‘కాంగ్రెస్‌కు ప్రశ్నించే దమ్ము లేదు’
వేములవాడ(రాజన్న సిరిసిల్ల): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దమ్ములేనిదైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. పండిత్ దీన్‌దయాళ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ‘గడపగడపకు బీజేపీ’ కార్యక్రమం మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీకి దమ్ము సరిపోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే పార్టీగా బీజేపీ అవతరించబోతోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు, రైతులకు ఎంతో విశ్వాసం ఉందని.. వచ్చేరోజుల్లో తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ సర్వే పేరుతో జనాల్ని మోసం చేస్తున్నారని.. కేవలం ఇది మైండ్‌గేమ్ అని, హౌస్ సర్వేలను తమ పార్టీ ఏమాత్రం పట్టించుకోబోదన్నారు.