‘పారిశ్రామిక భద్రత’పై హైదరాబాద్‌లో వర్క్‌షాప్
హైదరాబాద్: ‘పారిశ్రామిక భద్రత, అత్యవసర అప్రమత్తత’ అంశాలపై జాతీయ భద్రతా కౌన్సిల్ రాష్ట్ర విభాగం, రాష్ట్ర పరిశ్రమల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమల అసోసియేషన్ కార్యాలయంలో ఒక రోజు వర్క్‌షాప్ జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు పరిశ్రమలకు చెందిన 175 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ డెరైక్టర్ జి.బాల కిషోర్ ఈ వర్క్‌షాప్‌ను ప్రారంభించి ప్రసంగించారు.
వర్క్‌షాప్‌లు పరిశ్రమల్లో భద్ర తా వ్యవస్థలు మరింత మెరుగుపడడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికేగాకుండా, ప్రణాళిక, సంసిద్ధత, పారిశ్రామిక అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగపడే సమాచారం అందుతుందని ఆయన చెప్పారు. పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సదాశివరెడ్డి మాట్లాడుతూ.. ఈ వర్కషాప్ భద్రతా ప్రమాణాలు పెరగడానికి దోహదం చేస్తుందని అన్నారు. పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఎ.బాలాజీ శ్రీధర్ మాట్లాడుతూ.. అన్ని ఫ్యాక్టరీల ప్రతినిధులు ఈ సదస్సుల్లో పాల్గొని, ఆ నిర్ణయాలను పరిశ్రమల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వర్క్‌షాప్‌లో టి.ఈ.సీ విద్యాసాగర్, ఎం.వెంకన్న, బి.రాజగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.