటు నష్టపోయేవి కాదేమో! కానీ దురాక్రమణ, అనంతరం రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు తీసుకొచ్చిన అనిశ్చితి ద్రవ్యోల్బణాన్ని అమాంతం తారస్థాయికి చేర్చింది. పర్యవసానంగా వేరే దేశాల మాటేమోగానీ పశ్చిమ దేశాల కొనుగోలు శక్తి పడిపోయింది. వృద్ధిని అది కోలుకోలేని దెబ్బతీసింది. ఈ గండంనుంచి గట్టెక్కేందుకు చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఇది సహజంగానే ఆర్థిక కార్య కలాపాలపై ప్రభావం చూపింది. అమెరికా, బ్రిటన్లు ఆర్థిక మాంద్యంలోకి జారుకునే సూచనలు కనబడుతున్నాయి.
యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి స్తంభించే దిశగా కదులుతున్నాయంటున్నారు. ఆకలి, నిరుద్యోగం ఇప్పటికే చాలా దేశాలను చుట్టుముట్టాయి. ఇక ప్రపంచ ఆర్థిక చోదక శక్తుల్లో ఒకటైన చైనాను రియల్ ఎస్టేట్ సంక్షోభం పీడిస్తోంది. దాంతో ఆ దేశ జీడీపీ బాగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దీన్నుంచి బయటపడటం మాట అటుంచి కనీసం తక్కువ నష్టంతో గట్టెక్కాలన్నా జీ–20 దేశాలమధ్య సహకారం, సమన్వయం, ఐక్యత అవసరం. ఈ శిఖరాగ్ర సదస్సు ఎజెండాలోని అంశాల మాట అటుంచి కనీసం సభ్య దేశాల ఐక్యతకు అనువైన కార్యాచరణ రూపొందించగలిగితే బాగుండేది. కానీ అది సాధ్యపడినట్టు కనబడటం లేదు. ఈమధ్య ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై ఐఎంఎఫ్ విడుదల చేసిన నివేదిక ఒక ముఖ్యమైన సూచన చేసింది. జీ–20 దేశాలన్నీ సమష్టిగా కదలి, గట్టి కార్యాచరణకు పూనుకొంటే ప్రస్తుత సంక్షోభంనుంచి ప్రపంచం గట్టెక్కుతుందని తెలిపింది. ఇందుకు శాంతి నెలకొనడం అవసరమని వివరించింది. కానీ వినేదెవరు? సదస్సు మొదటి రోజున కూడా ఉక్రెయిన్ ప్రధాన నగరాలపై రష్యా క్షిపణి దాడులు చేసింది. నాటో సభ్యదేశమైన పోలాండ్‌లో రష్యా క్షిపణి ఒకటి పేలి ఇద్దరు పౌరులు మరణించారు. ఇది ఉద్దేశపూర్వకమా, పొరపాటా అన్నది నిర్ధారణ కాలేదు. ఆ క్షిపణి రష్యా భూభాగంనుంచి
ప్రయోగించివుండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెబుతున్నారు. రష్యా ఉద్దేశపూర్వ కంగా చేసివుంటే అది నాటోకు తొలి హెచ్చరిక పంపినట్టే అనుకోవాలి.
ఈసారి జీ–20 సదస్సు మొత్తం రష్యా–ఉక్రెయిన్ లడాయిపైనే కేంద్రీకరించక తప్పని స్థితి ఏర్ప డింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సదస్సుకు రాలేదన్న మాటేగానీ సదస్సు మొత్తం ఆయన చుట్టూ, ఆయన మున్ముందు వేయబోయే అడుగుల చుట్టూ తిరిగింది. ఏతావాతా ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి ప్రపంచం తిరోగమించిందనే చెప్పుకోవాలి. రష్యా–పాశ్చాత్య దేశాల వైషమ్యాలు పెచ్చుమీరాయి. దీనికి చైనా తలనొప్పి అదనం. అందువల్లనే ప్రధాన ఎజెండా మాట అటుంచి అసలు రష్యా దురాక్రమణను ఖండిస్తూ జీ–20 ఒక సంయుక్త ప్రకటనైనా విడుదల చేయగలదా అన్న సందేహాలు తలెత్తాయి. అనుకున్నట్టే ఆ ప్రకటనలో హితబోధలే ధ్వనించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 1న జీ–20 సారథ్య బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రెండు ప్రపంచ యుద్ధాల పర్యవసానంగా మానవజాతి మనుగడకు ఏర్పడిన ముప్పును గుర్తుంచుకునైనా సంపన్న రాజ్యాలు కయ్యానికి కాలుదువ్వే పోకడలకు స్వస్తిపలకాలి. శాంతి నెలకొనడానికి దోహదపడాలి.