
రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలి
- వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం
- కేయూ సదస్సులో ప్రజాగాయకుడు గద్దర్
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : మానవ, ప్రకృతి వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. కేయూ సెనేట్‌హాల్‌లో ‘తెలంగాణ పు నర్నిర్మాణంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర’అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రాజకీయపార్టీలు భ్రష్టుపట్టిస్తున్నాయని, రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలని, రాజకీయాలకు లోబడి రాజ్యాంగం ఉండదన్నారు.
తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పాటవుతున్న తెలంగాణ పునర్నిర్మాణం ఎలా ఉండాలనేది ఇప్పుడు చర్చగా ఉందన్నారు. కవు లు, కళాకారులు తెలంగాణ కోసం ధూంధాం నిర్వహించి ప్రజ లను చైతన్యపరిచారని వివరించారు. మన నీళ్లు, మన బొగ్గు, ఉద్యోగాలు, వనరులతో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. నాటి ఆర్‌ఈసీ, కేయూలో అనేక మంది ఉద్యమబాట పట్టారని, తాను ఆర్‌ఈసీలో ఇంజినీరింగ్ చదువుకున్నానని గుర్తుచేశారు.
అడవిబాట పట్టిన తర్వాతే సామాజిక అంశాలపై చదువును నేర్చుకున్నానన్నారు. పునర్నిర్మాణంపై కేయూలో చర్చలు జరిపి ఒక డిక్లరేషన్‌గా తీర్మానం చేసి పంపించాలని ని ర్వాహకులకు గద్దర్ సూచించారు. తెలంగాణ కోసం అనేక గ్రా మాలకు కూడా వెళ్లామని, సీపీఐ, బీజేపీలాంటి వారితో కూడా కలిసి ఉద్యమించామని గుర్తుచేశారు.
అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో మన వనరులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా చర్చించుకోవాలన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారన్నారు. రాబోయే తెలంగాణలోను దోపిడీ ప్రభుత్వాలు వస్తే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఓయూ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేయూ ప్రొఫెసర్ టి.జ్యోతి రాణి మాట్లాడుతూ మహిళలపై హింసలేని తెలంగాణను నిర్మించుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరిపల్లి సుజాత మాట్లాడుతూ తెలంగాణను ప్ర యోగశాలగా మార్చి సీమాంధ్ర పెట్టుబడిదారులు వనరులను కొల్లగొట్టారని ఆరోపించారు. కేయూ విద్యార్థులు తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకభూమిక పోశించాలన్నారు. నడస్తున్న తెలంగాణ ఎడిటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వసతులు లేవని తెలిపారు. సీమాంధ్రులు మన విద్య, సంస్కృతిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యూనివర్సిటీల బిల్లును తెలంగాణలో అమలు చేయకుండా చూడాలని కోరారు.
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేయూ ప్రొఫెసర్ సీతారాంనాయక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సదస్సు కన్వీనర్ పి.మోహన్‌రాజు, బాధ్యు లు దబ్బెల మహేష్, దాసరి నివాస్, రంజిత్, యుగేందర్, వీరన్న, టి.రమేష్, డి.రమేష్, బాలరాజు, నరేందర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుదామని విద్యార్థులతో గద్దర్ ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. గద్దర్ ఆటపాటలతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.