G K Vasan
-
‘కాంగ్రెస్’ల పోరు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని రెండు ‘కాంగ్రెస్’ల మధ్య పోరు ఊపందుకుంది. ఉన్నవారు చేజారకుండా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ), వలసలకు వలవేస్తూ తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) పోటాపోటీగా సిద్ధం అవుతున్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ మూడు దశాబ్దాల క్రితమే స్వయంశక్తిని కోల్పోయింది. ప్రాంతీయ పార్టీల అండే దిక్కుగా నెట్టుకొస్తోంది. కామరాజనాడార్ తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై ఆ పార్టీ నేతలే ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో గడిచిన పార్లమెంటు ఎన్నిక లు రాష్ట్ర కాంగ్రెస్‌ను మరింత దీనావస్థలోకి నెట్టేశాయి. పదేళ్ల పాలన తో అనేక అప్రతిష్టల పాలైన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు ఏపార్టీ ముందు కు రాలేదు. దీంతో విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒంటరిపోరుకు దిగింది. ఒక్కసీటు దక్కకపోగా డిపాజిట్లను కోల్పోయింది. చతికిలపడిన కాంగ్రెస్‌కు కొంతవరకు జవసత్వాలుగా నిలిచిన మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ అధిష్టానంపై అలిగి పార్టీ నుంచి వైదొలిగారు. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న జ్ఞానదేశికన్‌ను సైతం తనతో తెచ్చుకున్నారు. గతంలోకాంగ్రెస్‌లో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా)ను పునరుద్ధరించారు. జీకేవీ బలం, బలగమంతా కాంగ్రెస్‌లోనే ఉండడంతో బలమైన చీలికతెచ్చారు. 23 మంది టీఎన్‌సీసీ జిల్లా అధ్యక్షులను తమాకాలో చేర్చడంలో ఆయన సఫలీకృతులయ్యూరు. ప్రజల్లోకి పార్టీ అధినేతలు ఈ దశలో పార్టీ బలహీనం కాకుండా చూసే బాధ్యత టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడు ఇళంగోవన్‌పై పడింది. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో కలిసి శనివారం సత్యమూర్తి భవన్‌కు వచ్చిన ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు. తమాకాలోకి వెళ్లిపోయిన 23 మంది జిల్లా అధ్యక్షుల మాటేమిటని ప్రశ్నించగా, 23 మంది వెళ్లిపోయారని మీరంటున్నారు, మరో 43 మంది జల్లా అధ్యక్షులు ఇంకా మావైపే ఉన్నారని నేనంటున్నాను అని సమాధానం ఇచ్చారు. ఖాళీ అయిన 23 జిల్లా అధ్యక్షుల స్థానాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. తమాకాను దీటుగా ఎదుర్కొనే వ్యక్తులను అధ్యక్షులుగా నియమించేందుకు తాను స్వయంగా వెళుతున్నట్లు ప్రకటించారు. జీకేవీ రెండునెలల పర్యటన తమాకా అధ్యక్షుడు జీకేవాసన్ సైతం ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో రెండు నెలల పర్యటనను ఖరారు చేసుకున్నట్లు శనివారం ప్రకటించారు. చెరకు రైతులు, కావేరీ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న డెల్టా రైతులను కలుసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తమిళ మానిల కాంగ్రెస్ ఒక మహాశక్తిగా అవతరించడం ఖాయమన్నారు. తమాకాను మరేపార్టీ ఎదుర్కొన లేదన్నారు. ఒకేసారి రెండు ‘కాంగ్రెస్’ల అధినేతలు ప్రజల్లో వెళ్లాలని నిర్ణయించుకోవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. -
మద్దతు వేట
