మద్దతు వేట
సాక్షి, చెన్నై:కొత్త పార్టీ ప్రకటన సభకు భారీ జన సమీకరణ లక్ష్యంగా జీకే వాసన్ కసరత్తుల్లో మునిగారు. ప్రజల మద్దతును కూడబెట్టుకునే విధంగా ప్రచార రథాల్ని సిద్ధం చేశారు. దివంగత నేతలు కామరాజర్, మూపనార్‌ల ప్రసంగాలు, వారి మీద రూపొందించిన సీడీల్ని ప్రజల్లోకి, కాంగ్రెస్ వాదుల్లోకి తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఇందుకోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌తో సిద్ధం చేసిన ప్రచార రథాన్ని బుధవారం జెండా ఊపి సాగనంపారు. కాం గ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన సత్తాను చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మద్దతుదారులతో తీవ్రమంతనాల్లో మునిగారు. కాంగ్రెస్‌వాదుల్ని, అసంతృప్తివాదుల్ని తన వైపు తిప్పుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. వాసన్ వెంట నడిచేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు బయలుదేరాయి. ఈ పరిస్థితుల్లో తన తండ్రి మూపనార్, మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌ల చరిష్మాను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. వారి ప్రసంగాలను, వారు చేసిన సేవల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మద్దతు కూడగట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రచార రథాల్ని సిద్ధం చేసి వాడవాడల్లో తిప్పేందుకు సిద్ధమయ్యారు.
ప్రచార రథం
ఈనెల 28న తిరుచ్చి వేదికగా జరగనున్న బహిరంగ సభకు భారీ జన సమీకరణతోపాటుగా, తన మద్దతు దారుల్లో ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా జీకే వాసన్ తన వ్యూహాలకు పదును పెట్టారు. ప్రజాకర్షణే ధ్యేయంగా తన దైన శైలిలో స్పందిస్తున్నారు. ఓ వైపు ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, మరో వైపు ఏదేని ఘటనలు చోటుచేసుకున్న పక్షంలో నేరుగా అక్కడ ప్రత్యక్షం కావడం, ఓదార్చడం వంటి కార్యక్రమాల్లో వాసన్ నిమగ్నం అయ్యారు. గతంలో తన తండ్రి మూపనార్ ప్రజలకు చేసిన సేవల్ని మరో మారు గుర్తు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం అప్పటి ప్రసంగాలు, అప్పట్లో ఆయన చేసిన సేవల వీడియో క్లిప్పింగ్‌లను వెలికి తీశారు. అప్పటి ముఖ్యమంత్రి కామరాజర్ చేసిన సేవలు, ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటి సాధనే లక్ష్యంగా ముందుకు వస్తున్న తనను ఆదరించాలని పిలుపునిస్తూ ప్రచార రథాల్ని సిద్ధం చేశారు.
ఎల్‌ఈడీ స్క్రీన్ కల్గిన ఈ ప్రచార రథాలు ఇక వాడవాడల్లో విహరించనున్నారుు. ఇందులో పార్టీ ప్రకటన సభకు తరలి రావాలని పిలుపునిస్తూ వాసన్ సందేశం, మూపనార్, కామరాజర్ పేర్లతో సిద్ధం చేసిన పాటలు, వీడియో క్లిప్పింగ్‌లను ప్రజాకర్షణ మంత్రంగా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. ఉదయం ఆళ్వార్‌పేటలో జరిగిన కార్యక్రమంలో సీడీలను జీకే వాసన్ విడుదల చేశారు.ఓ ప్రచార రథాన్ని జెండా ఊపి సాగనంపారు. బహిరంగ సభ ఏర్పాట్లను వేగవంతం చేస్తూ మద్దతుదారులకు సందేశం ఇచ్చారు. దీంతో గురువారం బహిరంగ సభ వేదిక వద్ద భూమి పూజకు సిద్ధం అయ్యారు. తిరుచ్చిలో భారీ బహిరంగ సభ వేదిక వెనుక కామరాజర్, మూపనార్ చిత్ర పటాలు, వారి మధ్యలో నుంచి, వారి ఆశీస్సులతో వాసన్ ప్రజల్లోకి వస్తున్నట్టుగా హోర్డింగ్ సిద్ధం చేయడానికి మద్దతుదారులు పరుగులు తీయడం విశేషం. బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు వాసన్ సమక్షంలో తమ మద్దతును ప్రకటించారు. చెన్నైలోని కాంగ్రెస్ కౌన్సిలర్ వందన తన మద్దతు దారులతో కలిసి వాసన్‌కు మద్దతు ప్రకటించారు.