gadhar
-
టీఆర్ఎస్ సర్కార్‌ను కూల్చేస్తాం
♦ అదే టీ–మాస్ లక్ష్యం ♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో భూస్వామ్య పెట్టుబడిదారి ప్రభుత్వాన్ని కూల్చడమే టీమాస్ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్‌గార్డెన్‌లో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం కోసం టీమాస్ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంబీసీ కుల వర్గీకరణ చేయకుండానే రూ.కోట్ల నిధులు మంజూరు చేసి మరోసారి బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విద్య, రాజకీయ రంగాల్లో ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 19శాతం రిజర్వేషన్లు పెంచడంతోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలన్నారు. దేశంలో 52శాతంగా ఉన్న బీసీలకు కేవలం పార్లమెంట్లో 19సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అన్ని కులాల వారు సంస్కృతి, సంప్రదాయలను సమాన రీతిలో గౌరవించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల వాటా ఆధారంగా రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జిల్లాలోని ప్రతి మండలం, గ్రామాల్లో టీమాస్ కమిటీలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వస్తే అండగా నిలుస్తుందన్నారు. ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదు : గద్దర్ ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదని ప్రజాయుద్ధనౌక, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్ అన్నారు. తెలంగాణ విముక్తికి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకునేంతా వరకు ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా భువనగిరిలో బెల్లి లలిత ప్రాణత్యాగం చేసిందన్నారు. భువనగిరి రాజకీయ తీర్మానాలకు ప్రసిద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, దానిని దెబ్బతిన్న ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఉద్యమానికి భువనగిరి చరిత్ర ఎంతో కీలకమైందన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఉద్యమ తీరును, ఆత్మబలిదానం, సామాజిక సమానత్వం, టీమాస్ లక్ష్యంపై కళా ప్రదర్శన ద్వారా సభికులను గద్దర్ ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల నాయకులు చేరుపల్లి సీతారాములు, పల్ల ఆశయ్య, శ్రీరాంనాయక్, ధర్మానాయక్, కూరపాటి రమేష్, సిర్పంగ శివలింగం, బెల్లి కృష్ణ, అబ్దుల్ ఖాదీర్, అజయ్‌కుమార్, సాయిబాబా, ఎండి.జహంగీర్, బట్టు రామచంద్రయ్య, మాటూరి బాలరాజు, చిలుకమారి గణేష్, ధారావత్ గణేష్‌నాయక్, బట్టుపల్లి అనురాధ, జాన్‌వేస్లీ, మేడి పాపయ్య, కందగట్ల స్వామి, దాస్‌రాం నాయక్, ఎండీ.అబ్బాస్, శోభన్‌నాయక్, రావుల రాజు పాల్గొన్నారు. -
రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలి
వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం కేయూ సదస్సులో ప్రజాగాయకుడు గద్దర్ కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : మానవ, ప్రకృతి వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. కేయూ సెనేట్హాల్లో ‘తెలంగాణ పు నర్నిర్మాణంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర’అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రాజకీయపార్టీలు భ్రష్టుపట్టిస్తున్నాయని, రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలని, రాజకీయాలకు లోబడి రాజ్యాంగం ఉండదన్నారు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పాటవుతున్న తెలంగాణ పునర్నిర్మాణం ఎలా ఉండాలనేది ఇప్పుడు చర్చగా ఉందన్నారు. కవు లు, కళాకారులు తెలంగాణ కోసం ధూంధాం నిర్వహించి ప్రజ లను చైతన్యపరిచారని వివరించారు. మన నీళ్లు, మన బొగ్గు, ఉద్యోగాలు, వనరులతో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. నాటి ఆర్ఈసీ, కేయూలో అనేక మంది ఉద్యమబాట పట్టారని, తాను ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదువుకున్నానని గుర్తుచేశారు. అడవిబాట పట్టిన తర్వాతే సామాజిక అంశాలపై చదువును నేర్చుకున్నానన్నారు. పునర్నిర్మాణంపై కేయూలో చర్చలు జరిపి ఒక డిక్లరేషన్‌గా తీర్మానం చేసి పంపించాలని ని ర్వాహకులకు గద్దర్ సూచించారు. తెలంగాణ కోసం అనేక గ్రా మాలకు కూడా వెళ్లామని, సీపీఐ, బీజేపీలాంటి వారితో కూడా కలిసి ఉద్యమించామని గుర్తుచేశారు. అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో మన వనరులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా చర్చించుకోవాలన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారన్నారు. రాబోయే తెలంగాణలోను దోపిడీ ప్రభుత్వాలు వస్తే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఓయూ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేయూ ప్రొఫెసర్ టి.జ్యోతి రాణి మాట్లాడుతూ మహిళలపై హింసలేని తెలంగాణను నిర్మించుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరిపల్లి సుజాత మాట్లాడుతూ తెలంగాణను ప్ర యోగశాలగా మార్చి సీమాంధ్ర పెట్టుబడిదారులు వనరులను కొల్లగొట్టారని ఆరోపించారు. కేయూ విద్యార్థులు తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకభూమిక పోశించాలన్నారు. నడస్తున్న తెలంగాణ ఎడిటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వసతులు లేవని తెలిపారు. సీమాంధ్రులు మన విద్య, సంస్కృతిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యూనివర్సిటీల బిల్లును తెలంగాణలో అమలు చేయకుండా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేయూ ప్రొఫెసర్ సీతారాంనాయక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సదస్సు కన్వీనర్ పి.మోహన్‌రాజు, బాధ్యు లు దబ్బెల మహేష్, దాసరి నివాస్, రంజిత్, యుగేందర్, వీరన్న, టి.రమేష్, డి.రమేష్, బాలరాజు, నరేందర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుదామని విద్యార్థులతో గద్దర్ ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. గద్దర్ ఆటపాటలతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.