సాక్షి, చెన్నై:కొత్త పార్టీ ప్రకటన సభకు భారీ జన సమీకరణ లక్ష్యంగా జీకే వాసన్ కసరత్తుల్లో మునిగారు. ప్రజల మద్దతును కూడబెట్టుకునే విధంగా ప్రచార రథాల్ని సిద్ధం చేశారు. దివంగత నేతలు కామరాజర్, మూపనార్ల ప్రసంగాలు, వారి మీద రూపొందించిన సీడీల్ని ప్రజల్లోకి, కాంగ్రెస్ వాదుల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఇందుకోసం ఎల్ఈడీ స్క్రీన్‌తో సిద్ధం చేసిన ప్రచార రథాన్ని బుధవారం జెండా ఊపి సాగనంపారు. కాం గ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మద్దతుదారులతో తీవ్రమంతనాల్లో మునిగారు. కాంగ్రెస్వాదుల్ని, అసంతృప్తివాదుల్ని తన వైపు తిప్పుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. వాసన్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో తన తండ్రి మూపనార్, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌ల చరిష్మాను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. వారి ప్రసంగాలను, వారు చేసిన సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రచార రథాల్ని సిద్ధం చేసి వాడవాడల్లో తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రచార రథం ఈనెల 28న తిరుచ్చి వేదికగా జరగనున్న బహిరంగ సభకు భారీ జన సమీకరణతోపాటుగా, తన మద్దతు దారుల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా జీకే వాసన్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజాకర్షణే ధ్యేయంగా తన దైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, మరో వైపు ఏదేని ఘటనలు చోటుచేసుకున్న పక్షంలో నేరుగా అక్కడ ప్రత్యక్షం కావడం, ఓదార్చడం వంటి కార్యక్రమాల్లో వాసన్ నిమగ్నం అయ్యారు. గతంలో తన తండ్రి మూపనార్ ప్రజలకు చేసిన సేవల్ని మరో మారు గుర్తు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం అప్పటి ప్రసంగాలు, అప్పట్లో ఆయన చేసిన సేవల వీడియో క్లిప్పింగ్‌లను వెలికి తీశారు. అప్పటి ముఖ్యమంత్రి కామరాజర్ చేసిన సేవలు, ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటి సాధనే లక్ష్యంగా ముందుకు వస్తున్న తనను ఆదరించాలని పిలుపునిస్తూ ప్రచార రథాల్ని సిద్ధం చేశారు. ఎల్ఈడీ స్క్రీన్ కల్గిన ఈ ప్రచార రథాలు ఇక వాడవాడల్లో విహరించనున్నారుు. ఇందులో పార్టీ ప్రకటన సభకు తరలి రావాలని పిలుపునిస్తూ వాసన్ సందేశం, మూపనార్, కామరాజర్ పేర్లతో సిద్ధం చేసిన పాటలు, వీడియో క్లిప్పింగ్‌లను ప్రజాకర్షణ మంత్రంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. ఉదయం ఆళ్వార్‌పేటలో జరిగిన కార్యక్రమంలో సీడీలను జీకే వాసన్ విడుదల చేశారు.ఓ ప్రచార రథాన్ని జెండా ఊపి సాగనంపారు. బహిరంగ సభ ఏర్పాట్లను వేగవంతం చేస్తూ మద్దతుదారులకు సందేశం ఇచ్చారు. దీంతో గురువారం బహిరంగ సభ వేదిక వద్ద భూమి పూజకు సిద్ధం అయ్యారు. తిరుచ్చిలో భారీ బహిరంగ సభ వేదిక వెనుక కామరాజర్, మూపనార్ చిత్ర పటాలు, వారి మధ్యలో నుంచి, వారి ఆశీస్సులతో వాసన్ ప్రజల్లోకి వస్తున్నట్టుగా హోర్డింగ్ సిద్ధం చేయడానికి మద్దతుదారులు పరుగులు తీయడం విశేషం. బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వాసన్ సమక్షంలో తమ మద్దతును ప్రకటించారు. చెన్నైలోని కాంగ్రెస్ కౌన్సిలర్ వందన తన మద్దతు దారులతో కలిసి వాసన్‌కు మద్దతు ప్రకటించారు. -
'వంద రోజుల పాలనలో ఒరిగిందేమీ లేదు'
మధురై: నరేంద్ర మోడీ వంద రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ విమర్శించారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వంద రోజుల పాలనలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని ఆయన అన్నారు. అయితే ఏవిధంగా మేలు జరలేదన్న దానిపై వివరించేందుకు ఆయన ఇష్టపడలేదు. మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు కేంద్రం కృషి చేయాలన్నారు. చైనా నుంచి బాణాసంచా దిగుమతులను నిషేధించాలని ఆయన కోరారు. బాణాసంచా దిగుమతికి అనుమతిస్తే శివకాశితో సహా దక్షిణ తమిళనాడులో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడతారని వాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.