కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తోంది: గాదె
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన విషయంలో కాంగ్రెస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకుని తప్పు చేసిందన్నారు. అన్నిపార్టీల ఏకాభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నామంటూ హైకమాండ్ పెద్దలు చెబుతున్న మాటలు సత్యదూరమన్నారు.
గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన విషయంలో అధిష్టానం తీరును తప్పుపట్టారు. బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐలకు సీమాంధ్రలో ప్రాతినిధ్యం లేదని, వాటి అభిప్రాయాల్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అదేసమయంలో సీపీఎం, ఎంఐఎంలు సమైక్య వాదన విన్పించడాన్ని గుర్తుచేశారు.
రాష్ట్రాన్ని విభజించాలని టీడీపీ లేఖ ఇవ్వగా, వైఎస్సార్సీపీ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని, నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని మాత్రమే చెప్పిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీమాంధ్ర, తెలంగాణప్రాంత నేతలు రెండుగా చీలిపోయారన్నారు. కేంద్రంలోని యూపీఏకు 226 సీట్లు మాత్రమే ఉన్నందున అది తీసుకున్నది మెజారిటీ నిర్ణయం కాదన్నారు.
అయినప్పటికీ వాస్తవాలకు భిన్నంగా దిగ్విజయ్‌సింగ్ మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ ఏనాడూ తెలంగాణ ఇస్తామని చెప్పలేదని గాదె అన్నారు. 2009 ఫిబ్రవరి 12న దివంగత సీఎం వైఎస్సార్ సైతం తెలంగాణకు వ్యతిరేకం కాదని, స్టేక్హోల్డర్ల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంద ని చెప్పారేతప్ప ఎవరితోనూ పనిలేకుండా విభజించాలని చెప్పనేలేదని అన్నారు.